కాంగ్రెస్, టీడీపీ చౌకబారు ఆరోపణలు

హైదరాబాద్, 28 అక్టోబర్ 2013:

'సమైక్య శంఖారావం' బహిరంగ సభకు ప్రజల నుంచి వచ్చిన విశేష మద్దతును చూసి, దిక్కు తోచక, మతిపోయిన కాంగ్రెస్, టీడీపీ నాయకులు చౌకబారు ఆరోపణలు చేస్తున్నారని వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సీఈసీ సభ్యుడు, ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి విమర్శించారు. ఆ పార్టీలు దిగజారి ఆడుతున్న నటాకాలు సమాజం తల దించుకునేలా ఉన్నాయని నిప్పులు చెరిగారు. సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డికి చీమూ నెత్తురూ, సిగ్గు ఉంటే రాష్ట్ర అవతరణ దినోత్సవం నవంబర్ 1 లో‌గా అసెంబ్లీ సమావేశం నిర్వహించి సమైక్యాంధ్ర తీర్మానం చేసి కేంద్రానికి పంపించాలని డిమాండ్‌ చేశారు. అలా చేయకపోతే కిరణ్‌ కుమార్‌రెడ్డి సమైక్య ద్రోహిగా మిగిలిపోతారని హెచ్చరించారు. వరద ముంపు ప్రాంతాలకు వెళ్ళిన చంద్రబాబు నాయుడు బాధితులను పట్టించుకోకుండా రాజకీయాలు మాట్లాడడం ఏమిటని నిలదీశారు. మీడియా మీద గౌరవం లేకుండా గంతులు వేసిన విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్‌ ఒక జోకర్ అని గడికోట ఎద్దేవా చేశారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో సోమవారం నిర్వహించిన మీడియా సమావేశంలో శ్రీకాంత్‌రెడ్డి మాట్లాడారు. సమైక్యాంధ్ర ఉద్యమానికి ఊపిరిపోసి రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని పోరాడుతున్న ఒకే ఒక్క వ్యక్తి శ్రీ వైయస్‌ జగన్మోహన్‌రెడ్డి అని ఆయన అన్నారు. కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియా గాంధీకి ముఖ్యమంత్రి కిరణ్కుమా‌ర్‌రెడ్డి, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు కోవర్టులుగా వ్యవహరిస్తున్నారని శ్రీకాంత్‌రెడ్డి ఆరోపించారు.

ఎన్జీఓలు తమ ధర్మాన్ని నిర్వర్తించారని, పూర్తి స్థాయిలో జీతాలు రాకపోయినా, కష్టాలు పడుతున్నా, పదోన్నతులను దెబ్బతీస్తామని బెదిరింపులు వస్తున్నా మొక్కవోని ధైర్యంతో సమైక్య ఉద్యమం చేశారని శ్రీకాంత్‌రెడ్డి అభినందనలు తెలిపారు. తరువాత ఈ ఉద్యమాన్ని తలపైకెత్తుకుని పోరాడాల్సిన బాధ్యత రాజకీయ నాయకులపై పడిందన్నారు. అయితే.. సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి సమైక్యవాదినని చెప్పుకుంటూ ఉద్యమాన్ని నీరుగార్చారని విమర్శించారు. రాష్ట్ర విభజన నిర్ణయం వచ్చిన 15 రోజుల వరకూ మౌనంగా ఉండి, ప్రజా ఉద్యమం ఉవ్వెత్తున ఎగసిపడుతుండడాన్ని చూసి మొక్కుబడిగా ఒక ప్రకటన చేశారన్నారు. ప్రజలకు వచ్చిన సమాధానాలు చెప్పకుండా తాను కూడా ప్రశ్నలు వేసి గందరగోళం సృష్టించారన్నారు. ఉవ్వెత్తున ఎగసిపడుతున్న సమైక్య ఉద్యమంపై నీళ్ళు చల్లారని దుయ్యబట్టారు. పదవిని కూడ లెక్కచేయకుండా అధిష్టానంపై తిరగబడుతున్నారని చెప్పుకునే కిరణ్‌ విభజనకు అనుకూలంగా ఉంటానని మాట ఇచ్చినట్లు తమకు స్పష్టమైన సమాచారం ఉందన్నారు. కిరణ్‌ తీరు, మాట్లాడుతున్న విధానం చూస్తే.. కాంగ్రెస్‌ అధిష్టానం కోవర్టు అని స్పష్టంగా తెలుస్తోందన్నారు.

అదే విధంగా మరో కోవర్టులా వ్యవహరిస్తున్నది టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అని శ్రీకాంత్‌రెడ్డి ఆరోపించారు. తన విధానాన్ని స్పష్టం చేయకుండా.. ఆత్మగౌరవ యాత్ర చేసి, దానికి ప్రజల నుంచి స్పందన లేకపోతే.. ఢిల్లీ వెళ్ళి నిరాహార దీక్ష చేసి విభజన ప్రక్రియ వేగవంతం చేయడంలో కీలకపాత్ర పోషించారని దుయ్యబట్టారు. కిరణ్‌రెడ్డి, చంద్రబాబులను కోవర్టులుగా పెట్టుకుని సూత్రధారిలా సోనియా గాంధీ డ్రామా నడిపిస్తున్నారని అన్నారు. విభజనకు దారులు కల్పిస్తున్న వీళ్ళు సమైక్యవాదులుగా చెప్పుకోవడం శోచనీయం అన్నారు. కిరణ్ కుమార్‌రెడ్డి, లగడపాటి, దివాకరరెడ్డి మరెవ్వరు మాట్లాడినా అది వారి కుట్రలో భాగమే అన్నారు. సీమాంధ్రలో కాంగ్రెస్‌ పార్టీ పూర్తిగా తుడిచిపెట్టుకుపోతుందని, తమ ఉనికిని కాపాడుకునేందుకే వాళ్ళంతా ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారన్నారు.  వైయస్ఆర్ ‌కాంగ్రెస్‌తో కాంగ్రె‌స్ పార్టీ ఒప్పందం చేసుకుందని కాంగ్రె‌స్ ఎమ్మల్యే జేసీ దివాకరరెడ్డి విమర్శించడాన్ని‌ ఆయన తప్పుపట్టారు. ఎంపీ సీటు కోసం జేసీ సోదరుడు టీడీపీతో ఒప్పందం చేసుకోవడం వాస్తవం కాదా అని ప్రశ్నించారు.

సమైక్యవాదిగా ముద్ర వేయించుకోవాలని తహతహలాడుతున్న సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి పదవిని వదిలిపెట్టకుండా కలెక్షన్ ఏజెంట్గా మారి ఇప్పటికీ వందలాది ఫైళ్లపై సంతకాలు చేస్తూ తన పబ్బం గడుపుకుంటున్నారని శ్రీకాంత్‌రెడ్డి దుయ్యబట్టారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచితేనే సీఎం పదవిని చేపడతానని ఆ రోజునే కిరణ్‌కుమార్‌రెడ్డి చెప్పి ఉంటే ఆయన సమైక్యవాది అనుకుని ఉండేవారం అన్నారు. విభజనకు సహకరిస్తూనే.. సమైక్యవాదినని చెప్పుకోవడం దుర్మార్గం అన్నారు. సమైక్యాంధ్ర ఉద్యమానికి కిరణ్‌ చేసిందేమీ లేదన్నారు. ముఖ్యమంత్రిగా అసెంబ్లీని సమావేశపరిచే అధికారం సీఎం కిరణ్‌కు ఉన్నా పట్టించుకోరని, చంద్రబాబు నాయుడు కూడా డిమాండ్‌ చేయరని విమర్శించారు.

లగడపాటి మాట్లాడిన భాష సభ్య సమాజం సిగ్గుపడేలా ఉందన్నారు. సీమాంధ్ర విద్యుత్‌ ఉద్యోగులు సమైక్య ఉద్యమంలో ఉంటే తన సొంత ప్లాంటు నుంచి అదనంగా విద్యుత్‌ సరఫరా చేసి ఉద్యమాన్ని నీరుగార్చేందుకు ప్రయత్నించిన లగడపాటి సమైక్యవాదినని చెప్పుకోవడం సిగ్గుచేటు అని శ్రీకాంత్‌రెడ్డి అన్నారు. పార్లమెంటు సభ్యుడిగా విభజన ప్రకటన రాకుండా అడ్డుకోకుండా మద్దతిచ్చారని విమర్శించారు. పైగా మీడియాలో తిక్క తిక్క ప్రకటనలు చేస్తూ.. ఇతర పార్టీలపై బురద చల్లే రాజగోపాల్‌ లాంటి వారిని చరిత్ర క్షమించదన్నారు. లగడపాటి తన దొంగ వ్యాపార ప్రయోజనాల కోసం ఢిల్లీలో కూర్చొని అనుమతులు తెచ్చుకుంటున్నారని విమర్శించారు. సోనియా గాంధీ దత్తపుత్రుడైతే శ్రీ జగన్‌ జైలుకు పోవలసి వచ్చేదా అని ప్రశ్నించారు. సమైక్యాంధ్రకు సహకరించే వారినే ప్రధాని పదవిలో కూర్చోబెడతామని చెప్పిన ఏకైక మొనగాడు శ్రీ జగన్మోహన్‌రెడ్డి అన్నారు.

ఒకపక్కన రాష్ట్ర విభజన ప్రక్రియను సోనియాగాంధీ కొనసాగిస్తున్నారని, దానికి చంద్రబాబు నాయుడు సహకరిస్తున్నారని అయితే, ఆమెతో శ్రీ జగన్‌ కుమ్మక్కయ్యారంటూ ఆరోపించడమేమిటని శ్రీకాంత్‌రెడ్డి ప్రశ్నించారు. నరేంద్ర మోడీ సభకు ప్రత్యేక రైళ్లు కేటాయించినంత మాత్రాన సోనియా గాంధీతో బీజేపీ కుమ్మక్కయినట్టేనా అంటూ శ్రీకాంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. సమైక్య శంఖారావానికి నిబంధనల ప్రకారం అద్దె చెల్లించి ఆర్టీసీ బస్సులను వినియోగించుకున్నది వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ అయితే.. ప్రభుత్వంలో ఉండి బస్సులను వాడుకుని ఇప్పటికీ డబ్బులు కట్టనిది తమను విమర్శిస్తున్న వారే అన్నారు. ప్రజల మద్దతు పూర్తిగా ఉన్న శ్రీ జగన్‌ను ఏదో విధంగా అప్రతిష్టపాలు చేయడానికే ఇలాంటి అసత్య ఆరోపణలు చేస్తున్నారని వ్యాఖ్యానించారు.

విభజన ప్రకటన చేసిన తరువాత శ్రీ జగన్‌ రెండుసార్లు నిరాహార దీక్షలు చేశారని, పార్టీ గౌరవ అధ్యక్షురాలు శ్రీమతి విజయమ్మ కూడా గుంటూరులో ఆమరణ దీక్ష చేశారన్నారు. రాష్ట్రం విడిపోతే ఎలాంటి కష్ట, నష్టాలో వస్తాయో శ్రీ జగన్మోహన్‌రెడ్డి సోదరి శ్రీమతి షర్మిల రాష్ట్రం అంతా పర్యటించి వివరించారని గుర్తుచేశారు. పార్టీ ఎమ్మెల్యేలందరూ ముందే రాజీనామాలు చేశామని, నిరాహార దీక్షలు చేశామని శ్రీకాంత్‌రెడ్డి తెలిపారు. పార్టీ శ్రేణులు కూడా సీమాంధ్ర వ్యాప్తంగా దీక్షలు చేశారన్నారు. సమైక్యాంధ్ర ఉద్యమంలో ముందుండి పోరాడుతున్నది వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీయే అన్నారు. సమైక్య ఆంధ్రకు సహకరించే వారినే ప్రధాన మంత్రి పదవిలో కూర్చోబెడతామని శ్రీ జగన్‌ శంఖారావం సభలో విస్పష్టంగా పిలుపునిస్తే.. దాన్ని కూడా జీర్ణించుకోలేని నాయకులు ఆరోపణలు చేయడం ఏమిటని ప్రశ్నించారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలంటూ చంద్రబాబు నాయుడు ఒక్క లేఖ ఎందుకు రాయలేకపోతున్నారని శ్రీకాంత్‌రెడ్డి సూటిగా ప్రశ్నించారు.

Back to Top