బీసీ ద్రోహి చంద్రబాబే: గట్టు

హైదరాబాద్, 27 ఫిబ్రవరి 2013: బీసీలను అన్నివిధాలుగా అణగద్రొక్కిన ద్రోహి చంద్రబాబు నాయుడు అని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ బీసీ విభాగం కన్వీనర్‌ గట్టు రామచంద్రరావు అభివర్ణించారు. బీసీలను తాను సర్వనాశనం చేసింది చాలదన్నట్లు వారు చొక్కా వేసుకున్నా వైయస్‌ఆర్ సహించలేదంటూ అబద్ధాలు చెబుతున్నారని ఆయన నిప్పులు చెరిగారు. అన్ని కుల వృత్తులనూ పూర్తిగా భ్రష్టు పట్టించింది చంద్రబాబే అని గట్టు మండిపడ్డారు. చంద్రబాబు బీసీ వ్యతిరేక విధానాల కారణంగానే రాష్ట్రంలో ఆయన హయాంలో వేలాది మంది ఆత్మహత్యలు చేసుకున్నారని ఆరోపించారు. బీసీల జీవనాధారం మేకల పెంపకాన్ని నిషేధిస్తానంటూ నిస్సిగ్గుగా ప్రకటించిన వ్యక్తి చంద్రబాబే అన్నారు. గీత కార్మికుల పొట్టకొట్టేలా తాటిచెట్టుకు మూడు రకాల పన్నులు విధించిన ఘనుడు కూడా చంద్రబాబు నాయుడే అని విమర్శించారు. బీసీల అభివృద్ధికి అంటూ చంద్రబాబు చేస్తున్న వాగ్దానాలపై గట్టు తీవ్రంగా ప్రతిస్పందించారు. వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర కార్యాలయంలో బుధవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన చంద్రబాబు తీరును తూర్పారపట్టారు.

చంద్రబాబు అనుసరించిన బీసీ వ్యతిరేక విధానాలపై వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ చార్జిషీట్ విడుదల చేసింది. తొమ్మిదేళ్ల చంద్రబాబు పాలనపై 22 ప్రశ్నలతో కూడిన చార్జిషీట్ను గట్టు రామచంద్రరావు బుధవారం మధ్యాహ్నం మీడియా సమావేశంలో విడుదల చేశారు.

గతంలో బీసీలను ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా అథఃపాతాళానికి తొక్కేసిన చంద్రబాబు ఇప్పుడు వారికి మేలు చేస్తానంటూ కల్లబొల్లి కబుర్లు చెబుతున్నారని గట్టు రామచంద్రరావు విమర్శించారు. ఆయన పాలన మొత్తం బడుగు, బలహీన వర్గాలు, నిరుపేదల వ్యతిరేకంగా కొనసాగిందన్నారు.‌ అప్పట్లో అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్‌ హైదరాబాద్‌ వచ్చినప్పుడు పేదలందరినీ ట్రాక్టర్లలో తీసుకుపోయి నగరం చివర వదిలేసింది చంద్రబాబే అని గట్టు నిప్పులు చెరిగారు. తన నిర్ణయాల వల్ల ఆత్మహత్యలు చేసుకున్నపేదల చావులను కూడా అవహేళన చేసిన చరిత్ర చంద్రబాబుది అన్నారు. ప్రపంచ బ్యాంకు జీతగాడిగా మారిన చంద్రబాబు వ్యవసాయాధార కులవృత్తులను సర్వనాశనం చేశారని గట్టు ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు హయాంలోనే స్వర్ణకారులు తమ కుటుంబాలను కడతేర్చి వారూ ఆత్మహత్యలు చేసుకున్న సంఘటనలు ఉన్నాయని గుర్తుచేశారు. బీసీలను ఇంతలా అణగదొక్కిన చంద్రబాబు ఇప్పుడు 'బీసీ డిక్లరేషన్'‌ అంటూ కబుర్లు చెప్పడమేమిటని గట్టు రామచంద్రరావు నిలదీశారు.

సహకార రంగంలో చేతి వృత్తుల వారికి ఉన్న రూ. 11 సభ్యత్వ రుసుమును రూ. 300కు పెంచేసింది చంద్రబాబే అన్నారు.  తిరుపతి మహానాడులో బడుగు, బలహీన వర్గాల కోసం రూ. 1,000 కోట్లతో ఆర్భాటంగా ప్రకటించిన కోటి వరాల కింద చంద్రబాబు ఖర్చుచేసిందెంత అని గట్టు నిలదీశారు. స్కాలర్‌షిప్పులు అడిగిన వారికి లాఠీ దెబ్బలు తినిపించిన చంద్రబాబు బీసీ విద్యార్థులకు మెస్‌ చార్జీలు ఒక్క రూపాయి అయినా పెంచారా? అని ప్రశ్నించారు. ఒక్క బీసీ విద్యార్థికి అయినా చంద్రబాబు ఫీజు మాఫీ చేశారా? అని గట్టు నిలదీశారు. బీసీ కార్పొరేషన్‌ను నిర్వీర్యం చేసింది చంద్రబాబే అన్నారు. చంద్రబాబు నాయుడు ఆప్కోను నిర్వీర్యం చేశారని, ఆప్టెక్సును రద్దు చేశారని, జనతా వస్త్రాల పథకానికి తెరదించారని రామచంద్రరావు విమర్శించారు. చేతి వృత్తిదారులకు హామీగా ఉండకుండా వారికి రుణాలు అందకుండా చేసింది చంద్రబాబే అన్నారు.

బీసీలకు ఏనాడైనా ఒక్క ఎకరా భూమినైనా చంద్రబాబు పంచిపెట్టారా? అని గట్టు రామచంద్రరావు సూటిగా ప్రశ్నించారు. కొత్తగా ఎవరికైనా పింఛన్‌ కావాలంటే అప్పటి వరకూ పింఛన్‌ తీసుకుంటున్న వారెవరైనా చనిపోతేనే ఇస్తామని నిబంధన పెట్టింది చంద్రబాబు కాదా అని ప్రశ్నించారు. వారిలో అత్యధిక శాతం బడుగులే ఉన్న మాట వాస్తవం కాదా? అన్నారు. బీసీలంటే చంద్రబాబు దృష్టిలో 'బాబు క్లాస్'‌ అని, ఆయన వందిమాగధులని అర్థమని ఎద్దేవా చేశారు.

నిజానికి బీసీలను అన్ని విధాలా ఆదుకున్నది, వారి అభివృద్ధికి బాటలు వేసింది దివంగత మహానేత డాక్టర్‌ వైయస్‌ రాజశేఖరరెడ్డి అని గట్టు రామచంద్రరావు పేర్కొన్నారు. కల్లు గీసే తాటిచెట్టుకు చంద్రబాబు వేసిన మూడు రకాల పన్నులను రద్దుచేసి, దాన్ని రూ. 25 మించకుండా నిర్ణయించి గీత కార్మికులను ప్రోత్సహించింది డాక్టర్‌ వైయస్‌ అన్నారు. గీత కార్మికుల గురించి చంద్రబాబు మాట్లాడితే గుదితో గుంజకు కట్టేస్తారని గట్టు హెచ్చరించారు.

కిలో రెండు రూపాయల బియ్యం పథకానికి తూట్లు పొడుస్తూ తొలుత రూ. 3.25కు, తరువాత రూ. 5.25కు చంద్రబాబు పెంచేస్తే మహానేత వైయస్‌ సిఎం అయ్యాక మళ్ళీ రూ. 2కే అందజేసిన విషయాన్ని గట్టు గుర్తుచేశారు. కౌలుదారులకు గుర్తింపు కార్డులు ఇచ్చింది, వారికి భూమి లేకపోయినా రుణాలు ఇప్పించింది మహానేతే అన్నారు. వ్యవసాయానికి ఉచిత విద్యుత్‌ అందజేసింది వైయస్సే అని తెలిపారు. చేనేతకు మార్కెట్‌ లేకపోతే వారి కోసం 7 కార్పొరేషన్‌లు ఏర్పాటు చేసింది వైయస్‌ అన్నారు.

చంద్రబాబు పాలనలో ఇబ్బడిముబ్బడిగా పెంచేసిన కరెంటు బిల్లు కట్టలేకపోయిన రైతులను అరెస్టులు చేసింది, వారి ఇంటి సామానులు జప్తు చేసింది, కేసులు పెట్టి జైళ్ళలో పెట్టిందీ, ప్రత్యేక కోర్టులు, పోలీసు స్టేషన్లు పెట్టి విచారణ పేరుతో అవమానించి, ఆత్మహత్యలు చేసుకునేలా చేసింది చంద్రబాబు అయితే రైతుల శ్రేయస్సు కోసమే డాక్టర్‌ వైయస్‌ నిరంతరం శ్రమించారని పేర్కొన్నారు. నిరుపేదలకు కూడా ఆరోగ్యశ్రీ ద్వారా ఉచితంగా కార్పొరేట్‌ స్థాయి వైద్య సేవలు అందజేసింది మహానేతే అన్నారు. వృత్తిలో వికలాంగులైన గీత, రజక, మత్స్యకారులకు పింఛన్‌తో చేయూతనిచ్చిందీ వైయస్సే అన్నారు.‌ వికలాంగులు, వితంతువులకు ఎన్టీఆర్ రూ. 50 పింఛన్‌ ఇస్తే, తొమ్మిదేళ్ళలో చంద్రబాబు కేవలం రూ.25 పెంచారని, ఐదేళ్ళ కాలంలో డాక్టర్‌ వైయస్‌ దాన్ని ముందు రూ.325కు, తరువాత రూ. 500కు పెంచారని గట్టు గుర్తుచేశారు. బీసీలకు 34 శాతం రిజర్వేషన్‌ కల్పిస్తూ మహానేత వైయస్‌ ఎన్నికలు నిర్వహించిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. 26 లక్షల మందికి ఫీజు రీయింబర్సుమెంటు చేసింది కూడా వైయస్సే అన్నారు. విద్యార్థులకు స్కాలర్‌షిప్పులు రద్దు చేసిన చంద్రబాబు తన కొడుకు లోకేష్‌కు మాత్రం సత్యం రామలింగరాజు ద్వారా ఫీజు రీయింబర్సుమెంటు చేయించుకున్న వైనాన్ని గట్టు ఈ సందర్భంగా ప్రస్తావించారు.

బీసీల విషయంలో చంద్రబాబుది కపట ప్రేమ అని, రెండు నాల్కల ధోరణి అని గట్టు రామచంద్రరావు విమర్శించారు. బీసీలకు చంద్రబాబు చేసినంత ద్రోహం చరిత్రలో మరే ముఖ్యమంత్రీ చేయలేదని ఆయన ఆరోపించారు. తొమ్మిదేళ్ళ పాలనలో బీసీలకు చేసిన మహాద్రోహానికి చంద్రబాబు గ్రామ గ్రామానా క్షమాపణలు చెప్పాలని గట్టు డిమాండ్‌ చేశారు.
Back to Top