బాబుకు అధికారం దక్కదు! : రాంబాబు

హైదరాబాద్,

22 అక్టోబర్ 2012 : మతం పేరుతో టిడిపి రాజకీయం చేయజూస్తోందనీ, విజయమ్మ బైబిల్ వివాదం
లేవనెత్తి
తంటాలు పడుతోందని వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు విమర్శించారు. మతం చాటున తెలుగుదేశం పార్టీ
రాజకీయ లబ్ధి పొందజూస్తోందనీ,
అయినప్పటికీ బాబుకు అధికారం మాట అలా ఉంచి కనీసం ప్రధాన ప్రతిపక్ష పాత్ర
కూడా దక్కదని, పోయినసారి వచ్చినన్ని సీట్లు కూడా ఈ సారి రావన్న సంగతి
బాబుకే బాగా తెలుసని ఆయన సోమవారం మీడియాలో వ్యాఖ్యానించారు.
మోసపూరిత వాగ్దానాలతో చంద్రబాబు మరోసారి ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చేందుకు యత్నిస్తున్నారని రాంబాబు విమర్శించారు. తొమ్మిదేళ్ల పాటు అధికారంలో ఉన్నన్నాళ్లు చేయని పనులన్నిటినీ ఇప్పుడు ముఖ్యమంత్రి అయితే చేసేస్తానంటున్నారని ఆయన ఎద్దేవా చేశారు. ఎన్ని ఎత్తులు వేసినా పదేళ్లదాకా అధికారంలోకి రాలేమన్న నిస్పృహతో బాబు తన స్థాయిని కూడా దిగజార్చుకుని అవాకులూ చవాకులూ పేలుతున్నారని ఆయన దుయ్యబట్టారు. కనుచూపు మేరలో అధికారం దక్కే అవకాశాలు లేవంటూ అన్ని సర్వేలూ, ఉప ఎన్నికల ఫలితాలూ రుజువు చేస్తున్నాయని ఆయన అన్నారు.

రేవు దాటాక తెప్పతగలేయడం, ఓడ మీదున్నప్పుడు ఓడమల్లయ్య-ఓడ దిగాక బోడి మల్లయ్య అనడం, అక్కర తీరాక అల్లుడిని దూషించడం వంటి సామెతలు కొన్నితెలుగులో ఉన్నాయనీ, అవన్నీ కచ్చితంగా చంద్రబాబు కోసమే పుట్టినట్లున్నాయని ఆయన ఎగతాళి చేశారు. అక్కర తీరిన తర్వాత చంద్రబాబు తెప్ప తగలేసిన సందర్భాలు చాలా వున్నాయని ఆయన అన్నారు.
'ముఖ్యమంత్రిగా ఉన్నన్నాళ్లు గుర్తు రాని పథకాలన్నీ ఇప్పుడు గుర్తొచ్చేస్తున్నాయి. నవసూత్ర పథకాలట. అందులో గొప్ప విషయాలెన్నో ఉన్నాయట. ఇంతకీ బాబుగారూ! మీరు ఓడ మీదున్నప్పుడు ఏం చేశారు. మీరు అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు మరచిపోయారు" అని రాంబాబు ప్రశ్నించారు. అధికారం కోల్పోయాకే బాబుకు ప్రజలు గుర్తుకు వచ్చారని ఆయన అన్నారు. ఇదంతా  అబద్ధమన్న సంగతి రాష్ట్ర ప్రజలకు తెలుసుననీ, ఆయనను ఎవ్వరూ నమ్మరనీ రాంబాబు వ్యాఖ్యానించారు.
చివరకు స్థాయికి తగని దోమకథలూ, పిట్టకథలూ, చౌకబారు మాటలు చెబుతూ కాలక్షేం చేస్తున్నారని ఆయన విమర్శించారు. పాదయాత్ర వల్ల కాళ్లకు నొప్పులు రావడం మూలాన వైద్యం చేయాలంటున్నారనీ, అయితే నిజానికి వైద్యం చేయాల్సింది బాబు కాళ్లకు కాదు, బుర్రకనీ ఆయన అవహేళన చేశారు. లేగా ఆయన బుర్ర ఏమైనా పాదాల్లోకి వచ్చిందేమే తెలియదని రాంబాబు ఎద్దేవా చేశారు. "ఉచిత విద్యుత్తు తొమ్మిది గంటలు ఇస్తారట. మరి అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు ఇవ్వలేదు. దీనికి బాబు దగ్గరి నుండి సమాధానం లేదు. రాజశేఖర రెడ్డిగారి వల్లే విద్యుత్తు సంక్షోభం వచ్చిందట. మరి వైయస్‌ ఉన్నప్పుడు ఈ సంక్షోభం లేదే. రైతు రుణాలు మాఫీ చేస్తారట. ఎలా చేస్తావో చెప్పవయ్యా అంటే చెప్పరు. చేసి చూపిస్తారట. మరింత మెరుగైన ఆరోగ్య శ్రీ పథకంలాంటిది తెస్తారట. రాజశేఖర రెడ్డి పథకాలన్నిటినీ తాను ముఖ్యమంత్రి అయితే తిరిగి అమలు చేస్తామంటున్నారు. ఇదంతా చూస్తే బహుశా చంద్రబాబుకు మతి భ్రమించినట్లు కనిపిస్తోంది." అని రాంబాబు వ్యంగ్యంగా అన్నారు.

"పాదయాత్రకు జనం రాక నీరసించిపోయింది, వెలవెల పోతోంది. దీంతో చివరకు కొన్ని ఛానల్స్‌లో పెయిడ్ న్యూస్ వేయించుకునే దుస్థితికి బాబు దిగజారిపోయారు" అని ఆయన అన్నారు.ప్రజల పట్ల చిత్తశుద్ధి లేని నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది చంద్రబాబునాయుడేనని ఆయన విమర్శించారు. బాబు పార్టీనీ, కుటుంబాన్నీ ఛిన్నాభిన్నం చేసి అధికారంలోకి వచ్చారనీ అలాంటి బాబును ఎవ్వరూ నమ్మరనీ ఆయన అన్నారు.

వైయస్‌ఆర్‌ సీపీని అధికారంలోకి తీసుకురావడానికి పాదయాత్రలు అక్కర్లేదని ఆయన ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. వైయస్ మరణించాక జరిగిన అన్ని ఎన్నికల్లో తాము మూడు చోట్ల మినహా అన్ని చోట్లా గెలిచామనీ, కానీ 90 శాతం చోట్ల ఓడింది కాంగ్రెస్ అయితే, అన్ని చోట్లా ఓడింది టిడిపి అన్న సంగతి గుర్తించాలనీ రాంబాబు వ్యాఖ్యానించారు. చాలా చోట్ల టిడిపికి డిపాజిట్లు కూడా దక్కలేదన్న గమనించాలని ఆయన అన్నారు.
షర్మిల పాదయాత్ర ప్రజల కష్టాలను తెలుసుకోవడానికీ, కాంగ్రెస్ టిడిపిల కుమ్మక్కు రాజకీయాలను ఎండగట్టడానికేనని ఆయన వివరించారు. రాజశేఖర్ రెడ్డిగారి వాగ్దానాలను తుంగలో తొక్కుతున్న వైనాన్ని నిరసించడం కూడా ఈ పాదయాత్ర లక్ష్యమని ఆయన చెప్పారు. షర్మిల, చంద్రబాబు పాదయాత్రల మధ్య జన స్పందనలో తేడా చూస్తే ప్రజల మద్దతు ఎవరికి ఉందో తెలిసిపోతుందని ఆయన అన్నారు.

ఎవరైనా ఎక్కడికైనా వెళ్లవచ్చు!

ఈ దేశంలో ఎవరైనా ఎక్కడికైనా వెళ్లి రాజకీయ కార్యకలాపాలు నిర్వహించుకోవచ్చుననీ, ఇది ప్రజాస్వామ్య సూత్రమనీ రాంబాబు అన్నారు. బాబు యాత్రను టిఆర్ఎస్ అడ్డుకోవడంపై ఆయన ఈ వ్యాఖ్య చేశారు. అయితే తెలుగుదేశంవారు కూడా ఈ సూత్రాన్ని పాటించలేదనీ, జగన్మోహన్ రెడ్డి మహబూబాబాద్ పర్యటన విషయంలో రాద్ధాంతం చేశారని ఆయన గుర్తు చేశారు. షర్మిల యాత్రకు తెలంగాణలో ఏ విధమైన అడ్డంకీ వస్తుందని తాము అనుకోవడం లేదని ఆయన అన్నారు.తమ పార్టీ తెలంగాణపై ఇప్పటికే స్పష్టత ఇచ్చిందని ఆయన చెప్పారు. 'అఖిలపక్షం' పెట్టడం కాలయాపనే తప్ప మరేమీ కాదని ఆయన అన్నారు. తెలంగాణపై కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకోవడంలో తాత్సారం చేస్తున్నదనీ, దీపావళి, బక్రీదు, దసరా అని రోజులు గడుపుతోందని ఆయన విమర్శించారు.


Back to Top