20న ఆందోళనలకు వైయస్‌ఆర్‌ సిపి పిలుపు

హైదరాబాద్‌, 18 సెప్టెంబర్‌ 2012: కేంద్రంలోని యూపిఎ ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా ఈ నెల 20న రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు, రాస్తారోకోలు, హర్తాళ్ళు నిర్వహించాలని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఒక ప్రకటనలో పిలుపునిచ్చింది. డీజిల్‌ ధరను విపరీతంగా పెంచడమే కాకుండా వంటగ్యాస్‌ సిలిండర్లపైన పరిమితి విధించడాన్ని, నిత్యావసర వస్తువుల ధరలు ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోవడం, రిటెయిల్‌ రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు తలుపులు బార్లా తెరవడం తదితర విషయాల్లో యూపిఎ వైఖరి చాలా దారుణంగా ఉందని పార్టీ ఆ ప్రకటనలో నిప్పులు చెరిగింది. ఇప్పటికే అనేక కష్టాలు పడుతున్న మన దేశంలోని కోట్లాది మంది సామాన్యులను కేంద్రప్రభుత్వం వైఖరి మరిన్ని ఇబ్బందుల్లోకి నెట్టేదిగా మారిందని దుయ్యబట్టింది. ఈ ప్రజా వ్యతిరేక చర్యలను యూపిఎ ప్రభుత్వం తక్షణమే ఉపసంహరించుకోవాలని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ డిమాండ్‌ చేసింది.

Back to Top