పేద ప్రజల ‘డాక్టర్’

మన రాష్ట్రంలోనే కాదు, దేశంలో కూడా వైద్య ఆరోగ్య రంగాలపై అత్యల్ప మొత్తం వెచ్చిస్తున్న నేపథ్యంలో డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి ప్రజారోగ్య రంగానికి అందించిన సేవలు గణనీయమైనవని చెప్పాలి.

స్థూల జాతీయో త్పత్తిలో 5 నుంచి 6 శాతం దాకా ఖర్చు పెడితే తప్ప మన దేశ ప్రజల కనీస ఆరోగ్య అవసరాలు తీరవు. ప్రస్తుతం 1.2 శాతం మాత్రమే వెచ్చిస్తున్న మన ప్రభుత్వాలకు వ్యయం మొత్తాన్ని 2 శాతానికి పెంచడానికి కూడా చేతులు రావడం లేదు. గత 30 ఏళ్లలో గ్రామీణ ప్రజల ఆరోగ్యం అడుగంటి పోయింది. చైనాతో పోల్చుకుంటే మన దేశం ఆరోగ్యరంగంలో బాగా వెనుకబడి ఉంది.

దేశ ప్రజలందరికీ ఆరోగ్య భద్రత కల్పించాల్సిన ఆవశ్యకతను కేంద్ర ప్రభుత్వం గుర్తించని నేపథ్యంలో.. మన రాష్ట్రంలో వైయస్.. శిక్షణ పొందిన వైద్యునిగా ముఖ్యమంత్రి పదవీ బాధ్యతలు చేపట్టిన అనతి కాలంలోనే పేదప్రజల ఆరోగ్య సంరక్షణకు పెద్దపీట వేశారు.

భారీ ఖర్చుతో కూడుకున్న గుండె జబ్బులు, ఇతర ప్రాణాంతక వ్యాధులకు అవసరమైన చికిత్సను పేదసాదలకు అందించేందుకు వైయస్ ‘ఆరోగ్యశ్రీ’ పథకం ద్వారా మార్గం సుగమం చేశారు. ముఖ్యంగా లక్షలు ఖర్చయ్యే శస్త్రచికిత్సలకు నోచుకోని పేదలకు, కార్పొరేట్ ఆస్పత్రుల్లో అందే ఉన్నతస్థాయి వైద్య సేవలను అందుబాటులోకి తెచ్చిన ప్రఖ్యాతి వైయస్ సొంతం.

వైద్య విద్యలో శిక్షణ పొందిన డాక్టర్‌గానే కాక, బాధ్యతగల పౌరునిగా కూడా వైయస్‌కు సమాజం పట్ల ఒక మానవీయ దృక్పథం ఉంది. ఆ దృక్పథాన్ని ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా అమలు చేయగల నైతిక స్థయిర్యం ఉంది. అదే ఆయనను పేదలకు చేరువ చేసింది.

మన దేశంలో 60 శాతం మంది ప్రజలు గ్రామాల్లో నిరుపేదలుగా ఉన్నారనే వాస్తవాన్ని గుర్తించేందుకు కేంద్ర ప్రభుత్వం నిరాకరించినా, వైయస్ గుర్తించారు. అందుకు అనుగుణంగా ఆచరణలో ఫలితాలను ఇవ్వగల చర్యలను చేపట్టారు.

-డా॥డి.రాజారెడ్డి, ప్రముఖ నాడీమండల వ్యాధినిపుణులు

Back to Top