అపర ‘భగీరథుడు’

రాష్ట్ర నీటిపారుదల రంగం క్షీణదశలో ఉన్నప్పుడు రైతుల పొలాలకు నీరందించేందుకు వైయస్ రాజశేఖరరెడ్డి అపర భగీరథుడి వలె అవతరించారు. 2004లో ముఖ్యమంత్రిగా బాధ్యతలను చేపట్టగానే ఆయన తలపెట్టిన జలయజ్ఞం రాష్ట్ర నీటిపారుదల రంగాన్ని మలుపుతిప్పింది. కనీవినీ ఎరుగని రీతిలో కోటి ఎకరాలకు పైగా సాగునీరు అందించే జలయజ్ఞంలో, ఒక్క సాగునీటి సదుపాయమే కాకుండా తాగునీరు, కాలువలకు మరమ్మతులు, ఆధునీకరణ, వరదకట్టల నిర్మాణం ఇమిడి ఉన్నాయి.

జలయజ్ఞం ద్వారా 103.22 లక్షల ఎకరాలను అదనంగా సాగులోకి తీసుకువచ్చే ప్రాజెక్టులను చేపట్టారు. గత పాలకులు కేవలం కాగితాల మీద కూడా మంజూరు చేయడానికి వెనుకాడిన, ఏళ్ల తరబడి పునాది రాళ్లకే పరిమితమైన ప్రాజెక్టులను జలయజ్ఞం ద్వారా ఆచరణ సాధ్యం చేసిన గొప్పనాయకుడు వైయస్. 490 మీటర్ల ఎత్తుకు నీటిని తోడి 7 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే దేవాదుల ఎత్తిపోతల పథకానికి రూపకల్పన చేశారు.

తెలంగాణలోని ఏడు జిల్లాల్లో 14.50 లక్షల ఎకరాలకు సాగునీటిని అందించేందుకు 550 మీటర్ల ఎత్తుకు నీటిని తరలించే ప్రాణహిత-చేవేళ్ల పథకాన్ని చేపట్టారు. ఏ నాటి నుంచో కాగితాలకే పరిమితమై ఉన్న పొలవరం ప్రాజెక్టు పనుల్ని చేపట్టిన ఘనత వైయస్‌దే. కుడి, ఎడమ కాలువలను పూర్తి చేయడమే కాకుండా హెడ్ వర్క్స్ పనులకు టెండర్లను కూడా పిలిచారు.

రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు, అన్ని జిల్లాలకు వీలైనన్ని ప్రాజెక్టుల ద్వారా సాగునీటిని, తాగు నీటిని అందించడమే వైయస్ లక్ష్యం. సాగునీటి వనరుల కల్పనలో సాధ్యం కాదని వదిలేసిన అనేక ప్రాజెక్టులకు నాందిపలికి అవి ఆచరణ సాధ్యమేనని నిరూపించిన అరుదైన నాయకుడు వైయస్. రాష్ట్ర సౌభాగ్యానికి దోహదం చేసే జలయజ్ఞంలో భాగంగా చేపట్టిన అన్ని ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేయడమే ఆయనకు మనం అందించే నిజమైన నివాళి.

-సీతాపతిరావు, రాష్ట్ర ప్రభుత్వ సాగునీటి రంగ మాజీ సలహాదారు.

Back to Top