ప్ర‌జా తీర్పును కోరేందుకు సిద్ధంగా ఉన్నాం


 పశ్చిమగోదావరి :  త‌మ రాజీనామాల‌ను త్వ‌ర‌గా ఆమోదిస్తే..ప్ర‌జా తీర్పును కోరేందుకు సిద్ధంగా ఉన్నామ‌ని వైయ‌స్ఆర్‌సీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి పేర్కొన్నారు.  ప్రత్యేక హోదా కోసం ఎంపీ పదవులకు రాజీనామాలు చేసిన వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీలకు లోక్‌సభ స్పీకర్‌ కార్యాలయం నుంచి పిలుపొచ్చిన సంగతి తెలిసిందే. ఈ సంద‌ర్భంగా  వైవీ సుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడుతూ..  లోక్‌సభ కార్యాలయం నుంచి వచ్చిన పిలుపు మేరకు ఈ నెల 29న సాయంత్రం లోక్‌సభ స్పీకర్‌ను కలవనున్నట్లు తెలపారు. స్పీకర్‌ను కలిసి తమ రాజీనామాలను ఆమోదించాల్సిందిగా కోరుతామన్నారు. ఏప్రిల్‌ 6న స్పీకర్‌ ఫార్మాట్‌లో రాజీనామాలు చేశామని, తర్వాత స్పీకర్‌ కార్యాలయం నుంచి పిలుపు రాకుంటే లేఖ కూడా రాసినట్టు తెలిపారు. స్పీకర్‌ను కలిసి తమ రాజీనామాలను ఆమోదింపజేసుకుని ప్రజా తీర్పు కోరుతాం అని అన్నారు. నాలుగేళ్లు బీజేపీతో అంటకాగిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఆంధ్రప్రదేశ్‌కు తీరని ద్రోహం చేశారని మండిపడ్డారు. ధర్మపోరాటం పేరుతో ఇప్పుడు కొత్త నాటకానికి చంద్రబాబు తెరతీశారని విమర్శించారు. ప్రత్యేకహోదా విషయంలో పూటకో మాట మాట్లాడిన చంద్రబాబును ప్రజలు నమ్మడం లేదని, వచ్చే ఎన్నికల్లో ఆయనకు తగిన బుద్ధి చెప్తారని అన్నారు.



Back to Top