'సమైక్య' పోరాటం కొనసాగిస్తాం

హైదరాబాద్ :

అసెంబ్లీలో సమైక్య తీర్మానం చేయించేందుకు వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ తన పోరాటాన్ని కొనసాగిస్తూనే ఉంటుందని పార్టీ శాసనసభా పక్ష నాయకురాలు శ్రీమతి వైయస్‌ విజయమ్మ స్పష్టంచేశారు. శాసనసభలో సమైక్య తీర్మానం ప్రవేశపెట్టాలన్న తమ ప్రతిపాదనను ప్రభుత్యం అంగీకరించకపోవడంతో వైయస్ఆర్ కాంగ్రె‌స్ పార్టీ సభ్యులు శాసనసభా వ్యవహారాల కమిటీ‌ (బీఏసీ) సమావేశం నుంచి‌ మధ్యలోనే వాకౌట్ చేశారు. బీఏసీ సమావేశం నుంచి బయటకు వచ్చిన తరువాత శ్రీమతి విజయమ్మ మీడియా పాయింట్‌ వద్ద విలేకరులతో మాట్లాడారు. సమైక్య తీర్మానం కోసం తాము పట్టుపట్టినట్లు ఆమె తెలిపారు. తీర్మానం చేసే వరకూ సభను అడ్డుకుంటాం, కార్యకలాపాలను స్తంభింపచేస్తామని శ్రీమతి విజయమ్మ హెచ్చరించారు.
వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ తొలి నుంచీ డిమాండ్ చేస్తున్న సమైక్య తీర్మా‌నం గురించే బీఏసీ సమావేశంలో తాము పట్టుపట్టామని శ్రీమతి విజయమ్మ చెప్పారు. సమైక్య తీర్మానం ఆమోదించిన తరువాతే అసెంబ్లీలో చర్చ ప్రక్రియ ప్రారంభం కావాలని ఆమె డిమాండ్ చేశారు. అప్పుడు తమ పార్టీ కూడా విభజన బిల్లు చర్చలో పాల్గొంటుందని చెప్పామన్నారు. `వాళ్ళు సమైక్య తీర్మానం చేయడానికి ఒప్పుకోలేదు`. ఇంతకు ముందు  రాష్ట్రాల విభజన సమయంలో పాటించిన నిబంధనలే అనుసరించాలని తాము కోరినట్లు తెలిపారు. 'ఉత్తరాఖండ్, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్‌ రాష్ట్రాలు ఏర్పాటు చేసినప్పుడు గానీ, ఆంధ్రప్రదేశ్‌ ఏర్పడినప్పుడు గానీ ఒక సంప్రదాయం పాటించారు. ఈ అసెంబ్లీ ఆ సంప్రదాయాన్ని ఎందుకు పాటించద'ని శ్రీమతి విజయమ్మ ప్రశ్నించారు.

తెలంగాణ ప్రాంత నాయకులతో ఏకీభవిస్తూ.. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి కూడా విభజన బిల్లుపై చర్చ పెట్టమనే చెప్పారన్నారు. తుపానును అడ్డుకోలేకపోయాను గానీ, విభజన తుపానును ఆపుతానంటూ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రజల వద్ద ప్రగల్భాలు పలికారని శ్రీమతి విజయమ్మ విమర్శించారు. సమైక్య తీర్మానం చేసిన తరువాత మాత్రమే తాము చర్చలో పాల్గొంటామని తాము స్పష్టంగా చెప్పామన్నారు. విభజన ముసాయిదా బిల్లులో సభ్యులకు కావాల్సిన ఎలాంటి సమాచారమూ లేదని ఆమె అన్నారు. ప్రభుత్వ ఆదాయం ఎంత? ఉద్యోగాలకు సంబంధించిన వివరాలేవీ అందులో లేవన్నారు. సమైక్య తీర్మానం చేసిన తరువాత చర్చకు వీలుగా అన్ని అంశాలపై అధ్యయనం చేయడానికి సభ్యులకు నాలుగైదు రోజుల గడువు ఇవ్వాలని బీఏసీలో తాము కోరామన్నారు. ఒక్క ఏడాదికి ప్రతిపాదించే బడ్జెట్‌ను అసెంబ్లీలో ప్రవేశపెట్టినప్పుడు కూడా రెండు మూడు రోజులు సమయం ఇస్తున్నారని, విభజన బిల్లుకు కూడా సమయం ఇవ్వాలని కోరామని శ్రీమతి విజయమ్మ చెప్పారు.

సమైక్య తీర్మానం జరిగే వరకూ తాము సభను జరగనివ్వబోమని పార్టీ ఎమ్మెల్యేలు భూమా శోభా నాగిరెడ్డి, బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. సమైక్యాంధ్ర కోసం అన్నీ చేస్తామని సీఎం కిరణ్‌ ప్రజల వద్ద చెప్పారని, తీరా విభజన బిల్లు సభకు వచ్చిన సమయంలో వెనక్కి వెళ్ళారని ఎద్దేవా చేశారు.

శాసన మండలిలోనూ వైయస్ఆర్‌సీపీ పోరు :
ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం కలిసి ఉండాలని 75 శాతం మంది ప్రజలు కోరుతున్నందున శాసన మండలిలో విభజన బిల్లుపై చర్చకు ముందే సమైక్య తీర్మానం కోసం పట్టుపడతామని వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్సీలు స్పష్టం చేశారు. మండలి మంగళవారం వాయిదా పడిన తరువాత ఎమ్మెల్సీలు జూపూడి ప్రభాకర్‌రావు, ఆదిరెడ్డి అప్పారావు, మేకా శేషుబాబు, తిప్పారెడ్డి, సి. నారాయణరెడ్డి మండలి మీడియా పాయింట్‌ వద్ద విలేకరులతో మాట్లాడారు.

మహానేత డాక్టర్‌ వైయస్‌ రాజశేఖరరెడ్డి మరణించిన తరువాత సరైన నాయకత్వం లేని కారణంగా రాష్ట్రం ముక్కలైపోయే దుస్థితి వచ్చిందని వారు ఆవేదన వ్యక్తంచేశారు. శ్రీకృష్ణ కమిటీ నివేదికపై అసెంబ్లీలో, శాసన మండలిలో చర్చించకుండా ఎందుకు పక్కన పెట్టేశారని ప్రశ్నించారు. కేవలం ఓట్లు, సీట్ల కోసం రాష్ట్రాన్ని అడ్డగోలుగా ముక్కలు చేయాలని చూస్తున్న వారికి త్వరలో జరిగే ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెబుతారని హెచ్చరించారు.

Back to Top