ఉత్తరాఖండ్‌ బాధితుల్లో తెలుగువారిని రక్షించండి

న్యూఢిల్లీ, 26 జూన్‌ 2013:

ఉత్తరాఖండ్‌లో బాధలు పడుతున్న వారి కష్టాలను రాష్ట్రపతికి దృష్టికి తీసుకెళ్ళినట్లు వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకుడు, నెల్లూరు లోక్‌సభ సభ్యుడు మేకపాటి రాజమోహన్‌రెడ్డి తెలిపారు. ఉత్తరాఖండ్‌ వరదల్లో చిక్కుకుని ఇక్కట్లు పడుతున్న తెలుగువారిని రక్షించాలని కోరామని ఆయన చెప్పారు. రాజమోహన్‌రెడ్డి నేతృత్వంలోని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్ ‌పార్టీ బృందం బుధవారం రాత్రి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలి‌సింది.‌ ఈ సందర్భంగా పార్టీ సభ్యుల బృందం ఉత్తరాఖండ్ వరద బాధితులను రక్షించాలని వినతిపత్రం సమర్పించారు.

రాష్ట్రపతిని కలిసిన అనంతరం మేకపాటి రాజమోహన్‌రెడ్డి మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ... వరదల్లో మరణించిన వారి కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున నష్టపరిహారంతో పాటు, మృతుల కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు.‌

ఉత్తరాఖండ్‌ వరద బాధితులను ఆదుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని రాజమోహన్‌రెడ్డి ఆరోపించారు. వరద బాధిత ప్రాంతాల్లో వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ తరఫున వైద్య బృందం వైద్య సేవలు అందిస్తున్నదని తెలిపారు. ప్రభుత్వ వైఫల్యాన్ని చంద్రబాబు సొమ్ము చేసుకోవాలని, వరదల ద్వారా రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నారని మేకపాటి విమర్శించారు. ఉత్తరాఖండ్ ఉపద్రవాన్ని జాతీయ విపత్తుగా ప్రకటించాలని ‌ఆయన కోరారు.

కాగా వరద బాధితులకు తమ పార్టీ తరపున అందిస్తున్న వైద్య సేవలను రాష్ట్రపతి ప్రశంసించారని పార్టీ బృందంలో ఉన్న సీనియర్‌ నాయకుడు డాక్టర్‌ ఎం.వి. మైసూరారెడ్డి వెల్లడించారు. మేకపాటి రాజమోహన్‌రెడ్డి, డాక్టర్‌ ఎం.వి. మైసూరారెడ్డి, బాలినేని శ్రీనివాసరెడ్డి, గొల్ల బాబూరావు, మేకతోటి సుచరిత, జి. శ్రీకాంత్‌రెడ్డి బృందం రాష్ట్రపతిని కలిసి వినతిపత్రం అందజేశారు.

Back to Top