ఢిల్లీకి రేపు వైయస్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ బృందం

హైదరాబాద్‌ :

వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ గౌరవ అధ్యక్షురాలు శ్రీమతి వైయస్ విజయమ్మ నేతృత్వంలో‌ ప్రతినిధి బృందం సోమవారం ఢిల్లీ వెళ్తుందని పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు డాక్టర్‌ ఎం.వి. మైసూరారెడ్డి తెలిపారు. రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజిస్తానంటూ కేంద్రం నిరంకుశంగా, ఏకపక్షంగా తీసుకున్న నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని కోరుతూ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ‌ని, వివిధ రాజకీయ పార్టీల నాయకులను కలిసేందుకు ఈ బృందం వెళుతోందని ఆయన చెప్పారు.

హైదరాబాద్‌లో శనివారంనాడు మైసూరారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలోని పరిస్థితులను ఢిల్లీలోని పెద్దలకు వివరించనున్నట్లు మైసూరారెడ్డి తెలిపారు. ఢిల్లీలో వామపక్షాల నాయకులతో పాటు లౌకిక వాదానికి, దేశ శ్రేయస్సుకు కట్టుబడి ఉన్న పార్టీ నాయకులందరినీ కలిసి రాష్ట్ర పరిస్థితులు వివరించడంతో పాటు పార్టీ అధినేత శ్రీ వైయస్‌ జగన్మోహన్‌రెడ్డి చేసిన విజ్ఞప్తిని రాష్ట్రపతికి అందజేస్తామన్నారు.

ఈ బృందంలో తాను ఎం.పి.లు మేకపాటి రాజమోహన్‌రెడ్డి, ఎస్పీవై రెడ్డి, డి.ఎ. సోమయాజులు, శాసనసభా పక్ష ఉపనాయకులు భూమా శోభా నాగిరెడ్డి, మేకతోటి సుచరిత ఉంటారని మైసూరారెడ్డి చెప్పారు.

ప్రజలను మభ్యపెట్టేందుకే మంత్రుల మాటలు :
‘తెలంగాణ తీర్మానాన్ని అసెంబ్లీలో ఓడించిన తర్వాతే కొందరు మంత్రులు, ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తాం అంటున్నారు. వారిని నేను ఒక ప్రశ్న అడగదలుచుకున్నా. ఏ తీర్మానాన్ని మీరు ఓడించాలనుకుంటున్నారు? ఆర్టికల్ 3 కింద బిల్లు అయిపోయిన తర్వాత రా‌ష్ట్రపతి శాసనసభను అభిప్రాయం మాత్రమే అడుగుతారు. అందువల్ల ప్రయోజనం ఉండదు. కేవలం మీరు చేసేది చర్య కంటితుడుపు మాత్రమే అవుతుంది’ అని మైసూరారెడ్డి వ్యాఖ్యానించారు. మంత్రులకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే, సమైక్యవాదానికి కట్టుబడి ఉంటే అసెంబ్లీని తక్షణం సమావేశపరిచి, తీర్మానం చేసి కేంద్రానికి పంపించాలని ఆయన సూచించారు. కుంటిసాకులు చెప్పడం ద్వారా ప్రజలను మభ్యపెట్టడమే కాక మోసగించినట్లు అవుతుందని మైసూరారెడ్డి వ్యాఖ్యానించారు.

చంద్రబాబు నాయుడు ఢిల్లీలో ఎందుకు నిరాహారదీక్ష చేపట్టదలిచారో ప్రజలకు స్పష్టంగా వివరణ ఇవ్వాలని మైసూరా డిమాండ్ చేశారు. ఆయన దీక్ష సమైక్యం కోసమా, విభజన కోసమా అనేది స్పష్టంగా చెప్పాలన్నారు. ఇప్పటికే తమ పార్టీ అధినేత‌ శ్రీ జగన్మోహన్‌రెడ్డి అందరికీ విజ్ఞప్తి చేశారని, సమైక్యానికి కట్టుబడిన వారందరూ ఒకే వేదిక మీదకు రావాలని చేసిన విజ్ఞప్తికి చంద్రబాబు సిద్ధమా అని ప్రశ్నించారు. ఇవేవీ తేల్చకుండా ఇతరులపై బురదజల్లే కార్యక్రమం చేయడం చంద్రబాబుకు మంచిది కాదన్నారు.

Back to Top