రుణమాఫీకి ఆధార్ తో ముడిపెట్టొద్దు

హైదరాబాద్, జూన్ 26: గత ఎన్నికలలో టీడీపీ ఇచ్చిన హామీ ప్రకారం రైతుల రుణాలను బేషరతుగా రద్దు చేయాలని, ఎట్టి పరిస్థితులలోనూ రుణ మాఫీకి, ఆధార్ కార్డుకు లింకు పెట్టరాదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. ఆధార్ కార్డు ఉంటేనే రుణ మాఫీ అని, నకిలీ పట్టాలు, నకిలీ రైతులంటూ వ్యవసాయ శాఖ మంత్రి వ్యాఖ్యానించడం సమంజసం కాదని వైఎస్సార్సీపీ రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడు ఎంవీఎస్ నాగిరెడ్డి ఒక ప్రకటనలో దుయ్యబట్టారు.

సుప్రీంకోర్టే ఆధార్ తీరు తెన్నులను, దానికి సంక్షేమ పథకాలకు లింకు పెట్టే చర్యలను తప్పుపడుతూ ఇటీవల తీర్పు ఇచ్చిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. అయినా రాష్ట్ర ప్రభుత్వం రుణమాఫీకి ఆధార్ కు లింకు పెట్టాలని చూడటం అంటే రైతులను దారుణంగా మోసగించడమేనన్నారు. రైతులకు గిట్టుబాటు అయ్యేలా వరి, పత్తి మద్దతు ధరలను పెంచాల్సిందిగా కేంద్రంపై రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి తేవాలని నాగిరెడ్డి కోరారు. వరి మద్దతు ధరను 50 రూపాయలు మాత్రమే పెంచడం రైతులను దగా చేయడమేమని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులకు మద్దతు ధరలు కల్పిస్తామని, స్వామినాథన్ కమిటీ సిఫార్సులను అమలు చేస్తామని ఎన్నికల్లో హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం గానీ, రాష్ట్ర ప్రభుత్వం గానీ ఈ హామీలపై దృష్టి సారించడం లేదని ఆయన విమర్శించారు.

Back to Top