ఎంపీల రాజీనామాలపై బాబు చౌకబారు విమర్శలు



– వైయస్‌ఆర్‌సీపీ ఎంపీలు 14 నెలల ముందే పదవులకు రాజీనామా
– ప్రత్యేక హోదా కోసం వైయస్‌ఆర్‌సీపీ ఉద్యమం
– వైయస్‌ఆర్‌సీపీ వల్లే హోదా నినాదం సజీవం
– హోదాపై బాబు ప్రజలకు ఎన్నోసార్లు చెవ్వుల్లో పూలు పెట్టారు
– బాబు నోట హోదా మాట వైయస్‌ఆర్‌సీపీ ఘనతే
– వ్యవస్థలను మేనేజ్‌ చేసే దుర్మార్గమైన ఆలోచన చంద్రబాబుదే
 
విజయవాడ: ప్రత్యేక హోదా సాధనకు, ఏపీ ప్రజల భవిష్యత్తు కోసం వైయస్‌ఆర్‌సీపీ ఎంపీలు తమ పదవులకు రాజీనామా చేస్తే..చంద్రబాబు చౌకబారు విమర్శలు చేస్తున్నారని వైయస్‌ఆర్‌సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు మండిపడ్డారు. పదవీ కాలం ముగియడానికి నెల రోజుల ముందే వార్డు మెంబర్‌ కూడా పదవికి రాజీనామా చేయరని, మా ఎంపీలు 14 నెలల పదవీ కాలాన్ని త్యాగం చేశారని పేర్కొన్నారు. ప్రత్యేక హోదాను చంద్బరాబు అపహాస్యం చేస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. విజయవాడలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. అధికారంలోకి వస్తే ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని ఎన్నికల్లో టీడీపీ, బీజేపీలు హామీ ఇచ్చాయన్నారు. హోదా ఇవ్వకపోగా ఆ రెండు పార్టీలు ప్రజలను మభ్యపెట్టాయన్నారు. మొదటి నుంచి ప్రత్యేక హోదా కోసం వైయస్‌ఆర్‌సీపీ కోసం పోరాటం చేస్తుందన్నారు. వైయస్‌ జగన్‌  నాయకత్వంలో అనేక ఆందోళన చేపట్టామన్నారు. ప్రత్యేక హోదా నినాదం సజీవంగా ఉందంటే అది వైయస్‌ఆర్‌సీపీ ఉద్యమాల ఫలితమే అన్నారు. ఈక్రమంలోనే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేసేందుకు ఎంపీలతో రాజీనామాలు చేయిస్తామని మా అధినేత చెప్పారన్నారు. అందులో భాగంగా మా ఎంపీలు రాజీనామా చేశారన్నారు. ఆ రాజీనామాలు రెండు నెలల తరువాత ఆమోదించారన్నారు. 

రాష్ట్ర అభివృద్ధి కోసం 14 నెలల పదవీ కాలాన్ని త్యాగం చేస్తే టీడీపీ నేతలు అపహాస్యం చేస్తున్నారని హేళనగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. అనుభజ్ఞుడైన చంద్రబాబు చౌకబారు విమర్శలు చేయడం బాధాకరమన్నారు. గ్రామ సర్పంచ్‌ పది రోజుల ముందు రాజీనామా చేయలేని సమయంలో 14 నెలల పదవీ కాలం ఉన్నా మా ఎంపీలు రాజీనామా చేశారన్నారు. అలాంటి ఎంపీలను అపహాస్యం చేస్తున్నది వైయస్‌ఆర్‌సీపీ నేతలను కాదని, వైయస్‌ జగన్‌ను కాదని, ప్రత్యేక హోదా అనే అంశాన్ని చంద్రబాబు అపహాస్యం చేస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు మొదటి నుంచి అపహాస్యం చేస్తునే ఉన్నారన్నారు. 

బీజేపీతో నాలుగేళ్లు భాగస్వామిగా పెట్టుకొని టీడీపీ ప్రభుత్వం ప్రత్యేక హోదా ఉద్యమంపై ఉక్కుపాదం మోపిందన్నారు. యువభేరిలకు హాజరైతే పీడీ యాక్టు అని , హోదా ముగిసిన అధ్యాయం అన్న చంద్రబాబు ..ఇప్పుడు యూటర్న్‌ తీసుకున్నారన్నారు. అలా యూటర్న్‌ తీసుకోవడానికి వైయస్‌ఆర్‌సీపీనే అన్నారు. కేవలం ప్రజలను మభ్యపెట్టేందుకే చంద్రబాబు కేంద్రం నుంచి బయటకు వచ్చారన్నారు. వైయస్‌ జగన్‌ అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు ముందుకు వచ్చిన రోజున అవిశ్వాసం అనివార్యం కాదన్న సీఎం..మళ్లీ మా బాటలోకి వచ్చారన్నారు. ఇవాళ బీజేపీతో వైయస్‌ఆర్‌సీపీకి సంబంధాలు ఉన్నట్లు దుష్ప్రచారం చేస్తున్నారన్నారు. ముగ్గురు ఎంపీలను టీడీపీలో చేర్చుకున్న చంద్రబాబు వారిపై అనర్హత వేటు పడకుండా స్పీకర్‌ వ్యవస్థను మేనేజ్‌ చేశారన్నారు. 

వ్యవస్థలను మేనేజ్‌ చేసే దుర్మార్గమైన పద్ధతి ఒక్క చంద్రబాబుకు మాత్రమే ఉందన్నారు. రాష్ట్రంలో ప్రజలకు చెవ్వుల్లో పువ్వులు పెట్టింది ఎవరు చంద్రబాబు అని నిలదీశారు. చంద్రబాబుకు ఎప్పుడైనా పోరాటం చేసిన లక్షణాలు ఉన్నాయా అని ప్రశ్నించారు. రాజ్యాంగేతర శక్తితో వెన్నుపోట్లు పొడిచి అధికారంలోకివచ్చిన వ్యక్తి చంద్రబాబు అన్నారు. పోరాడి గెలుచుకున్న సందర్భాలు చంద్రబాబుకు ఎప్పుడు లేవన్నారు. దుర్మార్గమైన రాజకీయాలు చేసే నీచమనస్తత్వం గల చంద్రబాబు వైయస్‌ఆర్‌సీపీ ఎంపీల రాజీనామాలను అపహాస్యం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐదు కోట్ల ప్రజల హక్కులను అపహాస్యం చేస్తే కొట్టుకుపోతావని హెచ్చరించారు. 

భవిష్యత్తులో ఏపీని నంబర్‌గా తీర్చిదిద్దుతానంటున్న చంద్రబాబు ఇప్పుడేం చేశారో సమాధానం చెప్పాలని పట్టుపట్టారు. నాలుగేళ్లు బీజేపీతో కలిసి ఊరేగి..ఇప్పుడు బయటకు వచ్చి తనది తప్పేమి లేదంటున్నారన్నారు. బీజేపీ, టీడీపీ కుంభకోణాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయన్నారు. ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబరావు మాట్లాడుతూ..కేంద్రంలో ఒక పెద్ద కుంభకోణం జరిగిందని, నెల రోజుల్లో బయటకు తీయబోతున్నాని బ్లాక్‌ మేయిల్‌ రాజకీయాలు చేస్తున్నారన్నారు.  ఇది చంద్రబాబు బుద్దే అన్నారు. కుటుంబరావు గారు..త్వరగా కేంద్ర ప్రభుత్వం చేసిన కుంభకోణాలు తొందరగా బయటపెట్టాలని కోరారు. బీజేపీ, టీడీపీ కుంభకోణాలు ప్రజలు చూడాలని, రాబోయే కాలంలో ఈ రెండు పార్టీలను చిత్తుచిత్తుగా ఓడిస్తారని హెచ్చరించారు. చంద్రబాబు ..ఈ నాలుగేళ్లలో చేసిన పాలన ఒక దౌర్భగ్యమన్నారు. 

 ప్రత్యేక హోదా మీద చంద్రబాబుకు చిత్తశుద్ధి లేదన్నారు. ఏదో విధంగా ప్రజలను మభ్యపెట్టి మళ్లీ అధికారంలోకి వచ్చేందుకు ప్రయత్నిస్తున్నారని అంబటి అన్నారు. ఐదురుగు ఎంపీలు తమ పదవులకు రాజీనామా చేసి త్యాగం చేశారన్నారు. ఉప ఎన్నికలు రావాలో? వద్దో ఎన్నికల కమిషన్‌ చేతిలో ఉందన్నారు. నంద్యాల ఉప ఎన్నికల్లో ఎలా గెలిచారో ప్రజలంతా చూశారన్నారు. లోక్‌సభ స్పీకర్‌ మాదిరిగా కాకుండా నీ చేతిలో ఉన్న స్పీకర్‌తో ఫిరాయింపు ఎమ్మెల్యేల రాజీనామాలు ఆమోదించి ఉప ఎన్నికలకు రావాలని సవాల్‌ విసిరారు. ప్రత్యేక హోదాను వెన్నుపోటు పొడిచిన చంద్రబాబుకుప్రజలు బుద్ధి చెప్పే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని హెచ్చరించారు. పవిత్రమైన ఒక ఆశయం కోసం పోరాటం చేస్తున్నామన్నారు. చంద్రబాబు మాత్రం ప్రభుత్వ సొమ్ముతో దొంగ దీక్షలు చేస్తూ..ప్రతిపక్షంపై విమర్శలు చేస్తున్నారని విమర్శించారు.
 
Back to Top