మన గళాన్ని ఢిల్లీకి వినిపిద్దాం


– 19న అన్ని ప్రధాన కేంద్రాల్లో ప్రజా సంకల్ప మహా మానవహారాలు
– అన్ని వర్గాల ప్రజలు పాల్గొని మద్దతివ్వాలి
– అవిశ్వాస తీర్మానానికి టీడీపీ మద్దతివ్వాలి
– రాష్ట్ర ప్రయోజనాల కోసం ఏ పార్టీ అవిశ్వాస తీర్మానం పెట్టినా మద్దతిస్తాం

 
విశాఖ: ఐదు కోట్ల ప్రజల ఆకాంక్ష అయిన ప్రత్యేక హోదా కోసం ప్రతి ఒక్కరూ గొంతెత్తి నినదించాలని, మన గళం ఢిల్లీకి వినిపిద్దామని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ పిలుపునిచ్చింది. కేంద్రంపై వైయస్‌ఆర్‌సీపీ ప్రవేశపెట్టిన ఆవిశ్వాస తీర్మానానికి మద్దతుగా ఈ నెల 19న అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో తలపెట్టిన ప్రజా సంకల్ప మహా మానవహారాలను విజయవంతం చేయాలని వైయస్‌ఆర్‌సీపీ సీనియర్‌ నేత బొత్స సత్యనారాయణ కోరారు. శనివారం ఆయన విశాఖలో మీడియాతో మాట్లాడారు.  ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని కోరుతూ వైయస్‌ఆర్‌సీపీ పోరాటం కొనసాగిస్తుందని, ఇందులో భాగంగా కేంద్రంపై మా ఎంపీలు అవిశ్వాస తీర్మానం పెట్టారన్నారు. అయితే సభ్యుల ఆందోళన నడుమ ఈ నెల 16న లోక్‌సభలో అవిశ్వాస తీర్మానంపై చర్చ జరగలేదన్నారు. మళ్లీ ఈ నెల 19న అవిశ్వాస తీర్మానంపై మరోమారు నోటీసులు ఇచ్చినట్లు చెప్పారు. కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు ప్రజా సంకల్ప మహా మానవహారం అన్ని నియోజకవర్గాల కేంద్రాల్లో ఈ నెల 19న నిర్వహించాలని వైయస్‌ జగన్‌ పిలుపునిచ్చారన్నారు. ప్రత్యేక హోదా మా హక్కు అని కోకుకుంటున్న అన్ని పక్షాలు, అన్ని ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాలు, వ్యాపార సంఘాలు  మద్దతు ఇవ్వాలని కోరారు. ఐదు కోట్ల ఆంధ్రుల  గొంతు ఢిల్లీకి వినపడేలా, కనిపించాలన్నదే మా పార్టీ ఉద్దేశ్యమన్నారు. 
– గత రెండు రోజులుగా మేం కేంద్రానికి అవిశ్వాస తీర్మానం ఇచ్చిన తరువాత మా అధ్యక్షులు వైయస్‌జగన్‌ అన్ని పార్టీలకు ఓ లేఖ రాశారని, వారి మద్దతు కోరుతున్న నేపథ్యంలో టీడీపీ పోలిట్‌బ్యూరో సమావేశం ఏర్పాటు చేసి ఎవరు పెట్టినా మేం మద్దతిస్తామని ముందు చెప్పి..మళ్లీ తడబడి, రాజకీయ ప్రయోజనాలను ఆశీంచి ఇంకో ప్రకటన చేశారన్నారు. మేమే అవిశ్వాస తీర్మానం పెడతామని, ఇంకొకరితో కలువమని పెద్ద పెద్ద మాటలు చంద్రబాబు మాట్లాడారన్నారు. చంద్రబాబుకు ప్రత్యేక హోదా పట్ల, రాష్ట్ర ప్రయోజనాల పట్ల చిత్తశుద్ది లేదన్నారు. చంద్రబాబువి డ్రామాలు, నాటకాలన్నారు. దయచేసి మీ ఎత్తులు, ఎత్తుగడలు ఆపాలని కోరారు. మా నాయకులు చెప్పినట్లుగా మేం పెట్టిన అవిశ్వాస తీర్మానానికి మద్దతు ఇవ్వాలని, లేదంటే ఏ పార్టీ అవిశ్వాస తీర్మానం పెట్టినా రాష్ట్ర ప్రయోజనాల కోసం మద్దతిస్తామన్నారు. 
 
Back to Top