వైజాగ్: ఉపాధి పనులు చేసిన కూలీలకు డబ్బులు ఇవ్వకుండా ప్రభుత్వం అన్యాయం చేస్తుందని, పేదల కడుపు కొట్ట వద్దని వైయస్‌ఆర్‌సీపీ సీనియర్ నాయకులు బొత్స సత్యనారాయణ అన్నారు. రాష్ట్రంలో ఉపాధి హామీ పథకం నీరుగారిపోతుందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. వైజాగ్‌లో బుధవారం బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడారు. జూన్ నెల నుంచి ఇంతవరకు కూలీలకు బట్వాడా ఇవ్వకుండా ఇబ్బంది పడుతుంటే ఈ ప్రభుత్వం ఏం చేస్తోందన్నారు. మనుషులతో చేయించాల్సిన పనులను మిషన్లతో చేయిస్తున్నారని వైయస్‌ఆర్‌సీపీ ఫిర్యాదు చేస్తే దానికి సమాధానం చెప్పకుండా తప్పించుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మూడున్నర సంవత్సరాల్లో లక్ష కోట్ల అప్పు చేశారే..ఉపాధి కూలీలకు డబ్బులు ఇవ్వలేరా? అని బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. పంచభూతాలను పంచుకు తింటున్నారని ఫైర్ అయ్యారు. టీడీపీ అవినీతికి ఎక్కడ అంతమని ఆందోళన వ్యక్తం చేశారు.