‌20 నుంచి వైయస్ఆర్‌ కాంగ్రెస్ రిలే దీక్షలు

ఒంగోలు :

వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ గౌరవ అధ్యక్షురాలు శ్రీమతి వైయస్‌ విజయమ్మ నిరవధిక నిరాహార దీక్షకు మద్దతుగా ప్రకాశం జిల్లాలోని అన్ని మండల కేంద్రాల్లోనూ రిలే నిరాహార దీక్షలు చేయాలని శ్రేణులకు జిల్లా కన్వీనర్‌ నూకసాని బాలాజీ పిలుపునిచ్చారు. ఓట్లు, సీట్ల కోసమే రాష్ట్రాన్ని విభజించాలన్న కాంగ్రెస్‌ పార్టీ నిరంకుశ వైఖరికి నిరసనగా శ్రీమతి విజయమ్మ ఈనెల 19 నుంచి గుంటూరులో 'సమరదీక్ష' పేరుతో ఆమరణ నిరాహార దీక్ష చేయనున్నారు. అందరికీ సమన్యాయం చేయలేనప్పుడు రాష్ట్రాన్ని యథాతథంగా ఉంచాలన్న వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ డిమాండ్‌కు కేంద్రం నుంచి సానుకూల స్పందన లేనందుకు నిరసనగా శ్రీమతి విజయమ్మ ఆమరణ దీక్ష చేయాలని నిర్ణయించారు.

శ్రీమతి విజయమ్మ సమరదీక్ష నేపథ్యంలో ప్రకాశం జిల్లాలోని నియోజకవర్గాల పార్టీ సమన్వయకర్తలు, మండల శాఖల కన్వీనర్లు రిలే నిరాహార దీక్షలపై కలిసి చర్చించుకుని కార్యాచరణ సిద్ధం చేసుకోవాలని బాలాజీ కోరారు. శ్రీమతి విజయమ్మ ఆమరణ దీక్ష కొనసాగినంత కాలం మండల కేంద్రాల్లో కూడా రిలే దీక్షలు కొనసాగించాలని ఆయన పిలుపునిచ్చారు.

Back to Top