చేనేతలకు మొత్తం బకాయిలు ఇచ్చేవరకు పోరాటం

ధర్మవరం (అనంత‌పురం): ధర్నాలు చేస్తేనే ఈ ప్రభుత్వం స్పందిస్తోంది.. ఆందోళనలు చేస్తేనే చేనేతలకు న్యాయం జరుగుతుంది. అందుకే చేనేతలకు అందాల్సిన ముడిపట్టు రాయితీ బకాయిలు మొత్తం ఇచ్చేవరకు చేనేత రిలేదీక్షలను ఆపేదిలేదని మాజీ ఎమ్మెల్యే,  వైయ‌స్ఆర్‌సీపీ  ధర్మవరం నియోజవకర్గ సమన్వయర్త కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి అన్నారు. ముడిపట్టు రాయితీ బకాయిలు చెల్లించాలంటూ వైయ‌స్ఆర్‌సీపీ ఆధర్వర్యంలో జరుగుతున్న రిలేదీక్షలు శుక్రవారం నాటికి 26వ రోజుకు చేరాయి. ఈ దీక్షలకు సంఘీభావం తెలిపిన కేతిరెడ్డి మాట్లాడుతూ.. వైయ‌స్ఆర్‌సీపీ  పోరాటాల ఫలితంగా చేనేతలకు 5 నెలల ముడిపట్టు రాయితీని వారి ఖాతాల్లోకి జమ చేయడం జరుగుతోందని, అయితే మొత్తం బకాయిలు చెల్లించే వరకు దీక్షలు ఆపేదిలేదన్నారు. తెలుగుదేశం పార్టీ అనవసరమైన వాటికి మాత్రం రూ. కోట్లు ఖర్చు చేస్తోందని, ఇబ్బందులు పడుతున్న చేనేత రంగాన్ని ఆదుకోవడానికి మాత్రం చేతులు రావడం లేదని విమర్శించారు. గతంలో అనేక సంక్షేమ పథకాలు అందేవని, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత వాటన్నింటినీ ఎత్తివేసి చేనేత రంగానికి తీరని ద్రోహం చేస్తున్నారని విమర్శించారు. ముడిపట్టు రాయితీ దాదాపు 19 కోట్లు బకాయిలు పడ్డారని, చంద్రబాబు ధర్మవరం వచ్చి బాహాటంగా ప్రకటించి పోయిన రూ.1,000 సబ్సీడీని కూడా అటకెక్కించారని దుయ్యబట్టారు. చేనేత కార్మికులకు రూ.1,000 చొప్పున ఇంకా 3నెలలు, రూ.600 చొప్పున 13నెలల బకాయిలు ఉన్నాయన్నారు. వీటన్నింటినీ చేనేత కార్మికుల ఖాతాల్లోకి వెంటనే జమ చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

తాజా ఫోటోలు

Back to Top