40 ఇయర్స్‌ ఇండస్ట్రీ ఒక ఊసరవెల్లి

చంద్రబాబు రంగులు మార్చుతూ ప్రజలను మోసం 
తిరుపతి సభలో 10 ఏళ్లు ప్రత్యేక హోదా ఇస్తామన్న మోడీ
నాలుగేళ్లు అయినా ఎందుకు ఇవ్వలేదు
మళ్లీ అధికారంలోకి రావాలని చంద్రబాబు కుయుక్తులు
హోదా సాధించే వరకు వైయస్‌ఆర్‌ సీపీ పోరాటం ఆగదు
ఢిల్లీ: 40 ఇయర్స్‌ ఇండస్ట్రీ అని చెప్పుకొని తిరిగే చంద్రబాబు ఊసరవెల్లిలా రంగులు మార్చడం తగునా అని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ వరప్రసాదరావు ప్రశ్నించారు. విభజన సమయంలో ఆంధ్రప్రదేశ్‌ అన్యాయానికి గురైందని 10 సంవత్సరాలు ప్రత్యేక హోదా ఇవ్వాలని చెప్పిన బీజేపీ ఇప్పుడు ఎందుకు ఇవ్వడం లేదని నిలదీశారు. పార్లమెంట్‌ ఆవరణలో ఎంపీ వరప్రసాద్‌ మీడియాతో మాట్లాడుతూ.. తిరుపతి ఎన్నికల సభలో ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్రమోడీ మేం అధికారంలోకి వస్తే హోదా ఇస్తామని చెప్పారని గుర్తు చేశారు. నాలుగు సంవత్సరాలు పూర్తయ్యింది ఇంకా ఆంధ్రప్రదేశ్‌కు హోదా రాలేదెందుకు మోడీ గారూ అని ప్రశ్నించారు. నాలుగేళ్లుగా ప్రత్యేక హోదా కోసం వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ పోరాడుతుందన్నారు. ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు ప్రత్యేక హోదాను, విభజన చట్టంలోని అంశాలను కేంద్రాన్ని నిలదీసి అడగలేక ఇంకా కేంద్రంలో కొనసాగుతున్నాడన్నారు. 

ప్రజల నుంచి వ్యతిరేక వస్తుందని గ్రహించిన చంద్రబాబు మళ్లీ ఏదోరకంగా అధికారంలోకి రావాలని ప్రత్యేక హోదా రాగం ఎత్తుకుందని ఎంపీ వరప్రసాద్‌ విమర్శించారు. అనుభవం ఉన్న వ్యక్తి ఇలా ప్రజలను మోసం చేస్తూ ఊసరవెల్లిలా రంగులు మార్చడం తగునా అని ప్రశ్నించారు. ఇప్పటికైనా చంద్రబాబు హోదా కోసం చిత్తశుద్ధితో పోరాటం చేయాలని, వైయస్‌ఆర్‌ సీపీ అవిశ్వాస తీర్మానానికి మద్దతు ఇవ్వాలని కోరారు. గతంలో చంద్రబాబు హోదా గురించి మాట్లాడితే హేళన చేశారని, ఇప్పుడు రంగులు మార్చుతున్నాడన్నారు. దుగ్గరాజుపట్నం పోర్టు నిర్మిస్తే మూడు నియోజకవర్గాలు అభివృద్ధి చెందుతాయన్నారు. 
 
Back to Top