రాజధాని గ్రామాల్లో పర్యటించిన వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలు


గుంటూరు : వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు ఆ పార్టీకి చెందిన 42 మంది ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎమ్మెల్సీలతోపాటు మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు నేతృత్వంలో ఏర్పాటైన రాజధాని రైతులు, కౌలురైతులు, కూలీల హక్కుల పరిరక్షణ కమిటీ ప్రతినిధులు, మాజీ మంత్రులు సంఘటితంగా రాజధాని గ్రామాల్లో విస్తృతంగా పర్యటించారు. అక్కడి రైతులు, కౌలు రైతులు, కూలీలు, వ్యవసాయాధారిత కుటుంబాల హక్కుల కోసం... పచ్చని పంట పొలాల్లో కలయతిరిగారు. వారి కుటుంబ సభ్యులతో మమేకమయ్యారు.

పోలీసులు అడ్డుకుంటున్నారు : మల్లెల 
వైఎస్సార్ సీపీ బృందం 12.40 గంటలకు రాయపూడిలో రైతు మల్లెల శేషగిరిరావు జామతోటను పరిశీలించింది. శేషగిరిరావు మాట్లాడుతూ తనను విజయవాడ నుంచి ఇక్కడికి రాకుండా పోలీసులు అడుగడుగునా అడ్డుకున్నారన్నారు. ఇక్కడ ఆరాచకం రాజ్యమేలుతోందన్నారు. నాలుగు ఎకరాల్లోని తన జామతోట గ్రామకంఠం కింద ఉందన్నారు. తొలుత గ్రామకంఠంలోని భూములను తీసుకోబోమని చెప్పిన అధికారులు తర్వాత తీసుకుంటామంటున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. వాస్తవానికి సీఆర్‌డీఏ కమిషనర్‌కు ఎక్కువ అధికారాలు కట్టబెడుతూ నిజమైన యజమాని హక్కులకు తూట్లు పొడిచేలా చట్టం రూపొందిం చారని, ఇది పూర్తిగా రాజ్యాంగం చాప్టర్-3 కింద పొందుపరిచిన వ్యక్తి స్వేచ్ఛ హక్కుకు భంగం కలిగించడమే అన్నారు. సీఆర్‌డీఏ యాక్ట్ 2014లో భూములు అప్పగించిన యజమానులకు అభివృద్ధి చేసిన భూమి ఎంత ఇస్తారనే పారదర్శకత లేదన్నారు. అందుకే  భూములు అప్పగించలేమని రైతుల తరఫున వైఎస్సార్ సీపీ పోరాటం చేయాలని నాయకులను కోరారు.

పరిహారం ఇస్తారో లేదో : కూలీల ఆందోళన

వైఎస్సార్ సీపీ బృందం 1.20 గంటలకు లింగాయపాలెంలో పర్యటించింది. అక్కడి అరటితోటల్లో వ్యవసాయకూలీలు, రైతులతో మాట్లాడారు. రైతులు, కూలీలు ఏడుకొండలు, వెంగళరెడ్డి, బండారు సాంబయ్య మాట్లాడుతూ తాము వ్యవసాయ పనులకు వెళ్లడంతో పాటు నాలుగు ఎకరాలు కౌలుకు తీసుకొని సాగుచేసుకుంటున్నట్లు చెప్పారు. ఇక్కడ 365 రోజులూ పని ఉంటుంది. రోజుకు 500 నుంచి 800 రూపాయల వరకు వస్తాయని, ప్రభుత్వం మాత్రం కూలీలకు నెలకు 2,500 పరిహారంగా ఇస్తామంటున్నారని తెలిపారు. అది కూడా ఇస్తారో.. ఇవ్వరో.. తెలియదని వైఎస్సార్ సీపీ అండగా ఉండి తమను కాపాడాలని విజ్ఞప్తిచేశారు.

ఆహార కొరత ఏర్పడే ప్రమాదం : తాళ్లాయపాలెం రైతులు
2.45 గంటలకు తాళ్లాయపాలెంలో పర్యటించి అక్కడ కృష్ణానది తీరంలో క్యారెట్ పంటను పరిశీలించారు. అక్కడి రైతులతో మాట్లాడారు. మూడు పంటలు పండుతాయని, ప్రధానంగా క్యారెట్, అరటి, ఉల్లి, తదితర పంటలు ఇక్కడ పండుతాయని, ఇక్కడి నుంచే కృష్ణా జిల్లాకు సరఫరా చేస్తామని రైతులు తెలిపారు. ఇప్పుడు భూములు లాక్కుంటే ఆహార కొరత ఏర్పడే ప్రమాదం ఉందన్నారు. దీనిపై స్పందించిన ఎమ్మెల్యేలు అసెంబ్లీలో చర్చిస్తామని న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు. 3.20 గంటలకు మందడం గ్రామంలో నూతక్కి నరసింహనాయుడు తన గృహంలో ఏర్పాటుచేసిన అల్పాహార విందుకు ఎమ్మెల్యేలు హాజరయ్యారు. 4 గంటలకు నిడమర్రు గ్రామానికి వెళ్లి అక్కడి నుంచి సీఆర్‌డీఏ కమిషనర్‌కు వినతిపత్రం అందజేసేందుకు విజయవాడ వెళ్లారు.

జగన్ నేతృత్వంలో అసెంబ్లీలో చర్చిస్తాం

పలు గ్రామాల్లోని రైతులు క్షేత్రస్థాయిలో ఇక్కడ ప్రభుత్వం చేస్తున్న అరాచకాలను వైఎస్సార్ సీపీ శాసనసభా పక్షం దృష్టికి తెచ్చారు. తమకు భూములు కావాలి తప్ప ప్రభుత్వం ఇచ్చే లక్షలు, కోట్లు అవసరం లేదని తేల్చిచెప్పారు. దీనిపై స్పందించిన ఎమ్మెల్యేలు అసలు సీఆర్‌డీఏకు చట్టబద్ధత లేదని, పంట భూములను బలవంతంగా లాక్కుంటే ఒప్పుకొనేది లేదని, వైఎస్సార్ సీపీ శాసనసభ పక్షనేత, ప్రతిపక్షనాయకుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నేతృత్వంలో అసెంబ్లీలో దీనిపై ప్రభుత్వాన్ని నిలదీస్తామని హామీ ఇచ్చి రైతుల్లో ఆత్మవిశ్వాసాన్ని నింపారు.

పాలకుల బెదిరింపులకు  భయపడకండి : వైఎస్సార్ సీపీ

మధ్యాహ్నం 12.10 గంటలకు తుళ్లూరు చేరుకున్న ప్రజాప్రతినిధులు, నేతలు అక్కడి ప్రధాన కూడలిలో ఉన్న దివంగత సీఎం డాక్టర్ వై.ఎస్.రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అక్కడి నుంచి పాదయాత్రగా వెళ్లి సత్రం సెంటర్‌లోని వైఎస్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం అక్కడే తమను కలిసిన రైతులు వెంకటేశ్వరరావు, చనుమోలు శేషగిరిరావు, పెరికల వీరయ్యతోపాటు కూలీలతో చర్చించారు. పాలకుల బెదిరింపులకు, అధికారుల అదిలింపులకు భయపడే తాము భూములిచ్చామని రైతులు వారి దృష్టికి తీసుకువచ్చారు. వైఎస్సార్ సీపీ అండగా ఉంటే.. ఇచ్చిన అంగీకారపత్రాలను వెనక్కు తీసుకునేందుకు కూడా తాము సిద్ధమని ప్రకటించారు.

ఉద్దండ్రాయునిపాలెంలో పూలతో స్వాగతం
వైఎస్సార్ సీపీ నేతలకు ఉద్దండ్రాయునిపాలెంలో ఘన స్వాగతం లభించింది. 2.10 గంటలకు ఇక్కడికి వచ్చిన వారికి గ్రామ పొలిమేర నుంచి పూలవాన కురిపిస్తూ సాదరంగా ఆహ్వానించారు. తమ భూముల్ని అసైన్డ్ ల్యాండ్ పేరిట భయపెట్టి స్వాహా చేయాలని చూస్తున్నారని ఆందోళన వ్యక్తంచేశారు. ఇటు ప్రభుత్వం, అటు అధికారులు తమ మొర ఆలకించడం లేదనీ, వైఎస్సార్ సీపీ తమ పక్షాన నిలబడి పోరాడాలనీ వారు వేడుకున్నారు. దీనికి స్పందించిన నేతలు వారిని ఓదారుస్తూ ఉద్యమాన్ని ఉధృతం చేసేందుకు తాము వచ్చామనీ, రైతుల అనుమతి లేకుండా పంట పొలాల్లో ఎవరైనా ఎలా అడుగు పెడతారో చూస్తామని హామీ ఇచ్చారు.
Back to Top