గవర్నర్ ను కలిసిన వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు

హైదరాబాద్, జూన్ 25: స్థానిక సంస్థల పాలకవర్గాలకు తక్షణం ఎన్నికల తేదీని ప్రకటించి అనిశ్చిత పరిస్థితిని తొలగించాలని, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు గవర్నర్ నరసింహన్ కు విజ్ఞప్తి చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఎంపీటీసీల, జెడ్పీటీసీ, మున్సిపల్ వార్డు సభ్యుల స్థానాలకు ఎన్నికలు జరిగి 40 రోజులు దాటినా వీటి పాలక వర్గాల అధ్యక్ష, ఉపాధ్యక్ష, మేయర్, డిప్యూటీ మేయర్, చైర్మన్, వైస్ చైర్మన్ పదవులకు ఎన్నికలు ఎపుడు నిర్వహించేదీ తేలకుండా ఉందని వారు ఆయన దృష్టికి తెచ్చారు. రాజ్ భవన్ లో బుధవారం గవర్నర్ ను కలిసిన ఎమ్మెల్యేలు ఆయనకు ఈ మేరకు ఒక వినతి పత్రాన్ని సమర్పించారు.

'ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సమైక్యంగా ఉన్నపుడే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించింది. 2014 జూన్ 2న రెండు రాష్ట్రాల ఆవిర్భావం జరుగుతుందని ముందుగానే తెలిసిన నేపథ్యంలో అంతకు ముందే మార్చి తొలి వారంలోనే స్థానిక ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంది. అయినా అలా చేయకుండా ఇటీవల మాత్రమే ఎన్నికల కమిషన్ ఆ కసరత్తును పూర్తి చేసింది.

నూతన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తెలుగుదేశం ప్రభుత్వం ఇతర పార్టీల నుంచి ఎన్నికైన వారిని తమవైపునకు తిప్పుకునే అనారోగ్యకరమైన చర్యలకు పాల్పడుతోంది. ఒక పార్టీ తరఫున ఎన్నికైన ప్రజా ప్రతినిధులను ప్రలోభపెట్టి, బెదిరించి ఫిరాయింపులను ప్రోత్సహిస్తోంది. ఇది ప్రజాస్వామ్య ఎన్నికల స్ఫూర్తికే విరుద్ధం. కనుక సువిశాల ప్రజాస్వామ్య ప్రయోజనాల పరిరక్షణ రీత్యా తక్షణం పాలక వర్గాలకు ఎన్నికల తేదీని ప్రకటించాల్సిందిగా రాష్ట్ర ఎన్నికల కమిషన్ ను ఆదేశించాలని విజ్ఞప్తి చేస్తున్నాం' అని ఎమ్మెల్యేలు గవర్నర్ కు సమర్పించిన వినతి పత్రంలో పేర్కొన్నారు.

Back to Top