సిగ్గుమాలిన రాజకీయాలకు కేరాఫ్‌ చంద్రబాబు

రాష్ట్రాన్ని విభజించిన కాంగ్రెస్‌తో పొత్తుకు వెంపర్లాట
చంద్రబాబు చర్యతో ఎన్టీఆర్‌ ఆత్మ మళ్లీ క్షోభిస్తుంది
తెలుగువారి ఆత్మగౌరవం నినాదంతో వెలిసిన పార్టీ టీడీపీ
గుంటూరులో రాహుల్‌గాంధీని కోడిగుడ్లతో కొట్టించి.. పొత్తుకు
అవసరం కోసం ఎంతకైనా దిగజారే వ్యక్తి చంద్రబాబు ఒక్కడే
ప్రజా సమస్యలకు విలువ లేని సభకు మేము రాలేం
ఫిరాయింపుదారులపై చర్యలు తీసుకుంటేనే సమావేశాలకు
రెయిన్‌గన్‌తో ఎకరా అయినా కాపాడి ఉంటే రాజకీయాల నుంచి తప్పుకుంటా 
చంద్రబాబుకు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సవాల్‌

విజయవాడ: ఆంధ్రరాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సిగ్గుమాలిన రాజకీయాలకు తెరతీస్తున్నారని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత, ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ధ్వజమెత్తారు. రాష్ట్రాన్ని అన్యాయంగా విభజించి, ప్రత్యేక హోదాను చట్టంలో పెట్టకుండా మోసం చేసిన కాంగ్రెస్‌తో పొత్తుకు తెలుగుదేశం పార్టీ వెంపర్లాడడం సిగ్గుచేటన్నారు. చంద్రబాబు మానసిక జబ్బుతో బాధపడుతున్నాడని, కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చేది లేదు.. ప్రత్యేక హోదా ఇచ్చేది లేదన్నారు. టీడీపీ, కాంగ్రెస్‌ పార్టీ పొత్తులపై విజయవాడ వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలుగువారి ఆత్మగౌరవ నినాదంతో కాంగ్రెస్‌ పార్టీకి వ్యతిరేకంగా స్వర్గీయ ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీని స్థాపించారని, పార్టీ సిద్ధాంతాలు, విలువలను మరిచి చంద్రబాబు కాంగ్రెస్‌తోనే పొత్తుకు రెడీ అవుతున్నాడన్నారు. చంద్రబాబు చర్యతో ఎన్టీఆర్‌ ఆత్మ మళ్లీ క్షోభిస్తుందని, చంద్రబాబు నడిపే టీడీపీకి విలువలు సిద్ధాంతాలు లేవన్నారు. 

గతంలో కిరణ్‌కుమార్‌ ప్రభుత్వానికి ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు అధికార పార్టీకి మద్దతు ఇచ్చి మూడున్నర సంవత్సరాలు ప్రభుత్వాన్ని నడిపి ప్రజాస్వామ్య విలువలను తుంగలో తొక్కాడని మండిపడ్డారు. అప్పటి నుంచే చంద్రబాబుకు బీజేపీ, కాంగ్రెస్‌తో సంబంధాలు పెట్టుకున్నాడన్నారు. ఈ ఎన్నికల పొత్తే అందుకు నిదర్శనమన్నారు. 2014లో అధికారంలోకి రావడం కోసం కాంగ్రెస్‌ను బండబూతులు తిట్టాడని, గుంటూరుకు కాంగ్రెస్‌పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ వస్తే కోడిగుడ్లతో కొట్టించాడని, కాంగ్రెస్‌ను అంతమొందించేందుకు కత్తులు, కొడవళ్లు పట్టుకొని రోడ్ల మీదకు రావాలని పిలుపునిచ్చిన వ్యక్తి చంద్రబాబు అన్నారు. కాంగ్రెస్‌ దేశానికి పట్టిన శని, కాంగ్రెస్‌ను తరిమికొట్టాలి, కాంగ్రెస్‌ విధానం దోచుకోవడమే, కాంగ్రెస్‌ను పాతరవేయాలి అంటూ చంద్రబాబు చేసిన అనేక ఆరోపణల పత్రికా కథనాలను సైతం పెద్దిరెడ్డి మీడియాకు చూపించారు. 

పథకం ప్రకారమే కిరణ్‌కుమార్‌రెడ్డిని చంద్రబాబు కాంగ్రెస్‌లో చేర్పించారని పెద్దిరెడ్డి అనుమానం వ్యక్తం చేశారు. సీఎం తమ్ముళ్లు వీరప్పను మించిన స్మగ్లర్లు అని ఆరోపణలు చేసిన చంద్రబాబు వారిని పిలిచి కార్పొరేషన్‌ చైర్మన్‌గా కేబినెట్‌ ర్యాంక్‌ ఇచ్చాడన్నారు. కిరణ్‌ దొంగల కంపెనీకి నాయకుడని మాట్లాడి ఇప్పుడు వారితోనే పొత్తుకు చంద్రబాబు సిద్ధపడడం సిగ్గుచేటన్నారు. అధికారం కోసం ఎంత నీచమైన పని చేయడానికైనా చంద్రబాబు వెనుకాడడని పెద్దిరెడ్డి ఆరోపించారు. 

చంద్రబాబు వల్ల రాష్ట్రానికి, ప్రజలకు ఒరిగిందేమీ లేదని, ఇచ్చిన వందల హామీల్లో ఒక్కటంటే ఒక్కటి సక్రమంగా నెరవేర్చిన దాఖలాలు లేవన్నారు. గతంలో పెద్దనోట్ల రద్దు కోసం జాతీయ స్థాయిలో ఉద్యమం చేస్తాను.. నా వల్లే నోట్ల రద్దు అంటూ ప్రగల్భాలు పలికిన చంద్రబాబు నోట్ల రద్దుతో ప్రజలు ఆర్థికంగా చితికిపోయారని అదేనోటితో మాట్లాడడం సిగ్గుచేటన్నారు. చిత్తూరు జిల్లాలో 12 వంల అడుగుల మేర బోరు వేసినా నీళ్లు వస్తాయనే నమ్మకం లేదని, అలాంటి చోటు నుంచి వచ్చిన చంద్రబాబు అసెంబ్లీలో కరువును సమర్థవంతంగా ఎదుర్కొన్నాం.. 196 మండలాలను కరువు మండలాలుగా ప్రకటించామని చెప్పడం హేయనీయమన్నారు. కరువు మండలాలుగా ప్రకటించడం కాదు.. రైతులను ఆదుకోవడానికి ఏమైనా చర్యలు తీసుకున్నారా అని ప్రశ్నించారు. రెయిన్‌ గన్స్‌తో పంటలను సస్యశ్యామలం చేశామని చెప్పడంలో వాస్తవం లేదన్నారు. గతేడాది వందల కోట్ల వెచ్చించి తీసుకొచ్చిన రెయిన్‌ గన్స్‌ మూడు నెలలకే టీడీపీ నేతల ఇండ్లకు చేరాయన్నారు. ఖరీఫ్‌లో ఒక్క ఎకరానైనా రెయిన్‌గన్స్‌తో కాపాడి ఉన్నా.. రాజకీయాల నుంచి తప్పుకుంటానని సవాలు విసిరారు. పంట సంజీవని అనే పథకం అంటున్నారు.. అది ఎక్కడుందో.. ఎవరి చేతుల్లో ఉందో కూడా తెలియదన్నారు. 

ప్రతిపక్షం సభలో లేదని చంద్రబాబు ఇష్టం వచ్చినట్లుగా అబద్ధాలు చెబుతున్నాడని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మండిపడ్డారు. భూగర్భజలాలు పెరిగాయని చెబుతున్నాడని, అలా పెరిగితే ఎందుకు 12 వందల అడుగుల మేర రైతులు బోర్లు తవ్వుతున్నారని ప్రశ్నించారు. నీరు–చెట్టు పథకంలో కోట్లాది రూపాయలు దుర్వినియోగం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓటుకు కోట్ల కేసు నుంచి తప్పించుకోవడానికి రాత్రికి రాత్రి బీజేపీతో బేరసారాలు ఆడి కేసీఆర్‌కు అన్ని అప్పగించి హైదరాబాద్‌ను విడిచి పారిపోయిన వచ్చిన వ్యక్తి చంద్రబాబు అన్నారు. పొత్తులేకుండా ఏనాడూ ఎన్నికలకు వెళ్లని చంద్రబాబు బీజేపీకి ఓటు వేస్తే వైయస్‌ఆర్‌ సీపీకి వేసినట్లేనని మాట్లాడడం సిగ్గుచేటన్నారు. వైయస్‌ఆర్‌ సీపీ ఏ పార్టీతో కలిసే ప్రసక్తే లేదన్నారు. రాష్ట్ర విభజనకు కారణమైన, ప్రత్యేక హోదాను చట్టంలో పెట్టకుండా అన్యాయం చేసిన కాంగ్రెస్‌ పార్టీతో పొత్తుపెట్టుకుంటున్న చంద్రబాబుకు తగిన గుణపాఠం చెప్పాలని రాష్ట్ర ప్రజానికానికి పిలుపునిచ్చారు. 

రాజ్యాంగానికి తూట్లు పొడుస్తూ ప్రతిపక్ష ఎమ్మెల్యేలను సంతలో పశువుల్లా కొనుగోలు చేసి వారిలో నలుగురికి మంత్రి పదవులు కట్టబెట్టిన చంద్రబాబు ప్రతిపక్షం సభకు రావడం లేదని మాట్లాడడం సిగ్గుచేటన్నారు. చంద్రబాబు ప్రజాస్వామ్యాన్ని కించపరుస్తుంటే.. విలువలను కాపాడాల్సిన స్పీకర్‌ చంద్రబాబుకు వత్తాసు పలుకుతుంటే ఆ సభకు ఎందుకు రావాలని ప్రశ్నించారు. అంతేకాకుండా ప్రజా సమస్యలపై ప్రతిపక్షనేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మాట్లాడితే రెండు నిమిషాల్లో మైక్‌ కట్‌ చేస్తున్నారని, ఈలోగా అధికార పక్ష సభ్యులకు మైక్‌ ఇచ్చి తిట్టించే కార్యక్రమం చేస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రజా సమస్యలకు విలువ ఇవన్ని సమావేశాలకు ఎందుకు రావాలని నిలదీశారు. చంద్రబాబుకు దమ్ము, ధైర్యం ఉంటే ఫిరాయింపుదారులపై అనర్హత వేటు వేయాలని, అప్పుడే ప్రతిపక్షం సభకు వస్తుందన్నారు. ఇటీవల వెంకయ్యనాయుడు రాసి రిలీజ్‌ చేసిన బుక్‌లో మూడు నెలల్లో ఫిరాయింపుదారులపై చర్యలు తీసుకోవాలని ఉందన్నారు. విలువలు పాటించే వ్యక్తి చంద్రబాబుకు ఎందుకు మద్దతు ఇస్తున్నారని ప్రశ్నించారు. ఫిరాయింపు దారులపై చర్యలు తీసుకోవాలని చంద్రబాబుకు వెంకయ్యనాయుడు ఎందుకు చెప్పడం లేదన్నారు. పుస్తకంలో రాసేదొకటి.. మనసులో ఉండేదొకటన్నారు. 
Back to Top