ఔరంజేబుకు చంద్రబాబు దగ్గర పోలికలు

ఢిల్లీ: ఔరంగజేబుకు ఆంధ్రరాష్ట్ర సీఎం చంద్రబాబుకు దగ్గరపోలికలు ఉన్నాయని వైయస్‌ఆర్‌ సీపీ ఎమ్మెల్యే నారాయణస్వామి ఆరోపించారు. పదవి కోసం ఆరాటం తప్ప.. రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాటం చేసే తీరిక చంద్రబాబు లేదని ఎద్దేవా చేశారు. ఢిల్లీలో ఎంపీల దీక్షా శిబిరం వద్ద ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు.. దాన్ని సాధించుకుంనేందుకు ఎందాకైనా వెళ్లి పోరాటం చేస్తామని వైయస్‌ జగన్‌ ఉద్యమం చేస్తున్నారన్నారు. మాట ఇస్తే మడమ తిప్పని కుటుంబం వైయస్‌ఆర్‌దని, మాట ప్రకారం ఎంపీలతో రాజీనామాలు చేయించి పోరాటాన్ని ఉధృతం చేశారన్నారు. ఎంపీలంతా తమ ప్రాణాలను పణంగా పెట్టి నిరాహార దీక్ష చేపట్టారన్నారు. ప్రత్యేక హోదా వల్ల ఏమీ రాదు.. ప్యాకేజీ మేలు అని చెప్పిన వ్యక్తితో వైయస్‌ జగన్‌ హోదా కావాలనే నినాదం పలికించారన్నారు. ప్రజల కష్టాలు తెలుసుకునేందుకు వైయస్‌ జగన్‌ పాదయాత్ర చేస్తున్నారని, జననేత పోరాటాలు చూస్తున్న ప్రజలంతా ఆయన వెంటే నడుస్తున్నారన్నారు. కానీ చంద్రబాబు తన పదవిని కాపాడుకోవడం కోసం తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు ఎన్డీఆర్‌కు బద్ధశత్రువైన కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకునేందుకు చూస్తున్నారని మండిపడ్డారు. 
 
Back to Top