సుప్రీం కోర్టు తీర్పు టీడీపీకి చెంపపెట్టు

న్యాయస్థానం తీర్పును వెంటనే అమలు చేయాలి
తిప్పేస్వామిని ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేయించాలి
నేరచరిత్ర కలిగిన నాయకుడిని టీడీపీ ఇన్నాళ్లూ కాపాడింది
స్పీకర్‌ అపాయింట్‌మెంట్‌ ఇవ్వకపోవడం విడ్డూరం
విజయవాడ: సుప్రీం కోర్టు తీర్పు తెలుగుదేశం ప్రభుత్వానికి చెంపపెట్టు అని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యేలు ఆదిమూలపు సురేష్, కోన రఘుపతి అన్నారు. వైయస్‌ఆర్‌ సీపీ నేత తిప్పేస్వామి ఆధ్వర్యంలో టీడీపీ ఎమ్మెల్యే ఈరన్నను అనర్హుడిగా ప్రకటించిన సుప్రీం కోర్టు తీర్పు కాపీని అసెంబ్లీ కార్యదర్శికి వారు అందజేశారు. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు తిప్పేస్వామిని ఎమ్మెల్యేగా ప్రకటించాలని అసెంబ్లీ కార్యదర్శిని కోరారు. 
టీడీపీ అసెంబ్లీని మలినం చేసింది: ఆదిమూలపు సురేష్‌
నేర చరిత్ర కలిగిన నేతలను తెలుగుదేశం పార్టీ ఇన్నాళ్లూ కాపాడిందని వైయస్‌ఆర్‌ సీపీ ఎమ్మెల్యే ఆదిమూలపు సురేష్‌ ధ్వజమెత్తారు. నేరస్తుడిని ఎమ్మెల్యేగా తెచ్చి అసెంబ్లీని మలినం చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. స్పీకర్‌ సన్నాయి నొక్కులు నొక్కుతూ కాలయాపన చేస్తున్నాడన్నారు. స్పీకర్‌ అపాయింట్‌మెంట్‌ కోరితే మంగళవారం వరకు ఖాళీ లేదంటున్నారని, కోర్టు తీర్పును గౌరవించాల్సిన బాధ్యత స్పీకర్, చంద్రబాబుకు లేదా అని ప్రశ్నించారు. 24 గంటల్లో కోర్టు తీర్పును అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. 
తెలంగాణ ఎన్నికలే టీడీపీ పతనానికి నాంది: కోన రఘుపతి
సుప్రీం కోర్టు తీర్పును గౌరవించి తిప్పేస్వామిని ఎమ్మెల్యేగా ప్రమాణం చేయించాలని ఎమ్మెల్యే కోన రఘుపతి డిమాండ్‌ చేశారు. రాజ్యాంగాన్ని అపహాస్యం చేసేలా స్పీకర్‌ కోడెల వ్యవహరిస్తున్నాడని ధ్వజమెత్తారు. 23 మంది ఎమ్మెల్యేలను సంతలో పశువులను కొన్నట్లు కొన్నారని మండిపడ్డారు. మూడు రాష్ట్రాల్లో కాంగ్రెస్‌ గెలుపునకు చంద్రబాబు అవినీతి డబ్బే కారణమని, ఒక్క తెలంగాణకే కాదు.. అన్ని రాష్ట్రాలకు చంద్రబాబు అవినీతి డబ్బును పంపించారన్నారు. చంద్రబాబు జిమ్మిక్కులు చెల్లవని తేలిపోయిందన్నారు. తెలుగుదేశం పార్టీ పతనానికి తెలంగాణ ఎన్నికల ఫలితాలే నాంది అన్నారు. 
 

తాజా వీడియోలు

Back to Top