ఢిల్లీ గద్దెపై ఎవరుండేదీ మేం నిర్ణయిస్తాం

హైదరాబాద్:

ఢిల్లీ గద్దెపై ఎవరు కూర్చోవాలో తామే నిర్ణయిస్తామని వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ పేర్కొంది. రాష్ట్రాన్ని అడ్డగోలుగా, అప్రజాస్వామికంగా ముక్కలు చేసిన కాంగ్రెస్‌ పార్టీకి మద్దతిచ్చే ప్రసక్తే లేదని మరోమారు సుస్పష్టంగా ప్రకటించింది. ఇందులో ఎలాంటి సందేహాలకు తావులేదని పేర్కొంది. ముందుగా తమ పార్టీ 25 ఎంపీలను గెలుచుకుంటామని, రాష్ట్ర ప్రయోజనాలను పరిరక్షించే పార్టీకే మద్దతునిస్తామని తెలిపింది. ‌'కేంద్ర ప్రభుత్వం ఏర్పాటులో వైయస్ఆర్ కాంగ్రె‌స్ పార్టీ ఎవరికి మద్దతు ఇస్తుంది, అందుకు ప్రాతిపదిక ఏమిట'నే అంశాలపై ఒక విభాగం ఆంగ్ల మీడియాలో వచ్చిన కథనాలు సత్యదూరమని పార్టీ శుక్రవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొంది.

పులివెందులలో ఓటు వేసిన అనంతరం మీడియా సమావేశంలో తాను చెప్పిన మాటలను ఒక వర్గం ఆంగ్ల పత్రికలలో వక్రీకరించి ప్రచురించడంపై పార్టీ అధినేత శ్రీ వైయస్‌ జగన్మోహన్‌రెడ్డి తీవ్ర విచారం వ్యక్తం చేసినట్లు ప్రకటన పేర్కొంది. కేంద్రంలో వైయస్ఆర్‌సీపీ ఎవరికి మద్దతిస్తుందనే విషయం శ్రీ జగన్‌ చాలా స్పష్టంగా చెప్పినప్పటికీ ఆ పత్రికలు తమ నిజాన్ని తప్పుదారి పట్టిస్తూ.. ఊహాగానాలను ప్రచురించాయని తీవ్రంగా ఖండించింది. రాష్ట్రంలో 25 ఎంపీ స్థానాలను గెలుచుకుంటామని కేంద్రంలో ఏ ప్రభుత్వం ఏర్పడాలనే విషయంలో వైయస్ఆర్‌సీపీ కీలక పాత్ర వహిస్తుందని శ్రీ జగన్‌ చెప్పారని పేర్కొంది. అంతే కానీ చంద్రబాబు నాయుడిలా ఢిల్లీకి దాసోహం అనబోమని, తెలుగువారి ఆత్మగౌరవం మరింతగా పెరిగేలా వ్యవహరిస్తామని కచ్చితంగా ఆయన అన్నారని వివరించింది. మోడీ కోసం ఓట్లు వేయమని చంద్రబాబు ప్రజలను అర్థిస్తే..‌ తెలుగువారి ఆత్మగౌరవం కోసం ఓట్లేయమని వైయస్ఆర్‌సీపీ అధినేత అడిగారని ప్రకటన స్పష్టం చేసింది.

పార్టీ ప్రకటనలోని ముఖ్యాంశాలివీ :
- వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 25 ఎంపీ సీట్లు వస్తే ఢిల్లీలో పైచేయి సాధించి కొత్త ప్రభుత్వం ఏర్పాటులో కీలక పాత్ర పోషించవచ్చునని, రాష్ట్రాభివృద్ధికి అవసరమైనవి పట్టుబట్టి సాధించుకోవచ్చని మా పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్‌ జగన్మోహన్‌రెడ్డి అనేక సార్లు ప్రచార సభల్లో చెబుతూ వచ్చారు. చంద్రబాబులా ఢిల్లీలో సాగిలపడిపోం, తెలుగువారి ఆత్మగౌరవాన్ని నిలబెట్టే విధంగా వ్యవహరిస్తామని పోలింగ్ ముగిసిన తరువాత పులివెందులలో జరిగిన పత్రికా సమావేశంలోనూ‌ ఆమర విస్పష్టంగా ప్రకటించారు.
- చంద్రబాబు రాష్ట్రంలో మోడీని చూపి ఓట్లు అడగ్గా శ్రీ జగన్మోహన్‌రెడ్డి తెలుగువారి ఆత్మగౌరవాన్ని కాపాడతామంటూ ప్రజా మద్దతు కోరిన విషయం అందరికీ తెలుసు. ఈ అంశాలను పట్టించుకోకుండా ఆంగ్ల మీడియా కేంద్రంలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎవరికి మద్దతు ఇస్తుందనే అంశంపై తోచిన రీతిలో కల్పితాలతో కథనాలు ఇవ్వడం సమంజసం కాదు.

-‌ రాష్ట్రాన్ని అప్రజాస్వామికంగా, అసంబద్ధంగా, అన్యాయంగా విభజించిన కాంగ్రెస్ పార్టీకి కేంద్రంలో మద్దతు ఇచ్చే ప్రసక్తే లేదు. 25 ఎంపీ సీట్లు గెలిచిన తర్వాత రాష్ట్ర అభివృద్ధి ప్రాతిపదికగా మా మద్దతు మోడీకా, ‌ఎల్లయ్యకా, పుల్లయ్యకా అనే అంశంలో నిర్ణయం తీసుకుంటామని శ్రీ జగన్మోహన్‌రెడ్డి పలుమార్లు విస్పష్టంగా ప్రకటించారు. దీనికి విరుద్ధంగా ప్రజల్లో భయాందోళనలు, సందిగ్ధతను సృష్టిం చేందుకు పార్టీ వైఖరిని వక్రీకరిస్తూ కొన్ని ఆంగ్ల పత్రికలు కథనాలు ప్రచురిస్తున్నాయి. ఇప్పటికైనా వాస్తవాలు తెలుసుకుని ప్రచురించాలి అని పార్టీ పత్రికా ప్రకటనలో పేర్కొంది.

Back to Top