సమైక్య ఉద్యమాన్ని‌ తాకట్టు పెట్టిన కిరణ్

హైదరాబాద్ :

సీఎం పదవిని కాపాడుకోవడానికి కిరణ్‌ కుమార్‌ రెడ్డి సమైక్య ఉద్యమాన్ని తాకట్టు పెట్టారని వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకులు శోభా నాగిరెడ్డి, జ్యోతుల నెహ్రూ, గట్టు రామచంద్రరావు, వాసిరెడ్డి పద్మ ఆగ్రహం వ్యక్తంచేశారు. అలాంటి కిరణ్‌కుమార్‌రెడ్డికి వైయస్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ‌ని విమర్శించే నైతిక హక్కు లేదని వారు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. విజయవాడ సభలో సీఎం కిరణ్ మాట్లాడిన అంశాలపై పార్టీ నాయకులు తీవ్రస్థాయిలో స్పందించారు. వారంతా శనివారం హైదరాబాద్‌లో విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని ఉద్యోగులు చేపట్టిన సమ్మెను కిరణ్ మోసపూరితంగా నిర్వీర్యం చేశారని ‌నిప్పులు చెరిగారు.

రాష్ట్రాన్ని విభజించాలని కాంగ్రెస్ అధిష్టానం గడిచిన నాలుగు నెలలుగా కుట్రలు చేస్తుంటే ‌ఇంత కాలంగా కిరణ్ సీఎం కుర్చీని పట్టుకుని వేలాడుతూ, ఇప్పుడేమో మరెవరినో కూర్చోబెట్టమంటూ ఉత్తరకుమార ప్రగల్భాలు పలకడం ఆశ్చర్యకరంగా ఉందన్నారు. అసలు సమైక్యాంధ్ర అన్న మాటే వినపడకూడదనే దుర్మార్గమైన ఆలోచనతో కాంగ్రెస్, టీడీపీలు కలిసి కుట్రలు చేస్తున్నాయని వారు దుయ్యబట్టారు. సమైక్యం కోసం కిర‌ణ్ చేసిందేమిటని వారు సూటిగా ప్రశ్నించారు. రాజ్యాంగ సంక్షోభం సృష్టిద్దామంటే ముందు‌కు రాలేదు సరికదా... కనీసం అసెంబ్లీలో సమైక్య తీర్మానం చేయాలని తాము ఎంతగా విజ్ఞప్తి చేసినా కిరణ్ పట్టించుకోలేదన్నారు.

అందుకే వైయస్ఆర్‌సీపీపై బురద చల్లుతున్నారు:
‌రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలన్న ఏకైక లక్ష్యంతో వైయస్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ అధినేత‌ శ్రీ వైయస్ జగన్మోహన్‌రెడ్డి దేశవ్యాప్తంగా అన్ని పార్టీల మద్దతు కూడగడుతున్నారని, రేపటి రోజున పార్లమెంటులో వారంతా ప్రశ్నిస్తారనే ఆలోచనతోనే సోనియాగాంధీ ఆదేశాల మేరకు కిరణ్, చంద్రబాబు ఇద్దరూ కలిసి తమ పార్టీపై బురదజల్లే కార్యక్రమం పెట్టుకున్నారని వైయస్ఆర్‌ సీపీ నేతలు విమర్శించారు. సమైక్యం కోసం ఆయా జాతీయ, ప్రాంతీయ పార్టీల మద్దతు కూడగడుతూ శ్రీ జగన్ చేస్తున్న ప్రయత్నాలను రాష్ట్ర ప్రజలే కాకుండా బయటి రాష్ట్రాల నేతలు కూడా ప్రశంసిస్తుంటే ఓర్వలేక రహస్య‌ మిత్రులైన కిరణ్, చంద్రబాబు ఒకే మాటగా తమపై ఆరోపణలు చేస్తున్నారన్నారు.

నిజంగా సమైక్యం కోరుకునేవారే అయితే రాష్ట్రాన్ని విభజించాలని సీడబ్ల్యూసీ ప్రకటన రావడానికి ముందు ఏం చేశారని నిలదీశారు? నిర్ణయం వెల్లడించిన తర్వాత ఏంచేశారన్నారు? జూలై 30 సీడబ్ల్యూసీ విభజనపై నిర్ణయం తీసుకున్న నాలుగు నెలలకు ఇప్పుడు శ్రీ జగన్‌పై ఆరోపణలు చేయడమేమిటని ప్రశ్నించారు. తాజాగా ప్రసారమవుతున్న నీల్సన్ సర్వే ఫలితాల్లో సీమాంధ్రలో కాంగ్రె‌స్‌కు సింగిల్ డిజి‌ట్‌కే పరిమితమయ్యే అవకాశముందని తేలడంతో ఇప్పుడు ఆ పార్టీ నుంచి బయటకు రావడం కోసం కిరణ్ తమపై విమర్శలు చేస్తున్నారని వారు ధ్వజమెత్తారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top