కేంద్రం హామీ ఇస్తేనే దీక్ష విరమించారా ?


వైయ‌స్ఆర్ జిల్లా  : సీఎం రమేష్‌ నాయుడు చేసిన ఆమరణ నిరాహార దీక్ష ఓ డ్రామా అని వైయ‌స్ఆర్‌సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి నిమ్మకాయల సుధాకర్‌రెడ్డి విమర్శించారు. కడపలో ఉక్కు ఫ్యాక్టరీని ఇవ్వాల్సింది కేంద్ర ప్రభుత్వమని, కేంద్రం హామీ ఇస్తేనే దీక్ష విరమించారా అని ప్రశ్నించారు.  స్థానిక ప్రెస్‌క్లబ్‌లో ఆయన మాట్లాడుతూ కథ, స్క్రీన్‌ప్లే, డైరెక్షన్‌లో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, అధికార యంత్రాంగం కనుసన్నుల్లో 10 రోజుల పాటు సీఎం రమేష్‌ నాయుడు ఆమరణ నిరాహార దీక్ష కొనసాగిందని తెలిపారు. సీఎం చంద్రబాబు నిమ్మరసం ఇవ్వడంతో డ్రామా దీక్ష ముగిసిందన్నారు. రమేష్‌ నాయుడు ఈ దీక్ష  ఎవరిపైన చేశారో.. ఎందుకు విరమించారో ప్రజలకు చెప్పాలని డిమాండ్‌ చేశారు. సీఎం ఉక్కు ఫ్యాక్టరీ కట్టదల్చుకుంటే కేంద్రంపై పోరాటం ఎందుకని ప్రశ్నించారు. రమేష్‌ నాయుడు వ్యాపార వేత్తగా, బడా కాంట్రాక్టర్‌గా మాత్రమే జిల్లా ప్రజలకు తెలుసునని పేర్కొన్నారు. రమేష్‌నాయుడు సీఎం బినామి, పవర్‌ బ్రోకర్‌ అని ప్రజలు తెలుసుకోవాలన్నారు. ప్రజాప్రతినిధిగా జిల్లా వాసులు ఆయనను గుర్తించలేదని తెలిపారు. టీడీపీ అధికారంలో లేని రోజుల్లో జిల్లాలో ఎప్పుడూ కనిపించలేదన్నారు. ప్రత్యేకహోదా, ఉక్కు ఫ్యాక్టరీ రావాలంటే వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డితోనే సాధ్యమవుతుందని ప్రజలు నమ్ముతున్నారని ఆయన పేర్కొన్నారు.  


 
Back to Top