బాబూ..ఇకనైనా చిల్లర రాజకీయాలు మానుకో

చంద్రబాబు ఆర్థిక, సామాజిక, రాజకీయ నేరగాడు
చరిత్రహీనుడిగా మిగిలిపోతాడని చంద్రబాబు యూటర్న్‌ 
బాబు అవినీతి దేశానికి దేశ ప్రతిష్టకు మచ్చ
అక్రమ కేసుల్లోంచి వైయస్‌ జగన్‌ కడిగిన ముత్యంలా వస్తారు
స్టేలతో చేసిన తప్పుల నుంచి తప్పించుకునేది చంద్రబాబు
ప్రజాస్వామ్యానికి తూట్లు పొడిచిన దుర్మార్గుడు 
రోజులు దగ్గరపడ్డాయని తెలిసి హైదరాబాద్‌లో ఇల్లు కట్టుకున్నాడు
బలహీనవర్గాల నేతలు టీడీపీకి కనిపించరా?
విజయవాడ: నాలుగేళ్లుగా రాష్ట్ర ప్రజలను మోసం చేస్తున్న చంద్రబాబు ఇప్పటికైనా చిల్లర రాజకీయాలు మానుకోవాలని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి, మాజీ మంత్రి కొలుసు పార్థసారధి సూచించారు. చంద్రబాబు లాంటి ఆర్థిక, సామాజిక, రాజకీయ నేరగాడిని ఇప్పటి వరకు చూడలేదన్నారు. నాలుగేళ్లుగా రాష్ట్రానికి అన్యాయం చేసిన వ్యక్తే ఇప్పుడు న్యాయం.. న్యాయం అంటూ మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. చరిత్రహీనుడిగా మిగిలిపోతాననే భయంతో చంద్రబాబు యూటర్న్‌ తీసుకున్నాడన్నారు. విజయవాడ వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో పార్థసారధి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చంద్రబాబు దొంగతనం, మోసం బయటపడినప్పుడే ఉక్రోశంతో ఊగిపోతూ మాట్లాడుతుంటాడన్నారు. చంద్రబాబు అవినీతిని వైయస్‌ఆర్‌ సీపీ అధినేత, ప్రతిపక్షనేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చెప్పిన మాటలన్నీ వాస్తవాలని ప్రజలు నమ్ముతున్న తరుణంలో బాబు తన అనుకూల మీడియాతో పొగిడించుకుంటున్నాడన్నారు. దొంగతనం బయటపడడంతో ఉక్రోశంగా మాట్లాడుతున్నాడన్నారు. 

బాబును కొడుకు.. కొడుకును బాబు పొగుడుకుంటూ రూ. కోట్లు ఖర్చు చేసి నిర్వహించే అసెంబ్లీ సమయాన్ని వృథా చేస్తున్నారని పార్థసారధి ధ్వజమెత్తారు. చంద్రబాబు ఒక్కడే రాజకీయాల్లోకి వచ్చి 40 ఏళ్లు దాటిన ఘనమైన కార్యక్రమం చెప్పుకుంటున్నారని, బలహీనవర్గానికి చెందిన నాయకుడు కేఈ కృష్ణమూర్తి 1978లో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారన్నారు. టీడీపీకి బలహీనవర్గాల నేతలు కనిపించరా.. అని ప్రశ్నించారు. బుచ్చయ్యచౌదరి, కేఈ కృష్ణమూర్తి, అశోక్‌గజపతిరాజు వంటి నేతలు సీనియర్లని చెప్పారు. 

ప్రతిపక్షనేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని ఆడిపోసుకోవడమే పనిగా ఏపీ అసెంబ్లీ, టీడీపీ విధానం కొనసాగుతుందని పార్థసారధి మండిపడ్డారు. న్యాయసూత్రాల ప్రకారం ఎక్యూసుడు అంటే నేరగాడు కాదని, నేరారోపణ చేయబడిన వ్యక్తి.. ఇది కూడా తెలియదా చంద్రబాబూ అని ప్రశ్నించారు. కాంగ్రెస్, టీడీపీ కుట్రపన్ని పెట్టిన కేసుల్లో నుంచి వైయస్‌ జగన్‌ కడిగిన ముత్యంలా బయటకు వస్తారన్నారు. న్యాయస్థానాలపై వైయస్‌ఆర్‌ సీపీకి గౌరవం ఉంది కాబట్టే చంద్రబాబులా స్టేలతో తప్పించుకోవడం లేదన్నారు.  

చట్టాన్ని ఖూనీ చేసిన వ్యక్తి.. ప్రజాస్వామ్యానికి తూట్లు పొడిచిన దుర్మార్గుడు చంద్రబాబు అని పార్థసారధి విమర్శించారు. ఇతర పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలను సంతలో పశువుల్లా తీసుకోవడమే కాకుండా నిర్లజ్జగా నాకు రాజ్యాంగం వర్తించదు అన్నట్లుగా నలుగురికి మంత్రి పదవులు కట్టబెట్టాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి రాజకీయ నేరగాడితో ఎలా భాగస్వామ్యం పెట్టుకున్నారో ప్రధాని మోడీ సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. వ్యవస్థలను భ్రష్టుపట్టించి నేరాలను వ్యవస్థీకృతం చేసిన చంద్రబాబు లాంటి దొంగల మూలంగా దేశ ప్రతిష్టకే చేటన్నారు. గతంలో తొమ్మిదేళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కూడా చంద్రబాబు దోపిడీని వ్యవస్థీకృతం చేసి రాష్ట్ర సంపదను పెట్టుబడిదారులకు కట్టబెట్టాడని విరుచుకుపడ్డారు. నాలుగేళ్లుగా ఇసుక, మట్టి, రాజధాని భూములు, కాంట్రాక్టులు, ఎ్రర చందనం అన్నింటినీ దోచుకుంటూ ఏపీని అవినీతిలో నంబర్‌గా నిలిచాడన్నారు. 


దళితుల్లో పుట్టాలని ఎవరైనా అనుకుంటారా అని ఎస్సీలను కించపరిచేలా మాట్లాడిన చంద్రబాబు దళిత తేజం కార్యక్రమం చేసే అర్హత ఉందా అని ప్రశ్నించారు. దళితుల పేరు ఎత్తే హక్కు కూడా టీడీపీకి లేదన్నారు. భూకబ్జాలకు అడ్డు వస్తుందని దళిత మహిళను వివస్త్రను చేసి టీడీపీ నేతలు దాడి చేశారన్నారు. అదే విధంగా స్వాతంత్ర సమరయోధుల కుటుంబాలకు దేశ ప్రభుత్వం ఇచ్చిన భూములను కూడా కొట్టేయాలని చూస్తున్నారని... నీకంటే పెద్ద నేరగాడు ఇంకెవరున్నారు చంద్రబాబూ అని నిలదీశారు. 

ప్రత్యేక హోదాపై రోజుకో రంగు మార్చుతూ రాజకీయ నాయకులంటే ఇంత వెధవలా అని ప్రజలు ముక్కున వేలేసుకునేలా చంద్రబాబు ప్రవర్తన ఉందని పార్థసారధి ఆరోపించారు. మొదట్లో అవిశ్వాస తీర్మానం వల్ల ఒరిగేదేమిటీ.. రాజీనామాలు చేస్తే వచ్చేదేమిటీ అని చంద్రబాబు ప్రశ్నించారన్నారు. అసెంబ్లీ సాక్షిగా వైయస్‌ఆర్‌ తీర్మానానికి ముద్దతు ఇస్తున్నామని చెప్పి ఉదయానికి మళ్లీ మార్చడన్నారు. ‘మాకు రాష్ట్ర ప్రయోజనాల ముఖ్యం.. అవిశ్వాసం మీరు పెట్టినా మద్దతు ఇస్తా’మని ప్రతిపక్షనేత వైయస్‌ జగన్‌ ప్రకటించారని గుర్తు చేశారు. 29సార్లు ఢిల్లీ వెళ్లివచ్చిన చంద్రబాబుకు ఏపీకి మోసం జరుగుతుందని అర్థం కాలేదా అని ప్రశ్నించారు. కనీసం హోదా కోసం పోరాటం చేయాలని ప్రతిపక్షాలను పిలిచి చర్చించావా అని నిలదీశారు. ఇసుక, రాజధానిలో భూదోపిడీకి 10 సార్లు కేబినెట్‌ మీటింగ్‌లు పెట్టారు కానీ.. ప్రత్యేక హోదా కోసం ఒక్కసారైనా మంత్రులతో చర్చించావా చంద్రబాబూ అని విరుచుకుపడ్డారు. హోదా కలిగిన రాష్ట్రాలకు పది సంవత్సరాలు హోదా పొడిగిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంటే మాకెందుకు ఇవ్వడం లేదని నిలదీశావా అని ప్రశ్నించారు. చంద్రబాబుకు రోజులు దగ్గరపడ్డాయని ముందే గ్రహించి హైదరాబాద్‌లో ఇల్లు కట్టుకున్నాడని, మిగిలిన రోజుల్లోనైనా ఏపీకి అన్యాయం చేయకుండా చిత్తశుద్ధితో పోరాటం చేయాలన్నారు. 
పోరాటానికి మద్దతుగా ప్రజా సంకల్ప మానవహారం
ఢిల్లీలో వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సభ్యుల పోరాటానికి మద్దతుగా రాష్ట్ర ప్రజల బాధలను కేంద్రానికి తెలిసే విధంగా సోమవారం ప్రజా సంకల్ప మానవహారం కార్యక్రమం చేపట్టనున్నట్లు పార్థసారధి వివరించారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన కోరారు. 175 నియోజకవర్గాల్లో 19వ తేదీన ప్రజా సంకల్ప మానవహారం కార్యక్రమం చేపట్టనున్నట్లు వివరించారు. 
 
Back to Top