హక్కుల కోసం గళమెత్తితే చంపేస్తారా?

గుంటూరు: హక్కుల కోసం న్యాయంగా గళమెత్తిన ముస్లింలను చంపేస్తామంటూ ప్రభుత్వం బెదిరింపులకు దిగుతుందని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి కొలుసు పార్ధసారథి ధ్వజమెత్తారు. టీడీపీ ముస్లింలతో నిర్వహించిన సమ్మేళనంలో తమ సమస్యలు పరిష్కరించాలని కోరిన నంద్యాల ముస్లిం యువకులను అక్రమంగా నిర్భందించి వివిధ ప్రాంతాల పోలీస్‌స్టేషన్లకు తిప్పుతూ వారిపై దాడి చేయడం ఎంత వరకు సమంజసం అని ప్రశ్నించారు. సంబంధం లేని సెక్షన్‌లు విధించి యువకులను చిత్రహింసలకు గురిచేశారని మండిపడ్డారు. ఇదంతా చంద్రబాబు కనుసన్నల్లోనే జరిగిందన్నారు. నాలుగు సంవత్సరాలు బీజేపీతో అంటకాగిన చంద్రబాబు ఒళ్లంతా అదే భావజాలంతో పని చేస్తున్నారన్నారు. ముస్లిం మైనార్టీలు, దళితుల వ్యతిరేక పరిపాలన సాగిస్తున్నాడన్నారు. దళితులు, ముస్లింలపై దాడులకు తెగబడుతున్న చంద్రబాబుకు ముఖ్యమంత్రిగా కొనసాగే అర్హత ఉందా..? రాష్ట్రంలోని మేధావులంతా ఆలోచించాలన్నారు. 
బలహీనవర్గాలపై వివక్ష
రాగద్వేషాలకు అతీతంగా పనిచేస్తానని ప్రమాణస్వీకారం చేసి అందుకు విరుద్ధంగా చంద్రబాబు పాలన కొనసాగుతుందని పార్ధసారథి మండిపడ్డారు. ముస్లింలు, బలహీనవర్గాల పట్ల వివక్ష చూపుతూ వారిని అణచివేసే ధోరణితో పాలన చేస్తున్నాడన్నారు. ముస్లింలను, పేద వర్గాలను ఏ విధంగా అవమాన పరుస్తున్నారో స్పష్టం అయ్యిందన్నారు. చంద్రబాబు ముస్లిం వ్యతిరేకి అని, వైయస్‌ జగన్‌తోనే అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుందన్నారు. 
Back to Top