దీక్షల పేరుతో ప్రజాధనం వృథా


మొక్కుబడిగా నవ నిర్మాణ దీక్షలు 
అవినీతి రహిత పాలన అందిస్తామనడం హాస్యాస్పదం
చంద్రబాబు ఇంటి కార్యక్రమంలా గ్రామ సందర్శన
అవినీతి కోసమే సుజయకృష్ణ పార్టీ మారాడు
త్వరలో అగ్రిగోల్డ్‌ బాధితుల పక్షాన రాష్ట్రవ్యాప్త ఉద్యమం
విజయనగరం: నవ నిర్మాణ దీక్షల పేరుతో కోట్ల రూపాయల ప్రజాధనాన్ని చంద్రబాబు దుర్వినియోగం చేస్తున్నారని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకులు మజ్జి శ్రీనివాసరావు మండిపడ్డారు. పరిపాలనలో ఘోరంగా విఫలమైన చంద్రబాబు నవ నిర్మాణ దీక్షలను చేపట్టడంలో కూడా పూర్తిగా విఫలమయ్యారని ఆరోపించారు. నవ నిర్మాణ దీక్షల్లో ఎక్కడా ప్రజల భాగస్వామ్యం లేదన్నారు. అధికారుల చేత నిర్బంధంగా కార్యక్రమాలను మొక్కుబడి తంతుగా నడుపుతున్నారన్నారు. విజయనగరం జిల్లా వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో మజ్జి శ్రీనివాసరావు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నవ నిర్మాణ దీక్షల్లో చంద్రబాబు వ్యాఖ్యలు విని ప్రజలంతా నవ్వుతున్నారన్నారు. 
 మీరు చెప్పే అంశాల్లో ప్రజలు నమ్మకం లేదు అని వైయస్‌ఆర్‌ సీపీ మొదటి నుంచి చెబుతుంది. 
దీక్షల్లో తెలుగుదేశం పార్టీ నాయకులు మాత్రమే మొక్కుబడిగా పాల్గొంటున్నారన్నారు.  జిల్లాకు కోటి రూపాయలు విడుదల చేసి ప్రజల సొమ్మును చంద్రబాబు తన పబ్లిసిటీ కోసం ఉపయోగించుకుంటున్నాడని మండిపడ్డారు.

తెలుగుదేశం ప్రభుత్వ గ్రామ సందర్శన కార్యక్రమం చంద్రబాబు ఇంటి కార్యక్రమంలా సాగిందని శ్రీనివాసరావు ధ్వజమెత్తారు. గతంలో దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి రచ్చబండ కార్యక్రమం చేపట్టి ప్రజలందరినీ భాగస్వాములను చేసి వారి సమస్యలను మీడియా సమక్షంలో విని సత్వర పరిష్కారం చూపేవారని గుర్తు చేశారు. విజయనగరం జిల్లాలో నిర్వహించిన నవ నిర్మాణ దీక్షలో జిల్లాకు చెందిన మంత్రి సుజయకృష్ణరంగారావు, జిల్లా ఇన్‌చార్జి మంత్రి గంటా శ్రీనివాసరావులు పాల్గొని అవినీతి రహిత సమాజం నిర్మిస్తామని చెప్పడంతో ప్రజలంతా నవ్వుతున్నారన్నారు. గంటా విశాఖ భూకబ్జాల్లో ప్రధాన వ్యక్తిగా ఆరోపణలు ఉన్నాయని, అదే విధంగా సుజయకృష్ణరంగారావు తన అవినీతికి బ్రాండ్‌ అంబాసిడర్‌గా తయారయ్యాడని జిల్లా ప్రజలే అంటున్నారన్నారు. అవినీతి కోసమే పార్టీ మారిన సుజయ కృష్ణ రంగారావు, అవినీతిలో ఆరితేరిన గంటా ఇద్దరు వచ్చి అవినీతి రహిత పాలన అందిస్తున్నామంటే ప్రజలు ఆశ్చర్యపోతున్నారన్నారు. 

నాలుగు సంవత్సరాలుగా పరిపాలన గురించి ప్రస్తావించకుండా తన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి చంద్రబాబు ప్రతిపక్షనేత వైయస్‌ జగన్‌ఫై ఆరోపణలు చేయడం సమంజసం కాదన్నారు. వైయస్‌ జగన్‌పై టీడీపీ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. అదే విధంగా ప్రజాధనం దుర్వినియోగం చేస్తూ చేపట్టిన దీక్షలను కూడా కూడా ఖండిస్తున్నామన్నారు. అగ్రిగోల్డ్‌ బాధితులను ఆదుకోవాలని వైయస్‌ జగన్‌ అనేక సందర్భాల్లో ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చారని గుర్తు చేశారు. అసెంబ్లీలో రూ. 11 వందల కోట్లు ఇస్తే 80 శాంతి మంది బాధితులు సమస్యల నుంచి బయటపడతారని చెప్పారన్నారు. అయినా ప్రభుత్వం పట్టించుకోకుండా అగ్రిగోల్డ్‌ ఆస్తులు కాజేసేందుకు కుట్రలు చేస్తుందన్నారు. విజయవాడలో వైయస్‌ఆర్‌ సీపీ అగ్రిగోల్డ్‌ బాసట కమిటీ ఆధ్వర్యంలో బాధితులతో సమావేశం జరిగిందని, సమావేశంలో అనేక విషయాలపై చర్చించామన్నారు. త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా నేతలతో చర్చించి ఉద్యమాన్ని ఉధృతం చేస్తామన్నారు. 
 
Back to Top