నయవంచనపై పోరాటం ఆగదు

30న అనంతపురం వేదికగా వంచనపై గర్జన
నీతిఆయోగ్‌ సమావేశంలో ఏయే అంశాలను ప్రస్తావించారో సమాధానం చెప్పాలి
సమావేశానికి ముందు పచ్చమీడియాలో గొప్పలు
బీజేపీతో చంద్రబాబు లాలూచీ ఇంకా సాగుతోంది
పరకాల ప్రభాకర్‌ కనీసం స్ట్రింగర్‌గానైనా పనిచేశారా?
పదవికాలం ముగుస్తుందనగా రాజీనామా చేసి ప్రతిపక్షనేతపై నిందలా?
బలహీనవర్గాలను కించపరిచేలా చంద్రబాబు వ్యాఖ్యలు
అన్నింటిపై చంద్రబాబు వివరణ ఇవ్వాలి

విశాఖపట్నం: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆంధ్రప్రదేశ్‌కు చేసిన అన్యాయాలపై పోరాటం కొనసాగుతూనే ఉంటుందని, ప్రభుత్వాలు మెడలు వంచి ప్రత్యేక హోదా, విభజన చట్టంలోని అంశాలను సాధించుకుంటామని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత బొత్స సత్యనారాయణ అన్నారు. రాష్ట్ర విభజన జరిగి నాలుగేళ్లు పూర్తయ్యింది.. చట్టంలోని అంశాలను నెరవేరుస్తామని అధికారంలోకి వచ్చిన ప్రభుత్వాలు రాష్ట్ర ప్రజలను నిలువునా వంచించాయని బొత్స మండిపడ్డారు. ప్రత్యేక హోదా, విభజన చట్టంలోని అంశాలపై వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వంలో క్షేత్రస్థాయిలో అనేక పోరాటాలు చేశామన్నారు. విశాఖపట్నం వైయస్‌ఆర్‌ సీపీ కార్యాలయంలో బొత్స సత్యనారాయణ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వంచనపై గర్జన పేరుతో ప్రతీ జిల్లాలో దీక్షలు చేయాలని నిర్ణయించామన్నారు. ఈ మేరకు 30వ తేదీన అనంతపురం కేంద్రంగా వంచనపై గర్జన దీక్ష చేపట్టనున్నట్లు చెప్పారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు దీక్ష కొనసాగుతుంది. దీనిలో వైయస్‌ఆర్‌ సీపీ లోక్‌సభ, రాజ్యసభ సభ్యులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ కోఆర్డినేటర్లు, పెద్దలు పాల్గొని నిరసన తెలియజేస్తారన్నారు. 

రాష్ట్రపతి భవన్‌లో జరిగిన నీతిఆయోగ్‌ సమావేశంలో కేంద్రాన్ని ఏయే అంశాలపై చంద్రబాబు నిలదీశారో వివరణ ఇవ్వాలని బొత్స సత్యనారాయణ సీఎంకు సూటి ప్రశ్న వేశారు. సమావేశానికి ముందు చంద్రబాబు తనకు సంబంధించిన పత్రికలు, ఛానళ్లు, మంత్రుల ద్వారా నిలదీస్తారు.. పోరాడుతారని పుంటాలు పుంటాలు కథనాలు, ప్రసారాలు చేయించుకున్న చంద్రబాబు... సమావేశంలో ఏ విధంగా వ్యవహరించారో ప్రజలంతా చూశారన్నారు. ఎక్కడా కేంద్రాన్ని నిలదీయలేదు.. విభజన చట్టం అంశాలు నెరవేర్చాలని నిరసన తెలపలేదు.. ఏరకంగా మళ్లీ ప్రజలను వంచించారో చేశామన్నారు. సమావేశం అనంతరం ప్రెస్‌మీట్‌ పెడతానని, అన్ని విషయాలను వివరిస్తానని చెప్పి బుల్డోజ్‌ చేశారన్నారు. చంద్రబాబు వైఖరిపై ప్రజలు ఆలోచన చేయాలని కోరారు. ఇదే ఆఖరి సమావేశం.. ఎన్నికలు త్వరగా వస్తాయని మీరే లీకులు ఇస్తూ ఢిల్లీకి వెళ్లి ఏం సాధించారన్నారు. కనీసం సమావేశాన్ని బైకాట్‌ చేసి ఉంటే.. రాష్ట్ర సమస్యలు దేశంలోని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు తెలిసేదన్నారు. 

చంద్రబాబు ఇంకా బీజేపీతో లాలూచీ రాజకీయాలు చేస్తున్నారనడానికి ఎలాంటి సందేహం లేదని బొత్స అన్నారు. బీజేపీ కనుసన్నల్లోనే టీడీపీ పాలన ఉందని ఆరోపించారు. కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‌ భర్త పరకాల ప్రభాకర్‌తో చంద్రబాబే రాజీనామా చేయించి ప్రతిపక్ష నేతపై నెపం మోపుతున్నారని మండిపడ్డారు. పరకాల ప్రభాకర్‌ ధర్మపోరాటం చేస్తానని మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. నాలుగేళ్లుగా రాష్ట్ర ప్రయోజనాల కోసం కష్టపడుతున్నానని మాట్లాడడం హాస్యాస్పదమన్నారు. ‘నీ భార్య మొహం చేసి నీకు ఉద్యోగం ఇచ్చారు.. ఏ రంగం ద్వారా ప్రజలకు నువ్వు సేవ చేశావో చెప్పాలని’ పరకాలకు బొత్స సూటి ప్రశ్న వేశారు. మీడియా అడ్వైజర్‌గా చంద్రబాబు పదవి కేటాయించారని, కనీసం పరకాల ప్రభాకర్‌ స్ట్రింగర్‌గానైనా పనిచేశారా అని ప్రశ్నించారు. ఇంకో 15 రోజుల్లో (జూలై4) పదవికాలం ముగుస్తుందనగా రాజీనామా చేసి వైయస్‌ జగన్‌పై ఆరోపణలు చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు పరకాల ప్రభాకర్‌ను అడ్డుపెట్టుకొని ఇన్నాళ్లు తన కార్యక్రమాలు నిర్వహించుకున్నారన్నారు. 

సాగునీరు ప్రాజెక్టులను తాకట్టు పెట్టి చంద్రబాబు అప్పులు చేస్తున్నారని బొత్స ధ్వజమెత్తారు. రాష్ట్రం ఇప్పటికీ రూ. 2 లక్షల కోట్లకుపైగా అప్పుల ఊబీలో కూరుకుపోయిందన్నారు. చంద్రబాబు జల్సాల కోసం, ప్రత్యేక విమానాల్లో శికార్ల కోసం అప్పులు చేస్తూ రాష్ట్ర వనరులను తాకట్టుపెడుతున్నాడని మండిపడ్డారు. రాబోయే తరం వారి నెత్తిన తలసరి ఆదాయం కంటే అప్పులే ఎక్కవ పెట్టే విధంగా ప్రభుత్వం వ్యవహరిస్తుందన్నారు. ఇది ప్రజాస్వామ్యా..? లేక రాచరికమా..? అని బొత్స ప్రశ్నించారు. 

చంద్రబాబుకు బలహీనవర్గాలంటే ఎంత చిన్నచూపో రెండ్రోజుల క్రితం నాయీ బ్రాహ్మణులతో వ్యవహరించిన తీరు కళ్లకు కట్టినట్లు చూపిస్తుందని బొత్స విమర్శించారు. సమస్యలు పరిష్కరించాలని కోరిన నాయీ బ్రాహ్మణులను మీ తాట తీస్తా.. సంగతి చూస్తానంటూ బెదిరింపులకు దిగారన్నారు. గతంలో విశాఖలో కూడా అగ్నికుల క్షత్రియులు వెళితే.. తోలు తీస్తానని కించపరిచేలా మాట్లాడారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన అంశాలను నెరవేర్చాలని అడిగితే బెదిరిస్తారా.. ఇదేనా మీ పాలన అని చంద్రబాబును బొత్స నిలదీశారు. గతంలో ఎస్సీల్లో ఎవరైనా పుట్టాలనుకుంటా అని మాట్లాడి దళితులను అవమానించారన్నారు. కనీసం వేతనం చట్టం అమలు కాదని చెప్పే హక్కు మీకు ఎక్కడుంది చంద్రబాబూ అని విరుచుకుపడ్డారు. దీనిపై తక్షణమే ప్రభుత్వం వివరణ ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. అదే విధంగా నీతిఆయోగ్‌ సమావేశంలో ఏం జరిగిందో.. రాష్ట్ర ప్రయోజనాలపై ఏరకమైన నిర్ణయం తీసుకున్నారో ప్రజలకు వివరించాలన్నారు. 
 
Back to Top