రుణ మాఫీ కోసం భారీ ఆందోళన


హైదరాబాద్, సెప్టెంబర్ 9: ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడంతోపాటు ప్రజా సమస్యల పరిష్కారానికి ఆందోళనలు చేపట్టాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. రైతులు, డ్వాక్రా మహిళలు, చేనేత కార్మికుల రుణాలు మాఫీ చేస్తామంటూ ఎన్నికల మేనిఫెస్టోలో గొప్పగా ప్రచారం చేసుకున్న టీడీపీ...అధికారంలోకి వచ్చిన తరువాత మాట మార్చిందని పార్టీ పేర్కొంది. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీకి అనుగుణంగా షరతులేమీ లేకుండా మొత్తం రుణాలను రద్దు చేయాలని డిమండ్ చేస్తూ వచ్చే నెలలో భారీ ఎత్తున ప్రజాందోళనలు చేపట్టాలని నిర్ణయించింది.

ఈ నిర్ణయం మేరకు వచ్చే నెలలో మొదట మండల కార్యాలయాల ముందు పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఆ తర్వాతి దశలో జిల్లా కలెక్టర్ కార్యాలయాల ఎదుట భారీ ఎత్తున ఆందోళనకు దిగుతారు. ప్రభుతం అప్పటికీ దిగిరాకపోతే పార్టీ అధ్యక్షుడు శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్వయంగా ఏదో ఒక జిల్లాలో ఆందోళనకు నాయకత్వం వహిస్తూ ప్రత్యక్ష కార్యాచరణకు దిగుతారు. ఈ మేరకు త్వరలోనే ఆందోళన తేదీలను ఖరారు చేస్తారు.

మంగళవారం పార్టీ అధ్యక్షుడు వైఎస్ శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన ఆయన క్యాంపు కార్యాలయంలో పార్టీ రాష్ట్ర కమిటీ విస్తృత సమావేశం జరిగింది. పార్టీ గౌరవాధ్యక్షురాలు శ్రీమతి వైఎస్ విజయమ్మ, ముఖ్య నేతలు ఎంవీ మైసూరా రెడ్డి, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, రాజకీయ కార్యదర్శులు వైవీ సుబ్బారెడ్డి, సజ్జల రామకృష్ణా రెడ్డితో సహా పలువురు ముఖ్య నేతలు సమావేశంలో పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలు, వాటి అమలుకు వచ్చే సరికి మాట తప్పడంపై సమావేశంలో ప్రధానంగా చర్చ జరిగింది. రుణాల మాఫీపై ఇచ్చిన హామీని నెరవేర్చడంలో టీడీపీ ఘోరంగా విఫలమైందని పార్టీ విమర్శించింది.

ప్రజా సమస్యలపై నిరంతర పోరాటలు చేయాలని నిర్ణయించింది. జిల్లా స్థాయి నుంచి బూత్ స్థాయి వరకు పార్టీని పటిష్టం చేయాలని కూడా నిర్ణయించింది. ఇందుకు సంబంధించిన కార్యాచరణను శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమావేశంలో వివరించారు. సమావేశం ముగిసిన అనంతరం అందులో తీసుకున్న నిర్ణయాలను పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ, పీఏసీ సభ్యుడు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, వైఎస్సార్సీపీ వలంటీర్ల విభాగం అధ్యక్షుడు చెవిరెడ్డి భాస్కర రెడ్డి మీడియాకు వెల్లడించారు. ఎన్నికల సమయంలో టీడీపీ ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయించడానికి రైతులు, డ్వాక్రా మహిళలు, చేనేత కార్మికుల తరఫున తమ పార్టీ ప్రజాపక్షంగా నిలబడి పోరాడుతుందని వాసిరెడ్డి పద్మ చెప్పారు.

రుణాల మాఫీ హామీని అమలు చేయాలని ప్రతిపక్ష నేత శ్రీ జగన్ మోహన్ రెడ్డి ఇటీవల రాష్ట్ర అసెంబ్లీలో ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీసినా ప్రజయోజనం కనిపించలేన్నారు. దున్నపోతుపై వర్షం కురిసినట్లుగా ప్రభుత్వం వ్యవహరిస్తోందని దుయ్యబట్టారు. బడ్జెట్లో కేవలం 5000 కోట్ల రూపాయలు కేటాయించిన ప్రభుత్వం రుణాల మాఫీని ఎలా చేస్తుందని ప్రశ్నించినా ప్రభుత్వం నుంచి సమాధాన రాలేదని అన్నారు. మండల, జిల్లా స్థాయిలో తాము చేపట్టబోయే ఆందోళనను చూసైనా టీడీపీ ప్రభుత్వం దిగి వచ్చి రుణాలన్నింటినీ మాఫీ చేస్తుందని ఆశిస్తున్నామని చెప్పారు. అప్పటికీ ప్రభుత్వంలో చలనం లేకపోతే శ్రీ జగన్ మోహన్ రెడ్డి స్వయంగా ఆందోళనకు స్వీకారం చుడతారని తెలిపారు.

Back to Top