మాయావితో యుద్ధానికి సిద్ధంకండి

అవసరమైన శక్తియుక్తులను కూడగట్టండి
వైయస్‌ఆర్‌ ఆశయ సాధనే వైయస్‌ఆర్‌ సీపీ లక్ష్యం
బాబు చేతిలో దోపిడీకి గురైన వారంతా కలిసికట్టుగా ముందుకురావాలి
ఆచరణకు సాధ్యం కాని హామీలివ్వడం మాకు తెలియదు
వందల హామీలిచ్చిన చంద్రబాబు ఒక్క హామీనైనా నెరవేర్చాడా?
ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చేందుకు మైనార్టీ నేతలు కృషి చేయాలి
విజయవాడ: మాయావి చంద్రబాబుతో యుద్ధానికి అవసరమైన శక్తియుక్తులను కూడగట్టుకొని సిద్ధంగా ఉండాలని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రాజకీయ వ్యవహారాల కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి మైనార్టీలకు సూచించారు. విజయవాడ వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో పార్టీ మైనార్టీ సెల్‌ కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి సజ్జల రామకృష్ణారెడ్డితో పాటు ఎమ్మెల్యే ముస్తఫా, అంజద్‌బాషా, నేతలు వెల్లంపల్లి శ్రీనివాస్, రెహమాన్, రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చిన మైనార్టీలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారిని ఉద్దేశించి సజ్జల మాట్లాడుతూ.. దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డిని మరిపించే పాలన తీసుకురావడానికి వైయస్‌ జగన్‌ అడుగులు వేస్తున్నారన్నారు. నాలుగేళ్లుగా అధికార పార్టీ చేస్తున్న అవినీతి, దుర్మార్గాలను ఎప్పటికప్పుడు ఎండగడుతూ.. అతిగొప్ప ప్రతిపక్షనేతగా వైయస్‌ జగన్, ప్రతి పెద్ద ప్రతిపక్ష పార్టీగా వైయస్‌ఆర్‌ సీపీ ఎదిగిందన్నారు. నిత్యం ప్రజల క్షేమం కోసం తపిస్తూ వైయస్‌ జగన్‌ అనేక పోరాటాలు చేశారన్నారు. ప్రజల్లో చైతన్యం తీసుకువస్తూ.. నిజమైన ప్రజాపాలన ఎలా ఉంటుందో.. మహానేత వైయస్‌ఆర్‌ పరిపాలనను చూపిస్తూ ఆయన ఆశయ సాధన కోసం కృషి చేస్తున్నారన్నారు. 

ఎన్నికలంటే ఎత్తులు, జిత్తులు, పొత్తులు ఇవే చంద్రబాబుకు తెలిసిన రాజకీయమని సజ్జల ధ్వజమెత్తారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేయాలనే చిత్తశుద్ధి లేదన్నారు. వైయస్‌ఆర్‌ సీపీ మైనార్టీ సెల్‌ నాయకులు ప్రజల్లో చైతన్యం తీసుకురావాలి. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, వైయస్‌ జగన్‌ వస్తే ఎలాంటి ఉజ్వల భవిష్యత్తు ఉంటుందో.. వైయస్‌ఆర్‌ అందించిన పథకాల కంటే మెరుగైన పథకాలను అందించేందుకు ఏ విధంగా అడుగులు వేస్తున్నారో ప్రజలకు గుర్తు చేస్తూ ఎన్నికలకు అవసరమైన అస్త్రాలను కూడగట్టుకోవాలన్నారు. వైయస్‌ జగన్‌ పాదయాత్ర పూర్తయ్యేలోగా మైనార్టీలతో సమ్మేళనం నిర్వహించే విధంగా ఏర్పాట్లు చేస్తామన్నారు. మైనార్టీలు, బీసీలు చంద్రబాబు చేతిలో దోపిడీకి గురవుతున్న వర్గాలు కలిసికట్టుగా ముందుకు కదలాలన్నారు. ఓట్లు వేయించుకొని మోసం చేసిన పార్టీల నిజస్వరూపాలు బయటపడే విధంగా పనిచేయాలని సూచించారు. ఎలాంటి పాలకులు కావాలి.. మన బతుకులు మెరుగుపరిచేవారు ఎవరూ అనే చైతన్యం ప్రజల్లో పుట్టాలని, ఆ దిశగా పనిచేయాలని సూచించారు. 

మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి విధానాలు, ఆశయ సాధన కోసం పుట్టిన పార్టీ వైయస్‌ఆర్‌సీపీ అని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. సమాజంలోని పేదలందరూ సంతోషంగా ఉండేందుకు 24 గంటలు కష్టపడిన మహానాయకుడు వైయస్‌ఆర్‌ అని గుర్తు చేశారు. అందుకు ఆయన మరణించిన తరువాత ఆగిన గుండెలే నిదర్శనమన్నారు. అలాంటి మహానుభావుడి వారసత్వాన్ని పునికిపుచ్చుకొని ప్రజల కోసం తపిస్తున్న నాయకుడు వైయస్‌ జగన్‌ అన్నారు. చంద్రబాబు ఎన్ని కుట్రలు చేసినా తట్టుకొని 2014లో ఒక్క శాతం ఓట్లతో అధికారం చేజారిపోయినా.. ప్రతిపక్ష ఎమ్మెల్యేలు 23 మందిని చంద్రబాబు సంతలో పశువుల్లా కొనుగోలు చేసినా.. అదురు బెదురు లేకుండా ప్రజలే న్యాయనిర్ణేతలని అన్నింటినీ తట్టుకొని రేపు మనమే అధికారంలోకి రాబోతున్నామని బలంగా నిలబడిన ఏకైక నాయకుడు వైయస్‌ జగన్‌ అన్నారు. అది వైయస్‌ఆర్‌ ఇచ్చిన వారసత్వం అన్నారు. వైయస్‌ జగన్‌ నాయకత్వాన్ని, నిజాయితీని జనం కూడా గట్టిగా నమ్ముతున్నారన్నారు. ఆకాశం మీద ఉమ్ము వేస్తే తిరిగివారి మీదే పడినట్లుగా టీడీపీ నేతలు జననేతపై ఎన్ని ఆరోపణలు చేసినా చివరకు వారికి వర్తిస్తున్నాయన్నారు. 

ప్రజలు, రాష్ట్ర శ్రేయస్సు కోసం ఇన్ని పోరాటాలు చేసిన పార్టీలు దేశంలోనే లేవని సజ్జల అన్నారు. పార్టీ స్థాపించిన తరువాత అధికారం చేజారి బతికిబట్టకట్టిన పార్టీలు ఒక్కటీ లేవని, అది వైయస్‌ఆర్‌ సీపీ ఒక్కటేనన్నారు. ఎన్నిసార్లు ఎదురుదెబ్బలు తగిలినా రాష్ట్రగతిని మార్చాలనే తపనతో వైయస్‌ జగన్‌ ముందుకుసాగుతున్నారన్నారు. ఆయన నాయకత్వ పటిమతోనే పార్టీ నాయకులు అడుగులో అడుగు వేస్తూ.. నడవగలుగుతున్నారన్నారు. దౌర్భాగ్యస్థితిలో రాష్ట్రం ఏర్పడినప్పుడు మూడు పార్టీల నాయకులు వచ్చి రాష్ట్రాన్ని బాగుచేస్తాం.. మాకు అధికారం కట్టబెట్టండి అని మోసపువాగ్ధానాలు ఇచ్చి ప్రజలను నిలువునా మోసం చేశారన్నారు. కానీ వైయస్‌ జగన్‌ ఆచరణకు సాధ్యమయ్యే హామీలను మాత్రమే ఇచ్చారని, మోసం చేయడం.. ఆడిన మాట తప్పడం వైయస్‌ వంశంలోనే లేదన్నారు. వీటన్నింటినీ పార్టీ నాయకులు ప్రజల్లోకి తీసుకెళ్లి చైతన్యం చేయాలన్నారు. మరోసారి మోసపు వాగ్ధానాలకు మోసపోకుండా చూడాలన్నారు. 
 
Back to Top