ఓటు బ్యాంక్ రాజకీయాలకేనా బీసీలురాష్ట్రంలో బీసీలకు ఘోరమైన అన్యాయం జరుగుతుందిరూ.10 వేల కోట్లతో సబ్‌ప్లాన్ అని చెప్పి బాబు మాటతప్పాడుబడుగు, బలహీన వర్గాలను ఒక్కతాటిపైకి తేవాలిఆరు నెలల కాలంలో పార్టీ నేతలంతా ప్రతి గ్రామంలో పర్యటించాలిప్రజల జీవితాలు బాగుపరిచేలా ప్రణాళికలు రూపొందించాలిబీసీ గర్జనలో డిక్లరేషన్ ప్రకటిద్దాంపార్టీ బీసీ నేతల సమావేశంలో ప్రతిపక్షనేత వైయస్ జగన్విజయవాడ: ముఖ్యమంత్రి చంద్రబాబు బీసీలను కేవలం ఓటు బ్యాంక్ రాజకీయాలకే వాడుకుంటున్నారని వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రతిపక్షనేత వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి విమర్శించారు. రాష్ట్రంలో బీసీలకు జరుగుతున్న అన్యాయం, వెనుకబాటుతనం, బీసీల సంక్షేమానికి తీసుకోవాల్సిన చర్యలపై వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన విజయవాడలో నూతనంగా ప్రారంభించిన వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో బీసీ సెల్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా బీసీ నేతలను ఉద్దేశించి వైయస్ జగన్ మాట్లాడుతూ.. బీసీలకు రూ. 10 వేల కోట్లతో సబ్‌ప్లాన్ ఏర్పాటు చేస్తానని ఇప్పటి వరకు అమలు చేయలేదని మండిపడ్డారు. మోసం చేసిన వారిని బంగాళాఖాతంలో కలిపే రోజులు రావాలని, ఆ విధంగా ప్రజలు చైతన్యవంతులు కావాలని సూచించారు. బీసీల సంక్షేమం, వారి అభ్యున్నతికి ఎలాంటి చర్యలు తీసుకోవాలనే దానిపై వైయస్ జగన్ పార్టీ నేతలతో చర్చించారు. బడుగు, బలహీనవర్గాల ప్రజలను ఒక్కతాటిపై తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. అప్పుడే రాజకీయ వ్యవస్థ బాగుపడుతుంది..ఎన్నికల సమయంలో ఒక రాజకీయ నాయకుడు మైక్ పట్టుకుని ఇచ్చిన హామీని నెరవేర్చలేకపోతే ప్రజలు కాలర్ పట్టుకుని అడిగే పరిస్థితి రావాలని వైయస్ జగన్ అన్నారు. అలాంటప్పుడే రాజకీయ వ్యవస్థ బాగుపడుతుందన్నారు. ఈ మార్పుకు శ్రీకారం చుట్టాలని, రాబోయే రోజుల్లో పార్టీ బీసీ నేతలు ప్రతి గ్రామానికి వెళ్లి చంద్రబాబు ఏరకంగా ప్రజలను మోసం చేశాడో వివరించాలన్నారు. ఆరు నెలల పాదయాత్ర ముగిసే సమయానికి బీసీ ప్రజల జీవితాలు బాగుపర్చడానికి ఎలాంటి కార్యక్రమాలు చేపట్టాలో సలహాలు, సూచనలు ఇవ్వాలన్నారు.
విశ్వసనీయత కోసం పాటుపడదాం...పాదయాత్ర ముగిసిన తరువాత ఈ సారి బీసీ గర్జన వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపడుతుందని వైయస్ జగన్ పార్టీ నేతలతో చెప్పారు. బీసీ గర్జనలో వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ డిక్లరేషన్ ప్రకటిస్తుందన్నారు. చంద్రబాబు మాదిరి ఉత్తుత్తి మ్యానిఫెస్టో కాకుండా ప్రజలకు మేలు చేసే కార్యక్రమాలనే మ్యానిఫెస్టోలో పొందుపరుస్తామన్నారు. ఆ తరువాత మళ్లీ ఎన్నికలకు మ్యానిఫెస్టో చేతపట్టుకుని ఇదిగో చెప్పిన హామీలన్నీ నెరవేర్చామని ప్రజలకు చూపిద్దామని, అధికారంలోకి వస్తే ఆ విధంగా పరిపాలన చేసి చూపిద్దామని నాయకులకు వివరించారు. రాజకీయాల్లో విశ్వసనీయత కోసం పాటుపడదామని సూచించారు.