ఫ్లోర్‌ లీడర్ల ఎంపిక బాధ్యత జగన్‌కే

హైదరాబాద్, 31 మే 2014:

వైయస్ఆర్ కాంగ్రె‌స్ పార్లమెంటరీ పార్టీ నేతను ఎన్నుకునే అధికారాన్ని శ్రీ వైయస్   జగన్మోహన్‌రెడ్డికి అప్పగిస్తూ ఎంపీలు శనివారం ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. పార్టీ పార్లమెంటరీ‌, తెలంగాణ పార్టీ శాసనసభా పక్షం సమావేశం లోట‌స్‌పాండ్లో జరిగింది. తెలంగాణ పార్టీ శాసనసభా పక్షం నాయకుని ఎంపిక బాధ్యత కూడా శ్రీ జగన్‌కు అప్పగిస్తూ ఈ సమావేశం తీర్మానించింది.

ఈ సమావేశం అనంతరం నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, సమావేశం వివరాలను వెల్లడించారు. పార్లమెంటులో తమ పార్టీ నిర్మాణాత్మకమైన పాత్ర పోషిస్తుందన్నారు. రాష్ట్రం, దేశ ప్రయోజనాల కోసం అంశాలవారీగా ఎన్డీయే ప్రభుత్వానికి మద్దతు ఇస్తామని మేకపాటి చెప్పారు. అయితే, రాష్ట్ర ప్రజల ప్రయోజనాకే అత్యధిక ప్రాధాన్యం ఇస్తామన్నారు. పార్టీ ఎంపీలందరం సముచిత రీతిలో స్పందించి రాష్ట్ర ప్రయోజనాలను కాపాడుతామని ఆయన స్పష్టం చేశారు. పార్లమెంట్ సమావేశాలకు ఎంపీలంతా తప్పకుండా హాజరు కావాలని‌ పార్టీ అధినేత శ్రీ వైయస్ జగన్మోహ‌న్‌రెడ్డి ఆదేశించినట్లు మేకపాటి తెలిపారు.

ఖమ్మం వైయస్ఆర్‌సీపీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా మేకపాటి అభిప్రాయాన్నే వ్యక్తంచేశారు. పోలవరం ఆర్డినెన్సులో కొన్ని లొసుగులున్నాయని, వాటిని లోక్‌సభలో చర్చకు ప్రస్తావిస్తామన్నారు. ఖమ్మం జిల్లా నుంచి పార్టీ తరఫున ఎమ్మెల్యేలుగా గెలిచిన తాటి వెంకటేశ్వర్లు, పాయం వెంకటేశ్వర్లు, మదన్‌లాల్‌ మాట్లాడుతూ... తాము ప్రజలతో ఉంటామని, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో నిర్మాణాత్మకమైన పాత్ర పోషిస్తామన్నారు. టీఆర్‌ఎస్‌ పార్టీలోకి తాము వెళ్శిపోతున్నామంటూ వస్తున్న పుకార్లను వారు కొట్టిపడేశారు. ఆ విధంగా తమనెవరూ సంప్రతించలేదని, పార్టీ మారేందుకు తాము సిద్ధంగా లేమన్నారు. శ్రీ వైయస్‌ జగన్మోహన్‌రెడ్డి నాయకత్వంలోనే పని చేస్తామని స్పష్టంచేశారు. అంశాలవారీగా టీఆర్ఎస్‌కు తాము మద్దతిస్తామన్నారు.

Back to Top