రంగారెడ్డి జిల్లాపై రాజన్నకు అవ్యాజాభిమానం

ఘటకేసర్ 28 జూన్ 2013:

తమ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డిని దెబ్బతీయడం, రాజశేఖరరెడ్డిగారిని అప్రతిష్టపాలుచేయడమే లక్ష్యంగా కాంగ్రెస్, టీడీపీలు పనిచేస్తున్నాయని శ్రీమతి విజయమ్మ మండిపడ్డారు. రంగారెడ్డి జిల్లా ఘటకేసర్‌లో శుక్రవారం ఏర్పాటైన వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల విస్తృత సమావేశంలో ఆమె ప్రసంగించారు. పంచాయతీ ఎన్నికలపై ఆమె వారికి దిశా నిర్దేశం చేశారు. ప్రస్తుతం ప్రజలకు భరోసా ఇచ్చే నాయకులు లేరనీ.. ఆ స్థానాన్ని మనం భర్తీ చేయాలనీ శ్రీమతి విజయమ్మ పిలుపునిచ్చారు. దివంగత మహానేత డాక్టర్ రాజశేఖరరెడ్డి గారు అన్ని ప్రాంతాల అభివృద్ధికీ పాటు పడ్డారని చెప్పారు. తెలంగాణ ప్రాంత వెనుకబాటుతనంపై ఆయనకు అవగాహన ఉండబట్టే ప్రాణహిత ప్రాజెక్టును చేపట్టారన్నారు. మెదక్ జిల్లాలో ఐఐటీ, బాసరలో ఐఐఐటీ, ఇలా విద్యారంగంలో కూడా ఈ ప్రాంతానికి ప్రాధాన్యత ఇచ్చారన్నారు. తన ప్రసంగంలో ఆమె చంద్రబాబు, కిరణ్ కుమార్ రెడ్డి పాలనను తూర్పారబట్టారు. రాజన్న చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను ఆమూలాగ్రం వివరించారు.

అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభ వేదిక
రంగారెడ్డి జిల్లాపై డాక్టర్ వైయస్ఆర్‌కు  ప్రత్యేక అభిమానమని శ్రీమతి విజయమ్మ చెప్పారు. ఏ కార్యక్రమమైనా ఈ జిల్లానుంచే ప్రారంభించడమే దీనికి ప్రబల ఉదాహరణని పేర్కొన్నారు. 2003లో ప్రజా ప్రస్థానం పాదయాత్రను చేవెళ్ళ నుంచి.. నగరబాటను కూడా రంగారెడ్డి జిల్లా నుంచే ఆరంభించిన విషయాన్ని ఆమె గుర్తుచేశారు. వికారాబాద్ ప్రాంతం పర్యాటకంగా అభివృద్ధి చెందడానికి రూ. 120 కోట్లు, జంగిల్ పార్కు, బడ్జెట్ హొటళ్ళు ఏర్పాటు,  రూ. 300 కోట్ల రుణాల మాఫీ, 400కోట్లతో రేడియల్ రోడ్ల అభివృద్ధి.. నగర శివార్లను కలుపుతూ అవుటర్ రింగ్ రోడ్డు ఏర్పాటు మహానేత చేపట్టినవేనన్నారు. అవుటర్ రింగ్ రోడ్డుతో జీవన ప్రమాణాలు పెరిగాయనీ, రంగారెడ్డి, జంట నగరాల రూపురేఖలు మారాయనీ వివరించారు. టీసీఎస్, కాగ్నిజెంట్ రాకతో రియల్ ఎస్టేట్ కు ఊపు వచ్చిందన్నారు. కమాండో దళాల కార్యాలయం ఏర్పాటు చేశారన్నారు. పేదవాడి కల సాకారానికి 2లక్షల 70వేల ఇళ్ల నిర్మాణాన్ని చేపట్టారన్నారు.  18వేల మంది జేఎన్ఎన్ యూఆర్ ఎమ్ ఇళ్లు కట్టించారన్నారు.   106201 మందికి ఆరోగ్యశ్రీ పథకంలో వైద్యం చేయించారన్నారు. తాండూరు రైతాంగం కోసం శివసాగర్ సాగు నీటి పథకాన్ని చేపట్టిన అంశాన్ని శ్రీమతి విజయమ్మ గుర్తుచేశారు.  ఉద్యాన పంటల అభివృద్ధికీ, వికారాబాద్ ప్రాంతానికి మంజీరా నీరు అందించేందుకూ రూ   39 కోట్లు మంజూరు చేశారన్నారు. చేవెళ్ళకు 22 కోట్లు ఇచ్చారన్నారు.  మేడ్చల్‌లో ఇళ్ళపట్టాలు ఇస్తానన్న రాజన్న హామీ ప్రస్తుతం అమలు కాలేదని చెప్పారు.

ఆయన హయాంలో పింఛన్లను పెంచడమే కాక సమర్థంగా అమలుచేశారని తెలిపారు. చేపట్టిన కోటి ఎనబై లక్షల ఇళ్లకు యాబై లక్షల ఇళ్లు పూర్తయ్యాయని చెప్పారు. గ్యాస్ ధర ఆయనహయాంలో పెరగలేదనీ, కేంద్రం పెంచినా రాష్ట్ర ప్రభుత్వమే భరించేలా చూశారనీ వివరించారు. ఫీజు రీయింబర్సుమెంటు, ఆరోగ్యశ్రీ పథకాలను ఎంతో సమర్థంగా అమలు చేసిచూపారన్నారు.

ఆయన రెక్కల కష్టం మీద వచ్చిన ప్రభుత్వం రాజన్న సంక్షేమ పథకాలకు తూట్లు పొడుస్తోందని శ్రీమతి విజయమ్మ ఆవేదన వ్యక్తంచేశారు. ఆయన మరణానంతరం పాలకులు ప్రజలపై 1790కోట్ల ఆర్టీసీ చార్జీల భారాన్నీ, రూ. 34వేల కోట్ల కరెంటు చార్జీల భారాన్నీ మోపారని ఆమె వివరించారు. ఇది కాక ఉచిత విద్యుత్తును మూడు గంటలే ఇస్తున్నారని చెప్పారు. రాజన్న 300శాతం ఇన్‌పుట్ సబ్సిడీ ఇచ్చారనీ, ఇప్పుడా ఊసే లేదనీ ఆవేదన వ్యక్తంచేశారు. నీలం తుఫానుకు ఇంతవరకూ రూ. 471 కోట్లు మాత్రమే అందాయన్నారు. రైతులకు ఇవ్వాల్సిన రుణాలు ఇవ్వడం లేదన్నారు. రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నప్పటికీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ తన పదవిని కాపాడుకోడానికి ఢిల్లీకి వెళ్ళొస్తున్నారని ఎద్దేవా చేశారు. పరిశ్రమలకు పవర్ హాలిడే.. వ్యవసాయానికి క్రాప్ హాలిడే ప్రకటిస్తూ కాలం గడుపుతున్నారన్నారు. వేలాది పరిశ్రమలు మూతపడ్డాయనీ, లక్షల కార్మికుల రోడ్డున పడ్డారనీ శ్రీమతి విజయమ్మ ఆవేదన వ్యక్తంచేశారు.

133 రోగాలను ఆరోగ్యశ్రీనుంచి తొలగించారని ఆరోపించారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో మందులు లేవన్నారు.  ధరలను 15సార్లు పెంచారన్నారు. సబ్సిడీ లేకుంటే వెయ్యి పెట్టి గ్యాస్ కొనాలన్నారు. రాజన్న హయాంలో ఏ చార్జీ పెరగలేదనీ,  ఇప్పుడెందుకు పెంచాలనీ ప్రశ్నించారు. ఆయన హయాంలో మొదటి ఏడాది 40 వేల కోట్ల బడ్జెట్ ఉంటే... ఇప్పడు లక్ష కోట్ల పైన ఉందనీ ఆదాయం ఎక్కడికి పోతోందనీ ఆమె రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీశారు. పింఛన్లకు విపరీతమైన ఆంక్షలు విధిస్తున్నారనీ,  80వేల మంది వికలాంగులకు పింఛన్లను తొలగించారనీ ఆవేదన వ్యక్తంచేశారు. మహిళలకు, రైతులకూ వడ్డీలేని రుణాలే లేవన్నారు.  ఫీజు రీయింబర్సుమెంటుపై సందిగ్ధత కొనసాగుతోందన్నారు. మద్యం అమ్మకాలు విపరీతంగా పెరిగాయన్నారు. ఇప్పుడు 19 వేల కోట్ల రూపాయల  ఆదాయం లభిస్తోందనీ, తాగడానికి గుక్కెడు నీరు దొరక్కపోయినా పట్టించుకోరు కానీ ఏటా అమ్మకాలు పెంచాలని మద్యంపై టార్గెట్ పెట్టారని ఆమె ఎద్దేవా చేశారు. కూర్చుని తాగడానికి షాపులకు పర్మిట్లు ఇవ్వడం దారుణమన్మనారు. మద్యం కారణంగానే గుంటూరులో సునీల సంఘటన జరిగిందని ఆమె అభిప్రాయపడ్డారు. అభివృద్ధిలో ఆంధ్ర అట్టడుగున, అరాచకాల్లో మొదటి స్థానంలో ఉందనీ చెప్పారు.

ఉచిత విద్యుత్తు తొమ్మిది గంటలపాటు ఇస్తాననీ, ధర పెంచననీ, బియ్యం 20 నుంచి 30 కిలోలకు పెంచుతానని ఇచ్చిన రాజన్న హామీలు నెరవేరలేదని శ్రీమతి విజయమ్మ ఆవేదన వ్యక్తంచేశారు. రూపాయి బియ్యం వల్ల 20 రూపాయలే లబ్ధి పొందుతున్నారనీ, అమ్మహస్తం ఎవరికీ అందడం లేదనీ, . మామూలుగా ఇచ్చే సరకులు కూడా  తగ్గించారనీ చెప్పారు. కారం, పసుపు, ఉప్పు వంద గ్రాములు ఇస్తున్నారట.. అవి ఏమూలకు. సరిపోతాయని ప్రశ్నించారు.

రాజశేఖరరెడ్డిగారు అందరి మోములో చిరునవ్వు చూడాలని తపించారన్నారు. ఆయన ఆశయం ఏ ఒక్కటీ నెరవేరలేదు. లక్షలాది ఎకరాలను మహానేత పంపిణీ చేశారనీ ఆ కార్యక్రమం  ఇప్పుడెందుకు జరగటం లేదనీ నిలదీశారు. ప్రస్తుతం ఉద్యోగాలు లేవు.. పరిశ్రమల ఏర్పటు లేదు.. అభివృద్ధి లేదు అంటూ ఇలాంటి ప్రభుత్వానికి ఎందుకు ఓటెయ్యాలి అని ఆమె కార్యకర్తలను ప్రశ్నించారు.

చంద్రబాబు హయాం ఎలా ఉన్నదీ.. ఆయన ఎలాంటి ప్రజా వ్యతిరేక చర్యలు చేపట్టారు.. కాంగ్రెస్ పార్టీతో కలిసి శ్రీ జగన్మోహన్ రెడ్డిని జైలులోనే ఉంచడానికి ఎలా ప్రయత్నిస్తున్నదీ శ్రీమతి విజయమ్మ కళ్ళకు కట్టినట్లు వివరించారు. పంచాయతీ ఎన్నికలలో సమష్టిగా పనిచేసి విజయం సాధించాలని ఆమె పిలుపునిచ్చారు.

తాజా వీడియోలు

Back to Top