రాష్ట్రంలో పరిస్థితిని కేంద్రానికి వివరించండి

రాష్ట్రంలో పరిస్థితిని కేంద్ర ప్రభుత్వ దృష్టికి తేవాల్సిందిగా కోరుతూ వైయస్ఆర్ కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ రాష్ట్ర గవర్నరు ఇఎస్ఎల్ నరసింహన్‌కు ఓ లేఖ రాసింది. శనివారం ఉదయం ఆయనను కలిసి ఈ లేఖను అందించింది.
గవర్నరు పార్టీ రాసిన లేఖ పూర్తి పాఠం ఇలా ఉంది.

గౌరవనీయులైన గవర్నరు,
ఇఎస్ఎల్ నరసింహన్ గారికి,
ఆంధ్రప్రదేశ్

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాన్ని ఏకపక్షంగానూ, నిరంకుశంగానూ నిట్టనిలువుగా చీల్చాలన్న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ, యూపీఏ భాగస్వాముల నిర్ణయానంతరం ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాలలో యాబై రోజులకు పైగా అన్ని వర్గాల ప్రజలూ చేస్తున్న ఆందోళనపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టనట్లు వ్యవహరిస్తున్నాయి. ఈ రెండు ప్రాంతాల ప్రజలు రాష్ట్రం సమైక్యం ఉండాలని వాంఛిస్తున్నారు. ఈ విషయంలో మరో చర్చకు తావులేదంటున్నారు. టీడీపీ, టీఆర్ఎస్, కాంగ్రెస్, సీపీఐ, బీజేపీలు మాత్రమే విభజనకు అంగీకరించిన విషయం మీకు తెలుసు. వైయస్ఆర్ కాంగ్రెస్, సీపీఎం, ఎమ్ఐఎమ్ పార్టీలు ఏకపక్ష విభజనను వ్యతిరేకించాయి. విభజన ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాల ప్రయోజనాలను తీవ్రంగా దెబ్బతీస్తాయని భావిస్తున్నాం.

మా పార్టీకి సంబంధించినంత వరకూ ఎంపీ, ఎమ్మెల్యేలు సీడబ్ల్యూసీ చేసిన ఏకపక్ష విభజన నిర్ణయాన్ని నిరసిస్తూ రాజీనామాలు చేశారు. జులై 30 ముందుగానే 16మంది మా పార్టీ ఎమ్మెల్యేలు రాజీనామాలను సమర్పించారు. సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఢిల్లీలో చేస్తున్న ప్రకటనల వల్ల విభజన తప్పదని ఊహించి ఈ చర్యకు దిగారు.  మా పార్టీ గౌరవాధ్యక్షురాలు శ్రీమతి వైయస్ విజయమ్మ సహా మరికొంతమంది ఎమ్మెల్యేలు నిరవధిక నిరాహార దీక్షకు సైతం పూనుకున్నారు. అలాగే మా పార్టీ నాయకురాలు శ్రీమతి వైయస్ షర్మిల విభజన నిర్ణయాన్ని ఉపసంహరించాలని చేపట్టిన బస్సు యాత్రకు ఆయా ప్రాంతాలలో అనూహ్య స్పందన లభించింది.
ఇన్ని పార్టీలు వ్యతిరేకంగా ఉన్నా.. రాష్ట్రంలోని అత్యధికులు విభజన వద్దని ఘోషిస్తున్నా కూడా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై క్యాబినెట్ ప్రతిపాదన తేబోతున్నట్లు తేలడం నిజంగా దిగ్భ్రాంతికరం. విభజన నిర్ణయంపై జరుగుతున్న ఆందోళనలతో ఇప్పటికే ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాలలో జనజీవనం స్తంభించిపోయింది. పరిస్థితి మరింత క్షీణిస్తోంది. ఈ ఇరు ప్రాంతాల వారికీ ఇది జీవన్మరణ సమస్యలా మారింది.

గడిచిన నాలుగేళ్లుగా విద్యుత్తు చార్జీల పెంపు, విద్యుత్తు కోత, ఇంధన ధరల పెరుగుదల, పాలనలేమి కారణంగా రాష్ట్ర ప్రజలు ఎన్నో చెప్పుకోలేని ఇబ్బందులు పడుతున్నారు. కాంగ్రెస్, టీడీపీల కుమ్మక్కు రాష్ట్రాన్ని ఈ స్థితికి దిగజార్చింది. ఈ పరిస్థితుల నేపథ్యంలో రాష్ట్రంలో పరిస్థితిని కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళి రాష్ట్ర విభజనపై మరింత ముందుకు వెళ్ళకుండా సూచించాలి.
మీ విశ్వసనీయులు
వైయస్ఆర్ కాంగ్రెస
లెజిస్లేచర్ పార్టీ

Back to Top