ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాల్సిందే..!

ఆర్టీసీ బాగుకోసం పరితపించిన నేత వైఎస్సార్..!
పదవి కోసం ఎంతకైనా తెగిస్తారు..!

తిరుపతిః ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాల్సిందేనని ప్రతిపక్ష నేత, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈమేరకు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తామని స్పష్టం చేశారు. తిరుపతిలో జరిగిన వైఎస్సీర్సీపీ ఆర్టీసీ మజ్దూర్ యూనియన్ సభలో వైఎస్ జగన్ పాల్గొన్నారు. ఈసందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. ఛార్జీలు పెంచేందుకు చొరవ చూపుతున్న ప్రభుత్వం ఆర్టీసీ కార్మికులకు జీతాలిచ్చే విషయంలో మాత్రం శ్రద్ధ వహించడం లేదని జగన్ విమర్శించారు. 

ఆర్టీసీ బలోపేతం కోసం వైఎస్సార్ కృషి..!
ఐదేళ్లలో ఒక్కసారి కూడా ఆర్టీసీ, కరెంటు ఛార్జీలు పెంచకుండా ప్రియతమ నేత వైఎస్.రాజశేఖర్ రెడ్డి పాలించారని జగన్ ఈసందర్భంగా గుర్తు చేశారు. ఆర్టీసీ తన కాళ్లమీద తాను నిలబడాలని ఆర్టీసీని బలోపేతం చేస్తూ, కార్మికుల బాగుకోసం వైఎస్సార్ ఆలోచించారని జగన్ తెలిపారు. కానీ చంద్రబాబు హయాంలో ఆర్టీసీ బస్సులన్నీ ప్రభుత్వ కార్యక్రమాలకు తరలిపోతున్నాయన్నారు.  వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆర్టీసీకి రూ.280 కోట్ల రూపాయలు మేలు జరిగేలా చూశారని..చంద్రబాబు మాత్రం ఆర్టీసీ నష్టపోతే మంచిదన్న ధోరణితో అమ్మేయాలని చూస్తున్నారని దుయ్యబట్టారు. ఎలాంటి సమ్మె లేకుండానే, ఎవరూ అడగకుండానే కార్మికుల ప్రతినిధులు వచ్చిన వెంటనే జీతాలు పెంచిన ఘనత వైఎస్సార్ ది మాత్రమేనన్నారు జగన్. 

చంద్రబాబులా కాదు ఏదైనా చేసి చూపుతాం..!
రాజశేఖర్ రెడ్డి వారసుడిగా ఆయన స్ఫూర్తితో చెబుతున్నా...ఎన్నాళ్లు బతికామన్నది కాదు. బతికినన్నాళ్లు మనం ఎలా బతికామన్నది  ముఖ్యమని వైఎస్ జగన్ ఉద్విఘ్నంగా మాట్లాడారు. ముఖ్యమంత్రి కావాలని ఎవరికైనా ఉంటుందని, కానీ ఆపదవి కోసం అబద్ధాలు ఆడి మోసం చేసింది మాత్రం చంద్రబాబేనని జగన్ అన్నారు. వెన్నుపోటు పొడవడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్యగనకే కూతుర్ని ఇచ్చిన మామను వెన్నుపోటు పొడిచారని జగన్ ఆరోపించారు. మనం అలా కాదని మాటమీద నిలబడే తత్వమని జగన్ తెలియజేశారు. 
Back to Top