ఆంధ్రప్రదేశ్‌ సమైక్యతకు జగన్‌ మా మద్దతడిగారు

ముంబై :

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు సహకరించాలని వైయస్ఆర్ కాంగ్రె‌స్ పార్టీ అధినేత‌ శ్రీ వైయస్ జగన్మోహ‌న్‌రెడ్డి తనను కోరారని ఎన్‌సీపీ అధ్యక్షుడు, కేంద్ర వ్యవసాయ మంత్రి శరద్ పవా‌ర్ తెలిపారు. అయితే, తెలంగాణకు అనుకూలంగా ఎ‌న్‌సీపీ తొమ్మిది నెలల క్రితమే నిర్ణయం తీసుకుందని ఆయన చెప్పారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు చేస్తున్న ప్రయత్నాలలో భాగంగా శ్రీ జగన్మోహన్‌రెడ్డి ముంబైలో సోమవారం శరద్ పవా‌ర్ను, శివసేన అధినేత ఉద్ధ‌వ్ థాకరేను క‌లుసుకున్నారు.

సమావేశం ముగిసిన తరువాత పవార్‌ మీడియాతో మాట్లాడుతూ, కొత్త రాష్ట్రం ఏర్పాటు ప్రక్రియలో ఉన్న న్యాయపరమైన అంశాలను శ్రీ జగన్‌ తనతో ప్రస్తావించారన్నారు. ఏ రాష్ట్రాన్నైనా విభజించే ముందు అసెంబ్లీని విశ్వాసంలోకి తీసుకోవాలన్న అంశాన్ని ఆయన చెప్పారని తెలిపారు. ఆర్టికల్‌-3 అంశంలో పునరాలోచనకు ఆస్కారం ఉండాలని శ్రీ జగన్ చెప్పార‌న్నారు. అయితే.. తమ అభిప్రాయం, నిర్ణయం అప్పుడే చెప్పలేనన్నారు. అయితే.. శ్రీ జగన్మోహన్‌రెడ్డి లేవనెత్తిన అంశాలను తప్పకుండా తమ‌ పార్టీ వర్కింగ్ కమిటీ ముందు ఉంచుతానని పవార్ అన్నారు. రాజకీయ పునరేకీకరణ, ఎన్నికల అవగాహనలపై ఎలాంటి చర్చా జరగలేదని, కేవలం రాష్ట్రం సమైక్యంగా ఉండాలన్న అంశాలపైనే‌ తమ మధ్య చర్చ కొనసాగిందని ఆయన అన్నారు.

Back to Top