అధికారం ఉందని ఆడపడుచులపై అమానుషంగా వ్యవహరిస్తారా?


  
- మహిళల పట్ల బాబు తీరు సిగ్గుచేటు
- మధ్యాహ్న భోజన కార్మికులకు అండగా ఉంటాం 

 అమరావతి :  అధికారం ఉందని సీఎం చంద్రబాబు నాయుడు ఆడపడుచులపై అమానుషంగా వ్యవహరిస్తారా? అని  వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత వైయ‌స్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ప్రశ్నించారు. వారేం తప్పు చేశారని మహిళలపై అంత కఠినంగా వ్యవహరిస్తున్నారని మంగళవారం ట్వీట్‌ చేశారు. మధ్యాహ్న భోజన కార్మికులు తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ సోమవారం ఛలో విజయవాడ నిరసన కార్యక్రమం నిర్వహించిన విషయం తెలిసిందే. నిరసనలో పాల్గొన్న మహిళలపై పోలీసులు అత్యంత అమానుషంగా ప్రవర్తించి అరెస్ట్‌లు చేశారు.

‘మహిళా పార్లమెంట్‌ను విజయవాడలో నిర్వహించామని గొప్పలు చెప్పుకునే చంద్రబాబు, మహిళల పట్ల ప్రవర్తించిన తీరు సిగ్గుచేటు కాదా?. వారిపట్ల దురుసుగా ప్రవర్తించడం అత్యంత హేయం, దారుణం కాదా?.  సరిగ్గా వేతనాలు ఇవ్వకున్నా.. ఆరునెలలుగా సరుకుల బిల్లులు చెల్లించకపోయినా.. 85 వేలమంది కార్మికులు అప్పులు చేసి పిల్లలకు భోజనం వండిపెడుతున్నారు. దేశంలో ఎక్కాడాలేని విధంగా భోజనం వండే పనివారిని తొలగించి, ప్రయివేటు ఏజెన్సీలకు అప్పగించాలని టీడీపీ ప్రభుత్వం తహతహలాడుతోంది. దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రాగానే మధ్యాహ్న భోజన పనిని అక్కచెల్లెమ్మలకు అప్పగిస్తాం. వారి గౌరవ వేతనం పెంచి, అండగా ఉండడంతోపాటు పిల్లలకు పౌష్టికాహారం అందేలా చూస్తాం. భోజన ధరలు పెంచి బిల్లులను సకాలంలో చెల్లిస్తాం’ అని వైయ‌స్‌ జగన్‌ ట్విటర్‌లో పేర్కొన్నారు.

 

Back to Top