బాబు చేయనివి..నేను చేసి చూపిస్తా

– ముఖ్యమంత్రి అయ్యేందుకు బాబు ఇచ్చిన ఏ ఒక్క హామీ నెరవేర్చలేదు
– సీఎం హోదాలో ఇచ్చిన హామీలకు దిక్కు లేదు
– ఎన్నికలు ఉంటేనే చంద్రబాబుకు ప్రజలు గుర్తుకు వస్తారు
– మూడున్నరేళ్లలో ఏ నాడు నంద్యాల రోడ్డుపై బాబు, ఆయన మంత్రులు కనిపించలేదు
– రాజకీయ వ్యవస్థలో మార్పు రావాలంటే బాబును ఇంటికి పంపించాలి
– ప్రతి పేదవాడి బతుకులో వెలుగులు నింపడానికే నవరత్నాలు ప్రకటించా
– నంద్యాల అభివృద్ధి నాకు వదిలేయండి
– ప్రతి పేదవాడికి ఇల్లు కట్టిస్తా
– గుండ్రేవుల ప్రాజెక్టుతో కేసీ కెనాల్‌ను స్థిరీకరిస్తా
– రోడ్డు విస్తరణ బాధితులకు మార్కెట్‌ రేటు ఇప్పిస్తాం
– అగ్రిగోల్డు, కేశవరెడ్డి బాధితులకు న్యాయం చేస్తా 
– మీ అందరి ఆశీస్సులు వైయస్‌ఆర్‌సీపీపై ఉండాలి 
– ఉప ఎన్నికలో మోసాన్ని తరిమికొట్టండి..న్యాయాన్ని గెలిపించండి

నంద్యాల: నంద్యాల ప్రజలకు వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి భరోసా కల్పించారు. ఇన్నాళ్లు చంద్రబాబు నాయుడు చేయలేని అభివృద్ధిని తాను చేస్తానని హామీ ఇచ్చారు. మరో ఏడాదిలో మన ప్రభుత్వం వస్తుందని, నవ రత్నాలతో ప్రతి ఇంటిలో వెలుగులు నింపుతాని జననేత అభయం ఇచ్చారు. నంద్యాల ఉప ఎన్నిక చివరి రోజు ప్రచారంలో వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి గాంధీ చౌక్‌లో ఏర్పాటు చేసిన సభలో ప్రసంగించారు. ఈ సందర్భంగా చంద్రబాబు ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను ఎండగట్టారు. నంద్యాల ఉప ఎన్నిక మార్పుకు నాంది కావాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ ఎన్నికలో మోసాన్ని తరిమి కొట్టాలని, న్యాయాన్ని గెలిపించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఏమన్నారంటే..

– ఇవాళ నంద్యాలలో ఉప ఎన్నికలు జరుగుతున్నాయన్న సంగతి మీ అందరికి తెలుసు. మీ అందరికి కూడా ఒక విజ్ఞప్తి చేస్తున్నాను. 12 రోజులుగా నంద్యాలలో దాదాపు ప్రతి వార్డు, ప్రతి గ్రామం  తిరిగాను. ఇవాళ 13వ రోజు..ఇన్నాళ్లు మీరు చూపించిన ఆప్యాయతలు చూశాను, ప్రేమానురాగాలు చూశాను. నేనొక్కడినే కాదు రాష్ట్రం మొత్తం చూసింది. మీ ప్రేమానురాగాలు చంద్రబాబు వెన్నెముకలో భయం పుట్టించింది. ఇదే చంద్రబాబు ఇక్కడికి వచ్చాడు. తన యావత్తు కెబినెట్‌ మొత్తం కూడా ఇక్కడే తిరుగుతోంది. 
– వైయస్‌ జగన్‌పై మీరు చూపించిన ప్రేమానురాగాలు చూసి చంద్రబాబులో ఎంత భయాన్ని పుట్టిందో తెలుసా..వైయస్‌ జగన్‌కు వేరే పనిలేదు..ఇక్కడే ఉన్నాడన్నంత భయం పుట్టించింది. నంద్యాలలో ఉప ఎన్నికలు వచ్చే దాక చంద్రబాబు అనే వ్యక్తిని నంద్యాల నడిరోడ్డుపై చూశారా? నంద్యాలలో నేను తిరగడం కాదు..ముఖ్యమంత్రి పదవిలో ఉన్న చంద్రబాబు తిరుగాలి. ఎన్నికలప్పుడు తిరగడం కాదు..మంచి చేసేందుకు ప్రజల మధ్య తిరగాలి.
– చంద్రబాబు మనస్తత్వం ఏంటంటే..ఎన్నికలు ఉంటేనే మీరంతా ఆయనకు గుర్తుకు వస్తారు. చంద్రబాబు పార్టీకి చెందిన నందిగామా ఎమ్మెల్యే 2014లో చనిపోతే సానుభూతితో ఆ నియోజకవర్గంలో వైయస్‌ఆర్‌సీపీ పోటీ పెట్టలేదు. 
–  ఇవాల్టికి ఇదే చంద్రబాబు నందిగామా ముఖం కూడా చూడలేదు. ఎన్నికలు వస్తేనే ఆయనకు ప్రజలు గుర్తుకు వస్తారు. 
– మూడున్నరేళ్ల కాలం చంద్రబాబు పాలించిన తరువాత ఇవాళ మనం ఓటు వేస్తున్నాం. ఎవరో వ్యక్తిని ఎమ్మెల్యేను చేసేందుకు కాదు. మూడున్నరేళ్ల చంద్రబాబు పాలనపై ఓటు చేస్తున్నారు. ఆయన చేసిన మోసానికి వ్యతిరేకంగా, అవినీతికి, అన్యాయానికి, దుర్మార్గానికి వ్యతిరేకంగా ఓటు వేయబోతున్నాం. 
–  రాజకీయ వ్యవస్థలోకి విశ్వసనీయత అనే పదాన్ని తీసుకొని రావాలి. ఈ పదం రాకపోతే రాజకీయ వ్యవస్థ దిగజారిపోతుంది. ఎన్నికలు అయిపోయిన తరువాత ప్రజలను వెన్నుపోటు పొడిస్తే ప్రజలు కాలర్‌ పట్టుకొని నిలదీస్తారు అన్న భయం రాజకీయ నాయకుడిలో పుట్టాలి. అప్పుడైనా భయపడి ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేరుస్తారు.
–ఎన్నికలప్పుడు చంద్రబాబు ఏం చెప్పాడు. ఎన్నికలు అయిపోయిన తరువాత ఏం చేశాడో మీరే చెప్పండి.
 –ప్రతి పేద వాడికి మూడు సెంట్ల స్థలం, ఇల్లు కట్టిస్తామన్నారు. ఒక్క ఇల్లు కూడా కట్టించలేదు. మోసం చేశాడు.
–గతంలో రేషన్‌షాపుల్లో 9 రకాల సరుకులు ఇచ్చేవారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక రేషన్‌షాపులో బియ్యం తప్ప వేరే సరుకులు ఇవ్వడం లేదు. వెలిముద్రలు పడటం లేదని కోతలు పెడుతున్నారు.
– చంద్రబాబు ముఖ్యమంత్రి కావడం కోసం జాబు రావాలంటే బాబు రావాలన్నారు. జాబు ఇవ్వకపోతే ప్రతి ఇంటికి రూ.2 వేల నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. ప్రతి ఇంటికి రూ.76 వేలు బాకీ పడ్డాడు.
–పొదుపు సంఘాల అక్కచెల్లమ్మలకు సంబంధించి వాళ్ల మొత్తం రుణాలు రూ.14 వేల కోట్లు మాఫీ చేస్తామని చంద్రబాబు ఎన్నికలకు ముందు హామీ ఇచ్చారు. మేనిఫెస్టోలో కూడా పెట్టారు. మూడున్నరేళ్ల కాలం తరువాత మీ రుణాల్లో ఒక్క రూపాయి కూడా మాఫీ కాలేదు.
–ముఖ్యమంత్రి కావడం కోసం ఎవర్ని వదలిపెట్టలేదు. రైతుల వ్యవసాయ రుణాలు అన్ని కూడా పూర్తిగా మాఫీ చేస్తానన్నారు. బ్యాంకుల్లో పెట్టిన బంగారం ఇంటికి రావాలంటే బాబు రావాలన్నారు. 
–చంద్రబాబు నైజం ఎలాంటిదో తెలుసా..జీవితంలో ఒక్క అబద్ద్ధం కూడా చెప్పని వారిని సత్యహరిశ్చంద్రుడు అంటారు. జీవితంలో ఒక్క నిజం కూడా చెప్పనివారిని నారా చంద్రబాబు నాయుడు అంటారు. ఎవరినైనా..ఎప్పుడైనా వెన్నుపోటు పొడవడమే బాబు నైజం.
–కర్నూలు జిల్లా ప్రజల సాక్షిగా స్వాతంత్య్ర వేడుకల్లో చంద్రబాబు జెండా ఎరుగువేశారు. ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు కర్నూలులో ఇచ్చిన ఏ ఒక్క హామీ నెరవేర్చలేదు.
–కర్నూలుకు ఏయిర్‌పోర్టు తెస్తానన్నారు. స్మార్ట్‌సిటీ అన్నారు. త్రిపుల్‌ ఐటీ కాలేజ్‌ అన్నారు. స్వీమ్స్‌ తరహా సూపర్‌స్పెషాలిటీ ఆసుపత్రి కట్టిస్తామన్నారు. అవుకు వద్ద ఇండస్ట్రీ సిటీ, కర్నూలులో ఉర్దూ యూనివర్సిటీ అన్నారు. ఆదోని, కోవెలకుంట, ఇలా అన్ని ప్రాంతాలకు హామీ ఇచ్చారు. గుండ్రేవుల ప్రాజెక్టు కూడా కడతానని చెప్పారు. మూడేళ్ల కిత్రం ముఖ్యమంత్రి హోదాలో ఇచ్చిన హామీకి దిక్కులేదు.
–ఇవాళ నంద్యాలలో ఎన్నికలు ఉండేసరికి చంద్రబాబు ఏం చెబుతున్నారో తెలుసా. మళ్లీ అవే మాటలు. మళ్లీ అవే మోసాలు. ఇలాంటి మోసాలు, అబద్ధాలు, అన్యాయాలు చేసే వ్యక్తిని క్షమించాలా?. రాజకీయ వ్యవస్థ బాగు పడాలంటే ఇలాంటి వ్యక్తులను కచ్చితంగా ఇంటికి పంపించాలి. బంగాళఖాతంలో కలుపాలి.
–చంద్రబాబు కళ్లు తలపైకి వచ్చాయి. నేను ముఖ్యమంత్రిని..నేను ఏమైనా చేయవచ్చు..పోలీసులను పంపిస్తానని బెదిరిస్తున్నారు. ఇటీవల చంద్రబాబును ఓ రైతు మా రుణాలు మాఫీ కాలేదు సార్‌ అన్నారు. అంతే చంద్రబాబు కళ్లు పెద్దవి చేస్తారు. నీవు జగన్‌ మనిషివి అని భయపెడుతున్నారు. ఈ వ్యవస్థలో మార్పు రాకపోతే రేపు చంద్రబాబు మీ వద్దకు వచ్చి ఏం చేస్తారో తెలుసా? ఈ సారి ఏమంటారో తెలుసా ప్రతి ఇంటికి మారుతి కారు అంటారు. ప్రతి ఇంటికి కేజీ బంగారం ఇస్తానని హామీ ఇస్తారు.
– ఈ ఎన్నికల్లో మోసం చేసిన వాళ్లకు కచ్చితంగా ఓటు వేయమన్న సంకేతం ఇవ్వాలి. సంవత్సరం తరువాత జరుగబోయే కురక్షేత్రానికి మీ ఓటు మార్పుకు నాంది కావాలి. ఇక్కడి నుంచి శ్రీకాకుళం దాకా మార్పు రావాలి. 
– చంద్రబాబు నంద్యాల అభివృద్ధి గురించి మాట్లాడుతూ..టీడీపీకి ఓటు వేయకపోతే అభివృద్ధి ఆగిపోతుందని చెబుతున్నారు.
–మనమంతా కూడా మసీదులు, చర్చీలు, దేవాలయానికి ఎందుకు వెళ్తామంటే..మనం దేవుడికి దగ్గరయ్యేందుకు వెళ్తాం. దేవుడి దగ్గరికి వెళ్లినప్పుడు దేవుడు మనకు చెప్పేది ఏమిటి. అన్యాయం చేయొద్దు, అధర్మం వద్దకు వెళ్లోదు. మోసం చేసే వారిని నమ్మొద్దు అని చెబుతారు.
– ముఖ్యమంత్రి పదవి ఉంది కదా అని చంద్రబాబు మోసం, అన్యాయం, అధర్మం చేస్తున్నారు. వీటిని వ్యతిరేకించకపోతే మనకు మనసాక్షి లేనట్లే.
– నా వద్ద చంద్రబాబు మాదిరిగా సీఎం పదవి లేదు, పోలీసు బలం లేదు. డబ్బులు లేవు. మీడియా లేదు. 
– నావద్ద ఉన్న ఆస్తి ఏంటో తెలుసా..దివంగత ముఖ్యమంత్రి వైయస్‌రాజశేఖరరెడ్డి చనిపోతు నాకిచ్చిపోయిన ఇంత పెద్ద కుటుంబమే నా ఆస్తి అని గర్వంగా చెబుతున్నాను. మహానేత చేసి మంచి, సంక్షేమపథకాలు ఇవాల్టికి ప్రజల గుండెల్లో బతికి ఉండటమే. వైయస్‌ జగన్‌ మోసం చేయడు, అబద్ధం ఆడడు. ఏదైనా చెబితే కచ్చితం చేస్తారనే విశ్వసనీయత. వైయస్‌ జగన్‌ కూడా వాళ్ల నాన్నమాదిరిగా మంచి చేయాలని ఆరాట పడుతున్నారు. నవ రత్నాలు ప్రకటించారు. పేదల బతుకుల్లో వెలుగులు నింపాలనే మంచి మనసు ఉందని నమ్మడమే నా ఆస్తి. అవకాశం వస్తే వాళ్ల నాన్నమాదిరిగా చాలా పెద్ద నాయకుడు అవుతారనే విశ్వసనీయతే నా ఆస్తి.
–చంద్రబాబు ఓటుకు రూ.3 వేలు, రెండు వేలు ఇస్తున్నారు. చంద్రబాబు మనిషి డబ్బుల మూటలతో వచ్చి ప్రతి ఒక్కరి చేతిలో డబ్బులు పెట్టి, అదే జేబులో నుంచి దేవుడి ఫోటో మీ చేతులో పెట్టి ప్రమాణం చేయించుకుంటారు. 
– ఏ దేవుడు కూడా పాపానికి ఓటు వేయమని చెప్పరు. దెయ్యాలు మాత్రమే అలా చెబుతాయి. రాబోయే రోజుల్లో ఆ దెయ్యాలు మీ వద్దకు వచ్చి డబ్బులు ఇస్తాయి. ప్రమాణం  చేయించుకుంటాయి. అలా జరిగినప్పుడు ఒక్క క్షణం కళ్లు మూసుకొని దేవుడిని మనసులో అనుకొని దేవుడా మేం ధర్మం వైపే ఉంటామని అనుకోండి. లౌక్యంగా వ్యవహరించండి. గొడవ పడాల్సిన అవసరం లేదు. ఓటు మాత్రం ధర్మానికి, న్యాయానికి వేయాలని అభ్యర్థించారు.
–చంద్రబాబు మాదిరిగా నేను అబద్ధాలు ఆడను. నంద్యాల అభివృద్ధిని నాకు వదిలేయండి. సీఎం కాగానే పులివెందుల మాదిరిగా నంద్యాలను కూడా అభివృద్ధి చేస్తాను.
– రాబోయే రోజుల్లో నంద్యాలను జిల్లాగా చేయబోతున్నాను. నవరత్నాలు ప్రతి ఇంటికి చేరితే ఏ ఇంట్లోకి చేరితే అక్కడ దుఖం ఉండదు. నవరత్నాలు ప్రతి ఇంటికి వెళ్లాలంటే వ్యవస్థలో మార్పు జరగాలి. అలా జరుగాలంటే ప్రతి పార్లమెంట్‌ను జిల్లాగా చేస్తాను. నంద్యాల జిల్లా హెడ్‌క్వార్టర్‌ అవుతుంది. ఇక్కడే మీ అందరికి అవసరమైన సౌకర్యాలు కల్పిస్తాను. అభివృద్ధిలో నంద్యాల పరుగులు పెడుతోంది. నంద్యాల అభివృద్ధి నాకు వదిలేండి
– చంద్రబాబు దృష్టిలో అభివృద్ధి అంటే రోడ్డుకు ఇరువైపుల ముడు కిలోమీటర్లు బిల్డింగ్స్‌ పగులగొట్టడమే. ఎక్కడైనా కూడా రోడ్డు విస్తరణ జరగాల్సిందే. మూడున్నరేళ్ల పాటు నంద్యాలలో రోడ్డు విస్తరణ గురించి పట్టించుకోలేదు. ఉప ఎన్నిక వచ్చే సరికి మూడు కిలోమీటర్లు టపటప పగులగొట్టారు. ఈ షాపులు పగులగొడితే వాళ్లు ఎలా బతుకుతారు అని ఆలోచించలేదు. షాపుల నిర్వాహకులతో మాట్లాడకుండా పోలీసులతో బలవంతంగా షాపులు తొలగించి ముష్టి వేసినట్లు గజానికి రూ.18 వేలు ఇస్తున్నారు. ఇదేనా అభివృద్ధి.
– 300 అడుగుల ప్లాట్లు కట్టిస్తారట. అడుగుకు వెయ్యి రూపాయలు అవుతుంది. అంటే రూ.3 లక్షలు అవుతుంది. తన బినామీ కాంట్రాక్టర్‌ను తెచ్చుకొని రూ.6 లక్షలకు ఆ ఇల్లు అమ్మే కార్యక్రమం చేస్తున్నారు. లంచాలు తీసుకునేది చంద్రబాబు..పేదలేమో కంతులు కట్టాలట.
–దేవుడ్ని గట్టిగా కోరుకోండి. ఏడాది తరువాత మన ప్రభుత్వం వస్తుంది. ఏ పేదవాడికి కూడా ఉచితంగా నేను కట్టిస్తాను. ఏ ఒక్కరు అప్పు తీసుకోవాల్సిన అవసరం లేదు. 
–రోడ్డు విస్తరణలో నష్టపోయిన బాధితులకు మార్కెట్‌ రేటు ప్రకారం పరిహారం చెల్లిస్తానని హామీ ఇస్తాను.
–మన ప్రభుత్వం వస్తుంది..మార్కెటులో ఏ ఒక్కరికి డబ్బులు కట్టాల్సిన పని లేదు.
– ఆటో నగర్‌లో 20 ఏళ్ల క్రితం లీజుకు ఇచ్చిన భూములను రిజిస్ట్రేషన్‌ చేయించి ఇస్తానని హామీ ఇచ్చారు.
–రైతులకు నేను హామీ ఇస్తున్నాను. చంద్రబాబు చేయడు. కానీ జగన్‌ చేస్తాడని మీ అందరికి హామీ ఇస్తున్నాను. కేసీ కెనాల్‌ను స్తీరికరిస్తాను.
– ఆగ్రిగోల్డు, కేశవరెడ్డి బాధితులకు చంద్బరాబు న్యాయం చేయడు. మనం అధికారంలోకి వచ్చిన వెంటనే మూడు నెలల్లో మీకు ఇవ్వాల్సిన మొత్తం ప్రభుత్వమే చెల్లిస్తుంది. ఆ తరువాత వాళ్ల ఆస్తులను ప్రభుత్వమే స్వాధీనం చేసుకుంటుంది. చంద్రబాబు చొక్కాలు ఊడగొడతాం, ఆదినారాయణరెడ్డి నిక్కర ఊడగొడతాం.
– ఎన్నికలు జరుగుతున్న పరిస్థితుల్లో మీ అందరికి ధర్మం, న్యాయం వైపు నిలబడాలని, శిల్పా మోహన్‌రెడ్డిని ఆశీర్వదించాలని, వైయస్‌ఆర్‌సీపీని దీవించాలని పేరు పేరున వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు.
Back to Top