కాకినాడ: రాష్ట్ర ప్రభుత్వం మొండిగా చేపడుతున్న పట్టిసీమ ఎత్తిపోతల పథకంవల్ల గోదావరి డెల్టా రైతులకు జరిగే నష్టాన్ని క్షేత్రస్థాయికి తీసుకువెళ్లే లక్ష్యంతో.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సమరశంఖం పూరించనున్నారు. ఆయన నేతృత్వంలో ఆ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు బుధవారం నుంచి బస్సు యాత్ర చేపట్టనున్నారు. ఈ బస్సు యాత్ర షెడ్యూల్‌లో స్వల్ప మార్పులు చోటుచేసుకున్నాయని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు, శాసనసభాపక్ష ఉపనేత జ్యోతుల నెహ్రూ ఈ విషయాన్ని సోమవారం రాత్రి తెలిపారు. రైతుల మనోభావాలను పరిగణనలోకి తీసుకోకుండా చంద్రబాబు కుట్రపూరితంగా తలపెట్టిన పట్టిసీమ ఎత్తిపోతల పథకంపై తమ పార్టీ అధినేత బస్సు యాత్ర ద్వారా సమరశంఖం పూరిస్తున్నారన్నారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఈ నెల 15 ఉదయం హైదరాబాద్ నుంచి బయలుదేరి మధురపూడి విమానాశ్రయానికి మొదటి విమానంలో వస్తారని చెప్పారు. ఎయిర్‌పోర్టుకు ఎదురుగా ఉన్న లే అవుట్ నుంచి ప్రారంభమయ్యే బస్సు యాత్రలో పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొంటారన్నారు. ఈ బస్సుయాత్ర రాజమండ్రి జాతీయ రహదారి మీదుగా ధవళేశ్వరంలోని కాటన్ అతిథి గృహానికి చేరుకుంటుందని నెహ్రూ తెలిపారు. అక్కడ సర్ ఆర్థర్ కాటన్ విగ్రహానికి జగన్‌మోహన్‌రెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పిస్తారన్నారు. ఆ సందర్భంగా అక్కడికి వచ్చే రైతులతో ‘పట్టిసీమ’ వల్ల జరిగే నష్టాలపై మాట్లాడతారని, అనంతరం ధవళేశ్వరం బ్యారేజిని పరిశీలిస్తారని చెప్పారు. అనంతరం నేరుగా పోలవరం ప్రాజెక్టుకు చేరుకుంటారన్నారు. ఆ ప్రాజెక్టు పరిశీలన అనంతరం పట్టిసీమకు వస్తారన్నారు. అక్కడ ఉభయ గోదావరి జిల్లాల రైతులతో జరిగే రచ్చబండలో జగన్‌మోహన్‌రెడ్డి పాల్గొంటారని తెలిపారు. పట్టిసీమ ఎత్తిపోతల పథకంతో గోదావరి డెల్టా ఎడారిగా మారి భవిష్యత్తులో మొదటి పంటకే సాగునీరందని పరిస్థితులు నెలకొంటాయని నెహ్రూ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయంలో ఉభయ గోదావరి జిల్లాల రైతులు పార్టీలకు అతీతంగా మేల్కొని, ప్రభుత్వంపై పోరుకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఇందుకోసమే వస్తున్న జగన్‌మోహన్‌రెడ్డి బస్సుయాత్రకు రైతులు అధిక సంఖ్యలో తరలిరావాలని, ప్రభుత్వ వంచకత్వాన్ని ఎండగట్టాలని విజ్ఞప్తి చేశారు.