మీ చర్యలు.. మీ బినామీ విద్యాసంస్థల లబ్ధికోసమే కాదా?!

 
30–07–2018, సోమవారం
విరవ, తూర్పుగోదావరి జిల్లా  


ఈ రోజు పాదయాత్ర మూడు నియోజకవర్గాల మీదుగా సాగింది. జగ్గంపేటలోని వీరవరం, రాజుపాలెం, పెద్దాపురంలోని చంద్రమాంపల్లి, దివిలి, పిఠాపురంలోని విరవ గ్రామాల్లో జరిగింది.  పిఠాపురం అనగానే వేల ఎకరాలు విద్యాసంస్థలకు వితరణగా ఇచ్చిన విద్యాప్రదాత పిఠాపురం మహారాజావారు గుర్తుకొస్తున్నారు. ‘వజ్రాయుధం’ రచించిన అభ్యుదయ కవి.. ఆవంత్స సోమసుందర్‌గారు ఇక్కడి వారే.   చంద్రమాంపల్లి దగ్గర పాఠశాల విద్యార్థినులు కలిశారు. పుస్తకాలు, యూనిఫాం ఇంకా అందలేదని మొరపెట్టుకున్నారు. బయట మార్కెట్లో కూడా దొరకడం లేదని.. పుస్తకాలే లేకుండా మేమెలా చదువుకోవాలంటూ ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ఎత్తి చూపారు.

ఉపాధ్యాయులది సైతం అదే ఆవేదన. ‘సార్‌.. ఏప్రిల్లో ఇవ్వాల్సిన పుస్తకాలు ఆగస్టు వస్తున్నా ఇంతవరకూ ఇవ్వలేదు. పిల్లలకు పాఠాలెలా చెప్పాలి? సమ్మేటివ్‌–1 పరీక్షలు నిర్వహించాల్సిన సమయమిది. సిలబస్‌ అవకుండా పరీక్షలెలా పెట్టాలి? ఈ విద్యావ్యవస్థ అంతా గందరగోళంగా ఉంది’ అంటూ విమర్శించారు. ఏప్రిల్లో అందాల్సిన పుస్తకాలు ఇప్పటికీ అందకపోవడం ఎంత దారుణం? ప్రయివేటు ప్రచురణకర్తలకు, నాయకులకు మధ్యన కమీషన్ల వ్యవహారం తేలకపోవడమే.. ఆలస్యానికి కారణమంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముడుపుల మత్తులో పడిన ప్రభుత్వ పెద్దల వైఖరి కారణంగా విద్యార్థుల చదువులు నాశనమవుతున్నాయి. ప్రభుత్వ విద్యను నిర్వీర్యం చేసి, తన బినామీ సంస్థలకు లబ్ధి చేకూర్చాలని.. ‘ఆ విధంగా ముందుకు’పోతున్నారు.  


 కార్పొరేట్‌ విద్యాసంస్థలను మాత్రమే ప్రోత్సహించేలా ఈ ప్రభుత్వం వ్యవహరించడం మరింత దారుణం. ఉన్నత విద్యలు చదివి, ఉద్యోగాల్లేక స్వయం ఉపాధి కోసం చిన్న చిన్న ప్రయివేటు పాఠశాలలను పెట్టుకుని ఉపాధి పొందాలనుకునేవారికి ఈ ప్రభుత్వం అవకాశం లేకుండా చేస్తోందని.. మధ్యాహ్నం శిబిరం వద్ద కలిసిన కిర్లంపూడి ప్రయివేటు స్కూళ్ల యాజమాన్య సంఘ ప్రతినిధులు ఆవేదనతో చెప్పారు.

ప్రీ ప్రైమరీ విభాగానికి ఎలాంటి ఫీజులు చెల్లించాల్సిన అవసరం లేకుండానే వాటిని నిర్వహించుకునే వెసులుబాటు గత ప్రభుత్వంలో ఉండేదని, ఇప్పుడు ఈ ప్రభుత్వం.. తరగతులు నిర్వహించుకోవాలంటే ఒకటిన్నర లక్షలు కట్టాలని వేధిస్తోందని వారు చెబుతున్నారు. తమ పరిసర ప్రాంతాల్లోని పేద పిల్లలకు తక్కువ ఫీజులతో విద్యనందిస్తూ.. తామూ ఉపాధి పొందేలా చిన్న చిన్న ప్రీ ప్రైమరీ స్కూళ్లు నిర్వహించుకుంటుంటే.. ప్రభుత్వం కఠిన నిబంధనలు విధిస్తూ, అనేక రకాల ఆంక్షలతో ఉక్కుపాదం మోపుతోందని వాపోయారు. బినామీలైన బడా విద్యాసంస్థల అక్రమాలకు అడ్డుకట్ట వేయకుండా.. వాటికి లబ్ధి చేకూర్చాలన్న లక్ష్యంతో చిన్న చిన్న స్కూళ్లను బలి చేయడం దుర్మార్గపు చర్య.  ముఖ్యమంత్రిగారికి నాదో ప్రశ్న.. విద్యాసంవత్సరం సగం అయిపోతున్నా పాఠ్యపుస్తకాలు అందివ్వరు. మీరిచ్చే అత్యంత నాసిరకం యూనిఫాం సైతం.. సమయానికి విద్యార్థులకు ఇవ్వరు. మధ్యాహ్న భోజన పథకాన్ని నీరుగార్చారు. ఉపాధ్యాయ నియామకాలు చేపట్టి ఖాళీలను భర్తీ చేయరు.

ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులను, ఉపాధ్యాయులను ప్రభుత్వ కార్యక్రమాలకు బలవంతంగా తరలిస్తారు. సంక్షేమ హాస్టళ్లను, స్కూళ్లను మూసివేస్తారు. ఉన్న పాఠశాలల నిర్వహణను గాలికొదిలేశారు.. ఇన్ని దుర్మార్గ చర్యల మధ్య ప్రభుత్వ పాఠశాలలు మనుగడ సాగించగలవా? పేదలు చదువులు మానుకోవాల్సిందేనా? మీ చర్యలన్నీ మీ బినామీలైన కార్పొరేట్‌ విద్యాసంస్థలకు లబ్ధి చేకూర్చడానికే కాదా?   

-వైయ‌స్‌ జగన్‌     


Back to Top