బడుగు బతుకుల కన్నీళ్లు ఆగేదెన్నడు?




 

 
 
21–06–2018, గురువారం
చింతలపల్లి, తూర్పుగోదావరి జిల్లా

చుట్టూ జలసిరి.. కనుచూపు మేర హరితహారం.. విస్తారమైన సముద్ర తీరం.. అలవికాని మత్స్యసంపద.. అంతులేని చమురు నిక్షేపాలు.. ఇదీ ప్రకృతి వనరులతో కళకళలాడే  కోనసీమ చిత్రం. కానీ పాదయాత్ర దారెంబడి కనిపించిన బతుకు చిత్రాల్లో మాత్రం ఆ సౌభాగ్యం కనిపించలేదు. ఇక్కడి ప్రజలు చెప్పుకొంటున్న కష్టనష్టాలు, బతుకు పోరాటాలు విస్తుగొలుపుతున్నాయి. ఎన్నెన్నో వనరులున్న ఈ కోనసీమ నుంచి వేలాది మంది ఇతర రాష్ట్రాలకు, గల్ఫ్‌ దేశాలకు వలస వెళుతుండటం మనసును కదిలించే విషాదం. ఈ దుస్థితికి కారణం ప్రభుత్వమేనంటూ పట్టిచూపుతున్నారు నన్ను కలుస్తున్న కోనసీమ వాసులు.
 
దారిలో ఇద్దరు చిన్నారుల విషాద భరిత జీవితాలు మనసును బరువెక్కించాయి. తలసేమియాతో బాధపడుతున్న మధుకిరణ్, పుట్టుకతోనే జన్యుపరమైన ఎముకల వ్యాధి బారినపడ్డ గోపేష్‌లను ఎత్తుకుని వచ్చారు వారి వారి తల్లిదండ్రులు. ఆ బిడ్డల వ్యధ, ఆ పెద్దల దుఃఖం మాటల్లో చెప్పలేనివి. ‘సార్‌.. నెలనెలా వైద్యానికే వేలల్లో ఖర్చుచేయాలి. మాలాంటి రోజు కూలీలకు అది సాధ్యమా? బతకడమే కష్టమైపోతోంది’ అంటూ కన్నీళ్లపర్యంతమయ్యారు. రెక్కాడితే గానీ డొక్కాడని ఆ కుటుంబాలను చూసి చలించిపోయాను.

నెలనెలా అంత ఖర్చును ఎలా భరిస్తారీ పేదలు? కళ్లెదుటే బిడ్డల కష్టం కనిపిస్తున్నా.. వైద్యం చేయించలేని నిస్సహాయస్థితి. కష్టార్జితం సర్వస్వాన్నీ అర్పించినా అప్పులే మిగులుతుంటే.. ఆ తల్లిదండ్రులు పడుతున్న నరకయాతన వర్ణనాతీతం. ఆరోగ్యశ్రీ పథకాన్ని మరింత పటిష్టం చేసి, ఇలాంటి నిర్భాగ్యులను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానిది. ఆ పనిచేయకపోగా.. పేదవాడి వరప్రదాయని లాంటి ఆరోగ్యశ్రీని నిర్వీర్యం చేసే దుర్మార్గానికి ఒడిగడుతుంటే.. ఇలాంటి బడుగు బతుకుల కన్నీళ్లు ఆగేదెన్నడు?
 
‘రెగ్యులర్‌ ఏఎన్‌ఎంలతో సమానంగా పనిచేస్తున్నాం. కానీ మాకు సమాన వేతనం ఇవ్వడం లేదు’ అని తమ సమస్యలు చెప్పుకొన్నారు.. సెకండ్‌ ఏఎన్‌ఎంలు. ‘ఎన్నికలప్పుడు మమ్మల్ని పర్మినెంట్‌ చేస్తామని ఓట్లేయించుకున్నారు. ఇప్పుడు ఆ హామీ గురించి అడిగితే.. మీకు జీతాలివ్వడమే ఎక్కువని చులకన చేస్తున్నారు’ అంటూ ఆ అక్కచెల్లెమ్మలు ఈ సర్కారు తీరును ఎండగట్టారు. ‘ఏరు దాటే దాకా ఓడ మల్లయ్య.. దాటాక బోడి మల్లయ్య’ తీరు బాబుగారికే చెల్లు!
 
కోనసీమ వాసుల కష్టాల్ని కొబ్బరాకులు కమ్మేసినట్లు అనిపించింది. చెంతనే గోదావరి ఉన్నా, చుట్టూ నీరున్నా మంచినీరు కొనుక్కోవాల్సిన దుస్థితి.. అంటూ అక్కచెల్లెమ్మలు, ఆకుతేలు వ్యాధితో దిగుబడులు తగ్గాయని కొబ్బరి రైతన్నలు, గిట్టుబాటు ధర లేదంటూ సరుగుడు రైతులు చింతలపల్లి వద్ద తమ కష్టాలు చెప్పుకొచ్చారు.
 
ముఖ్యమంత్రిగారికి నాదో ప్రశ్న.. ప్రజల తాగునీటి అవసరాలు తీరుస్తానంటూ మేనిఫెస్టోలో పలు హామీలు గుప్పించారు. ప్రతి ఇంటికీ పరిశుభ్రమైన మంచినీటి సరఫరా.. అన్న హామీ గుర్తుందా? రూ.2కే 20 లీటర్ల మినరల్‌ వాటర్‌ పథకం ఏమైంది? సాధ్యాసాధ్యాలను పరిశీలించకుండా మీ మేనిఫెస్టోలో.. సముద్ర జలాలను శుభ్రపరిచి మంచినీరుగా మార్చే డీశాలినేషన్‌ ప్లాంట్లను అన్ని తీర ప్రాంత గ్రామాలకు, పట్టణాలకు మంజూరు చేస్తాననడం ప్రజలను పూర్తిగా వంచించడం కాదా? 

‍ - వైయ‌స్ జ‌గ‌న్‌



Back to Top