యనమలది బాధ్యతారాహిత్యం: శోభానాగిరెడ్డి

హైదరాబాద్, 05 జూన్ 2013:

టీడీపీ ఎమ్మెల్సీ యనమల రామకృష్ణుడు బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్నారని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే శోభా నాగిరెడ్డి మండిపడ్డారు. తమ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి ములాఖత్‌లపై ఆయన పదేపదే ఆరోపణలు చేస్తున్నారనీ, వాటిని తాము అన్ని సందర్భాల్లో ఖండిస్తున్నామనీ ఆమె చెప్పారు. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయంలో ఆమె బుధవారం మీడియాతో మాట్లాడారు. గతంలో యనమల చేసిన ఆరోపణలను నిరూపించాలని జైలు డీఐజీ కృష్ణంరాజు సవాలు చేసిన విషయాన్ని ఆమె గుర్తుచేశారు. టీడీపీ నేతలు ములాఖత్ అంశంపై ఇంత హీనంగా ఎలా మాట్లాడుతున్నారో తెలియడం లేదని చెప్పారు. కాంగ్రెస్ పార్టీతో కలిసి అధికారాన్ని అనుభవిస్తున్న టీడీపీ ఈ అంశంపై విచారణ చేయించుకుని రుజువు చేయించుకోవచ్చు కదా అని శోభా నాగిరెడ్డి సవాలు చేశారు. శ్రీ జగన్మోహన్ రెడ్డి కేవలం నిందితునిగానే జైలులో ఉన్న అంశాన్ని టీడీపీ నేతలు మరువరాదన్నారు. జైలులో ఉన్నా శ్రీ జగన్మోహన్ రెడ్డిని నియంత్రించలేకపోతున్నామే అనే నిస్పృహలో వారిలా మాట్లాడుతూ ఉండి ఉంటారని ఆమె అభిప్రాయపడ్డారు.

శ్రీ జగన్మోహన్ రెడ్డిని కలవాలంటే కోర్టు ద్వారా కూడా ములాఖత్‌కు అనుమతి తెచ్చుకోవచ్చనీ, కానీ తామలా చేయటం లేదనీ, ఈ విషయాన్ని వారు గమనించాలనీ సూచించారు. జైల్లో సీసీ కెమెరాలున్న విషయాన్ని కూడా టీడీపీ నేతలు దృష్టిలో పెట్టుకోవాలన్నారు. ఇంకా అనుమానంగా ఉంటే చంద్రబాబు, యనమల కూడా జైలులో ఉండి పరిశీలించవచ్చు కదా అని ప్రశ్నించారు. ఈ అంశంలో ఏ విచారణనైనా చేయించుకోవచ్చన్నారు. ప్రజలు తమ ఆరోపణలను నమ్ముతున్నారో లేదో కూడా పట్టించుకోకుండానే టీడీపీ నేతలు అర్థరహితమైన ఆరోపణలకు దిగుతున్నారని శోభా నాగిరెడ్డి విమర్శించారు.

Back to Top