మీడియాను ఎందుకు అనుమతించలేదు

నెల్లూరు(స్టోన్‌హౌస్‌పేట) :అసెంబ్లీ భవనాల నిర్మాణాలు ఎంతో నాణ్యతగా, పారదర్శకంగా నిర్మించి ఉంటే ఒక రోజుపాటు మీడియాను ఎందుకు లోపలకి అనుమతించలేదని నగర ఎమ్మెల్యే డాక్టర్‌ పి.అనిల్‌కుమార్‌యాదవ్‌ ప్రశ్నించారు. గురువారం స్థానిక 50వ డివిజన్‌ సంతపేట, బ్రాహ్మణవీధి ప్రాంతాలలో ఎమ్మెల్యే పర్యటించి ప్రజలను అడిగి సమస్యలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ... వర్షానికి సచివాలయం, అసెంబ్లీయే కాకుండా ప్రతిపక్ష నాయకుని రూమ్‌లోకి పూర్తిగా నీరు రావడం జరిగిందని, అభివృద్దిని చూసి ఓర్వలేక జగన్‌మోహన్‌రెడ్డి విమర్శిస్తున్నారని, కుట్ర ఉందని మంత్రి నారాయణ చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. భవనాల నిర్మాణంలో పెద్ద లోపం ఉందని, అది బయటకు పొక్కకుండా ఒక్క రోజుపాటు మీడియాను అడ్డుకున్నారని అన్నారు. ఎక్కడ ఒక ముక్క 20 ఎంఎం పైపును కట్‌చేసి దానిని చూపించి వైఎస్సార్‌సీపీ విమర్శిస్తోందని నిందలు వేయడం సరికాదన్నారు. ఒక చిన్న పైప్‌లైన్‌ వారే కట్‌చేసుకుని మీడియాకు చూపించి దీనివల్లే నీరు వచ్చిందని, ప్రతిపక్షాలు రాద్దాంతాలు చేస్తున్నాయని, నిర్మాణాల డొల్లతనం, అందులో జరిగిన లోపాలను కప్పిపుచుకునేందుకు ప్రతిపక్షాలపై నిందలు వేస్తున్నారని అన్నారు. అభివృద్ధి అంటే ఉన్న ఇళ్లు కూల్చడం, ఇంతవరకు ఒక్క కొత్త ఇల్లు కూడా ఇవ్వకపోవడం, పింఛన్‌లు ఇవ్వకపోగా పూర్తిగా అవకతవకలు, డ్వాక్రా మహిళలకు, రైతాంగానికి శఠగోపం పెట్టడం, నిరుద్యోగ భృతి ఇవ్వకపోవడం ఈ విధంగా ప్రజలను మోసం చేస్తూ అభివృద్ధిని ప్రతిపక్షాలు అడ్డుకుంటున్నాయని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఎనిమిది రోజులపాటు నవనిర్మాణదీక్షల పేరుతో చిన్నచిన్న అధికారులను, ఏఎన్‌ఎంలను, అంగన్‌వాడీ ఉద్యోగులను భయబ్రాంతులకు గురిచేసి తీసుకొచ్చారన్నారు. సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రసంగం సమయంలో మహిళలు గేట్లు దూకి పారిపోయారని అన్నారు. కాలువలపై ఉన్న ఇళ్లను తొలగించి అపార్టుమెంట్లు కట్టిస్తామని అంటున్నారని, దీంట్లో మంత్రి ఎంత దోపిడీ చేస్తాడోనని, ఎప్పుడు కూలిపోతాయోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు కొణిదల సుధీర్, వందవాసి రంగ, వేలూరు మహేష్, భాస్కరాచారి, ఎన్‌.మధుసూధనరావు, అజ్జూభాయి, హనుమంతు, మున్నా, శివ, రజని, రమేష్, సాగర్, ఎన్‌.ప్రభాకర్, ఆర్‌.ఉదయ్‌కుమార్, మిద్దే మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Back to Top