కాంగ్రెస్‌తో కుమ్మక్కయ్యిందెవరో చెప్పండి చంద్రబాబూ!

హైదరాబాద్ 29 ఆగస్టు 2013:

రాష్ట్ర విభజనకు అనుకూలంగా ఇచ్చిన లేఖను తక్షణం వెనక్కి తీసుకోవాలని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడును డిమాండ్ చేసింది. పార్టీ ఎమ్మెల్యేలు కె. శ్రీనివాసులు, బి. గుర్నాథరెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఆర్.వి. సుజయ కృష్ణ రంగారావు ఈమేరకు గురువారం ఓ బహిరంగ లేఖ రాశారు. తెలంగాణా అంశంలో కాంగ్రెస్ పార్టీ తన వైఖరి మాత్రమే చెప్పిందనీ, ఇంకా నిర్ణయం కాలేదనీ కాబట్టి లేఖ వెనక్కి తీసుకోవడానికి ఇప్పటికీ మించిపోయింది లేదని వారు సూచించారు. గతంలో తాము రాసినట్లుగా విభజన కోరే ఆ అయిదు పార్టీలలో(టీడీపీ, కాంగ్రెస్, బీజేపీ, సీపీఐ, టీఆర్ఎస్) తాము లేమనీ, వైయస్ఆర్ కాంగ్రెస్,, సీపీఐ(ఎం) ఎంఐఎంతో పాటు టీడీపీ ఉందనీ పేర్కొంటూ కేంద్ర ప్రభుత్వానికి లేఖరాయాలని కోరారు. అంతకు ముందు చంద్రబాబు తన ఎమ్మెల్యే పదవికీ రాజీనామా చేసి, తన ఎంపీలు, ఎమ్మెల్యేలతో కూడా చేయించాలని డిమాండు చేశారు. అలా చేస్తే కాంగ్రెస్ రాష్ట్ర విభజనకు ఎలా పూనుకుంటుందో చూద్దామని చెప్పారు. అందరం కలిసి కట్టుగా అడ్డుకుంటే విభజన అసాధ్యమన్నారు. మొసలి కన్నీరు కారుస్తూ, విశ్వసనీయత లేని కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నారు కాబట్టే ప్రజల్లో మీ పరిస్థితి దారుణంగా ఉందని పేర్కొన్నారు.

కాంగ్రెస్ పార్టీతో కుమ్మక్కయ్యింది ఎవరో గుండెల మీద చేయి వేసుకుని చెప్పాలని వారు చంద్రబాబును డిమాండు చేశారు. ఐఎంజీ, ఎమ్మార్ కేసుల్లో విచారణను తప్పించుకునేందుకు ఆ పార్టీతో మీరు కుమ్మక్కవ్వలేదా అని ప్రశ్నించారు. చిల్లర వర్తకంలోకి ఎఫ్.డి.ఐలను అనుమతించే తీర్మానంపై ఓటింగు సమయంలో మీ ఎంపీలను రాజ్యసభలో నిస్సిగ్గుగా గైర్హాజరు  చేయించి రైతులు, చిన్న వర్తకులను మోసగించలేదా.. అని అడిగారు. ప్రతిపక్షాలన్నీ రాష్ట్ర ప్రభుత్వంపై అవిశ్వాసం పెడితే మీరు విప్ జారీ చేసి కాపాడింది మీరు కాదా అని కూడా నిలదీశారు. ఆరోజున 294మంది ఉండాల్సిన సభలో కావాల్సిన 148మందికి బదులు కేవలం 146మందే ఉన్నా అవిశ్వాసం నుంచి గట్టెక్కిందంటే మీ చలవే కదా బాబు? అని వారు వారు ప్రశ్నించారు. ఇంకా వారు చంద్రబాబు ఇలా ప్రశ్నల వర్షం కురిపించారు.

రాష్ట్ర విభజనకు అనుకూలంగా కాంగ్రెస్ పార్టీ తన నిర్ణయాన్ని ప్రకటించిన వెంటనే హర్షం వ్యక్తంచేసి, నాలుగైదు లక్షల కోట్లిస్తే వెళ్లిపోతామని చెప్పింది మీరు కాదా? ఢిల్లీకి వెళ్ళాలనుకుని వెనక్కి తగ్గింది మీరు కాదా? వెడితే అక్కడేమీ చెప్పలేమనీ, ఏం చెప్పినా ఓట్లు, సీట్లూ పోతాయనీ, ఫలితం దక్కదనీ భయపడి సహచరుల సలహా మేరకు ఢిల్లీ వెళ్ళడం విరమించుకుంటున్నానని మొన్నటికి మొన్న చెప్పింది మీరు కాదా? ఇది అన్ని పేపర్లలోనూ, టీవీ ఛానెళ్ళలోనూ రాలేదా? దాన్ని మరిచి ఎదుటివారిపై బురద జల్లడం కోసం అపాయింట్‌మెంట్ ఇవ్వలేదనీ, మరొకటనీ చెబుతున్న మీ మాటలను చూసి ప్రజలు అసహ్యించుకుంటున్నారు.

ఏపీ ఎన్జీవోలు మీ దగ్గరకొచ్చి అన్యాయాన్ని నివారించడానికి వీలుగా ఇచ్చిన లేఖను వెనక్కి తీసుకోవాలని ప్రాధేయపడితే కనికరం లేకుండా తిరస్కరించి తెగేసి చెప్పింది మీరు కాదా చంద్రబాబూ! అని వైయస్ఆర్ కాంగ్రెస్ నేతలు నిలదీశారు. ఆగస్టు 11లోగా రాజీనామా చేయాలని ప్రాధేయపడినా కూడా చెయ్యమని నిష్కర్షగా చెప్పలేదా ఆలోచించండని సూచించారు. ఇన్ని చేసిన మీరు ఇప్పడెందుకు గింజుకుంటున్నారు? కాంగ్రెస్ తీసుకునే నిర్ణయం గురించి ప్రచురితమైన వార్తలు మీ కంటబడలేదా? ఓట్లూ, సీట్లూ పోతాయనీ, ప్రయోజనం దక్కదనీ కాంగ్రెస్ చేస్తున్న అన్యాయపు రాజకీయాలను బలపరిచింది మీరు కాదా చంద్రబాబూ! ఇప్పటికైనా మించి పోయింది లేదనీ, మీరు, మీ ఎమ్మెల్యేలు రాజీనామా చేసి, లేఖను వెనక్కి తీసుకోవాలనీ, కోట్లాదిమందికి అన్యాయం చేసి చరిత్ర హీనులుగా మిగిలిపోవద్దనీ వారు చంద్రబాబుకు ఆ లేఖలో విజ్ఞప్తి చేశారు.

తాజా ఫోటోలు

Back to Top