ఎమ్మెల్యే రోజా ఆచూకీ చెప్పండి : జోగి ర‌మేష్‌

విజయవాడ: చంద్రబాబు సర్కార్‌ ఎమ్మెల్యే రోజాను అరెస్టు చేశారా? కిడ్నాప్‌ చేశారా? ఎక్కడికి తీసుకెళ్లారు అనే సమాచారమే లేదని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి జోగిరమేష్‌ ఆందోళన వ్యక్తం చేశారు. మహిళా పార్లమెంటరీ సదస్సుకు పిలిచి చంద్రబాబు ప్రతిపక్ష మహిళా ఎమ్మెల్యేలను అవమానించారని మండిపడ్డారు. దీనికి చంద్రబాబు సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎమ్మెల్యే రోజాను ఎయిర్‌ పోర్టులో దిగగానే పోలీసులు అడ్డుకొని లాంజ్‌లో కూర్చోబెట్టారని, ఎందుకు కూర్చొబెట్టారని పోలీసులను అడిగితే దలైలామా వస్తున్నారు ఆయన వెళ్లిపోగానే పంపిస్తామని చెప్పారన్నారు. కానీ రెండు పోలీస్‌ వాహనాల్లో రోజాను ఎక్కించుకొని విజయవాడకు రాకుండా దొడ్డిదారిన గుంటూరు రహదారివైపు మళ్లించారన్నారు. రోజాను కిడ్నాప్‌ చేయాల్సిన అఘత్యం చంద్రబాబుకు ఎందుకు వచ్చిందని జోగి రమేష్‌ ప్రశ్నించారు.  మహిళా సాధికారత అని గొప్పలు చెప్పుకునే చంద్రబాబు ఇదేనా మీ మహిళా సాధికారత అని నిలదీశారు. రాష్ట్రంలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యల గురించి రోజా మీటింగ్‌లో మాట్లాడుతారనే భయం చంద్రబాబుకు ఏర్పడిందన్నారు.  అందుకే కుట్రపూరితంగా రోజాను అరెస్టు చేయించారని మండిపడ్డారు. రోజాపై జరిగిన  దుర్మార్గపు చర్యను రాష్ట్ర ప్రజలంతా ఆలోచించాలి. ఆమె ఆచూకీ చెప్పాల్సిన బాధ్యత చంద్రబాబు సర్కార్, పోలీసులపై ఉందన్నారు.

Back to Top