<strong>కర్నూలుః </strong>వైయస్‌ఆర్‌సీపీ చేపట్టిన 48 గంటల నిరుద్యోగ దీక్షను అవహేళన చేస్తూ టీడీపీ ఎమ్మెల్సీ కేఈ ప్రభాకర్ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా వైయస్‌ఆర్‌సీపీ యువజన విభాగం ఆధ్వర్యంలో కర్నూలు కలెక్టరేట్ వద్ద ధర్నా చేపట్టారు. టీడీపీ నాయకులకు రాష్ట్రంలోనూ విద్యార్థులను, నిరుద్యోగులను మోసం చేయడం అలవాటుగా మారిపోయిందని యువత ఆగ్రహం వ్యక్తం చేశారు. బేషరతుగా కేఈ ప్రభాకర్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేకుంటే ఆందోళనను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. నిరుద్యోగ భృతి,ఖాళీ పోస్టులను భర్తీచేయాలని వైయస్‌ఆర్‌సీపీ విభాగం దీక్షలు చేపడితే కనీసం దీక్ష శిబిరాలను సందర్శించి సంఘీభావం ప్రకటించపోగా అవమానకరంగా వ్యాఖ్యనించడం దారుణమన్నారు. దీక్షలో కూర్చున్న 17 మంది విద్యార్థులు పట్టభ్రదులు కాదా అని ప్రశ్నించారు. టీడీపీ నేతలు దురంహకారంతో ప్రవర్తిస్తున్నారని దుయ్యబట్టారు. అలాగే గతంలో దళిత విద్యార్థులను నక్కా ఆనంద్‌బాబు అవమానించారని గుర్తుచేశారు. విద్యార్థులు, నిరుద్యోగులు వచ్చే ఎన్నికల్లో టీడీపీకి బుద్ధి చెప్పే సమయం ఆసన్నమయ్యిందని హెచ్చరించారు.