జగన్‌ బృందానికి కోల్‌కతాలో ఘన స్వాగతం

కోల్‌కతా, 20 నవంబర్ 2013:

కోల్‌కతా వచ్చిన వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్‌రెడ్డి బృందానికి విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా, రాజ్యాంగంలోని మూడవ అధికరణను సవరించే దిశగా జాతీయ పార్టీల మద్దతు కూడగట్టేందుకు శ్రీ జగన్‌ జాతీయ పార్టీల మద్దతు కూడగట్టేందుకు పర్యటిస్తున్నారు. ఈ క్రమంలో ఆయన తన బృందంతో కలిసి బుధవారం ఉదయం కోల్‌కతా చేరుకున్నారు.

శ్రీ జగన్‌ బృందం మధ్యాహ్నం 12.40 గంటలకు కోల్‌కతా విమానాశ్రయంలో విమానం దిగే సమయానికి అక్కడకు ముందుగానే వచ్చిన తృణమూల్‌ కాంగ్రెస్‌ రాజ్యసభ సభ్యుడు డెరెక్‌ ఓబ్రియన్‌ వారికి స్వాగతం పలికారు. శ్రీ జగన్‌ బృందం కోల్‌కతా వస్తున్న విషయం తెలుసుకున్న తెలుగువారం పెద్ద సంఖ్యలో విమానాశ్రయానికి వచ్చి స్వాగతం పలికారు. 'జై జగన్' నినాదాలతో విమానాశ్రయ పరిసరాలను కోల్‌కతాలోని తెలుగు మారుమోగించారు. అంత మంది తెలుగువారిని చూసిన శ్రీ జగన్‌ 'ఇక్కడ తెలుగువారు చాలా మంది ఉన్నారే' అని వ్యాఖ్యానించారు. తమ బృందానికి స్వాగతం చెప్పడానికి వచ్చిన తెలుగువారిని అభివాదం చేసుకుంటూ శ్రీ జగన్‌ ముందుకు వెళ్ళారు.

విమానాశ్రయం నుంచి‌ శ్రీ జగన్‌ బృందం నేరుగా పశ్చిమ బెంగాల్ రాష్ట్ర సచివాలయానికి 1.30 గంటలకు చేరుకుంది. ముఖ్యమంత్రి కార్యాలయంలో శ్రీ జగన్‌కు ఎదురేగి మమతా బెనర్జీ ఆత్మీయంగా పలకరించి లోనికి ఆహ్వానించారు. అమ్మ ఎలా ఉంది? అని మమత పార్టీ గౌరవ అధ్యక్షురాలు శ్రీమతి విజయమ్మ గురించి కుశల ప్రశ్నలు వేశారు. తనకు తొలి నుంచీ వైయస్ కుటుంబంతో సన్నిహిత సంబంధాలున్నాయని ఆమె ఈ సందర్భంగా అన్నారు.‌ శ్రీ జగన్ తనకు తమ్ముడులాంటి వాడని, ఆయనతోనే తానుంటానని (ఐ యా‌మ్ విత్ జగ‌న్) మమత ఆ తరువాత ‌మీడియా సమావేశంలో వ్యాఖ్యానించారు.

ముందుగా శ్రీ జగన్, మమతా బెనర్జీ ఇద్దరూ ఏకాంతంగా సుమారు పదిహేను నిమిషాలు దేశ రాజకీయాలపై పరస్పరం అభిప్రాయాలను పంచుకున్నారు. ఆ తరువాత నలభై నిమిషాల సేపు అందరూ కలిసి చర్చలు జరిపారు. చర్చలు ముగిసిన తరువాత మమత స్వయంగా శ్రీ జగన్‌కు మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేశారు. భోజనం చేశాక తమ పార్టీ రాజ్యసభ సభ్యుడు డెరెక్‌ను విమానాశ్రయం వరకూ వెళ్లి వీడ్కోలు పలికి రావాలని ఆమె కోరారు.

పశ్చిమ బెంగాల్‌లో కూడా గూర్ఖాలాండ్‌ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం జోరుగా జరుగుతుండటం, విభజన యోచనను మమతా బెనర్జీ తీవ్రంగా వ్యతిరేకిస్తుండటంతో.. ఆంధ్రప్రదేశ్ విభజనకు వ్యతిరేకంగా కూడా ఆమె మద్దతు పొందేందుకు ‌శ్రీ వైయస్ జగన్మోహన్‌రెడ్డి ప్రయత్నిస్తున్నారు.

Back to Top