విద్యుత్తు సమస్యలపై వైయస్ఆర్ సీపీ ర్యాలీ

బొబ్బిలి:

రాష్ట్రంలో విద్యుత్తు కోతల వల్ల వేలాది మంది కార్మికులు వీధిన పడుతున్నారని, అసమర్థ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి వెంటనే రాజీనామా చేయాలని ఎమ్మెల్యే ఆర్‌వీ సుజయ్ కృష్ణ రంగారావు డిమాండ్ చేశారు. విద్యుత్ కొతలు, విద్యుత్ సర్‌చార్జీల పెంపునకు నిరసనగా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు బొబ్బిలి లో భారీ ర్యాలీ తీశారు. ఎమ్మెల్యే ఆర్‌వీ సుజయ్‌కృష్ణ రంగారావు, మున్సిపల్ మాజీ చైర్మన్ బేబీనాయన ఆధ్వర్యంలో జరిగిన భారీ ర్యాలీలో వేలాది మంది విద్యుత్తు వినియోగదారులు, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

     బొబ్బిలి కోట నుంచి చర్చి సెంటర్, సిరిపురపు వీధి, మేదరబంద, మార్కెట్, తాండ్ర పాపారాయ జంక్షన్, పాత బస్టాండ్, గాంధీ బొమ్మ, పోలీస్‌స్టేషన్, కోర్టు జంక్షన్ మీదుగా ఆర్టీసీ కాంప్లెక్స్ వరకు నేతలు ర్యాలీ నిర్వహించారు. ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద నేతలు రోడ్డు మీద బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. అనంతరం అక్కడి నుంచి ట్రాన్స్‌కో డీఈ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు.

     ఈ సందర్భంగా పార్టీ జిల్లా కన్వీనర్ పెనుమత్స సాంబశివరాజు మాట్లాడారు. దివంగత మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి  తన హయూంలో ప్రజలపై ఎలాంటి భారం వేయకుండా పరిపాలించారన్నారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుతం ఇప్పటివరకూ పది సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచి, ప్రజలను ఆర్థికంగా ఇబ్బందులకు గురి చేస్తోందన్నారు.

Back to Top