విదేశాల్లోనూ 'జగన్ కోసం... జనం సంతకం'

హైదరాబాద్, 24 డిసెంబర్ 2012: దివంగత మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి తనయుడు, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహనరెడ్డిపై సీబీఐ కక్ష సాధింపు చర్యలకు వ్యతిరేకంగా చేపట్టిన 'కోటి సంతకాల సేకరణ' రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతోంది. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఇచ్చిన పిలుపు మేరకు దేశ, విదేశాల్లో పలువురు స్వచ్చంధంగా ముందుకు వచ్చి సంతకాలు చేస్తున్నారు. సీబీఐ కక్ష సాధింపు ధోరణులకు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఆదివారంనాడు రాష్ట్రం, దేశంలోనే కాకుండా దుబాయ్‌లోనూ ప్రవాసాంధ్రులు శ్రీ జగన్మోహనరెడ్డి కోసం సంతకాలు చేశారు.

     రాష్ట్రంలోని వేర్వేరు ప్రాంతాల్లో 'జగన్ కోసం... జనం సంతకం' కార్యక్రమం ఊపందుకుంది. కోటి సంతకాలతో రాష్ట్రపతికి వినతిపత్రం ఇవ్వాలన్న పార్టీ పిలుపు మేరకు విశాఖపట్నం ఎంవీపీ కాలనీలోని రైతు బజారులో ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని సంతకాలు చేశారు. సీబీఐ కక్షపూరిత ధోరణులకు నిరసనగా తూర్పు గోదావరి జిల్లా సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు. మండపేటలోని మహానేత విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన వినతిపత్రంపై స్థానిక ప్రజలు, అభిమానులు, పార్టీ కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొని సంతకాలు చేశారు.

     అలాగే శ్రీ వైయస్ జగన్మోహనరెడ్డిని వెంటనే విడుదల చేయాలంటూ కృష్ణాజిల్లాలోని పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన సంతకాల సేకరణ కార్యక్రమంలో పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్న సంతకాల సేకరణ కార్యక్రమానికి ప్రజలు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. శ్రీ జగన్మోహనరెడ్డి మీద ఉన్న అభిమానాన్ని చాటుకుంటున్నారు.

Back to Top